తొలి అమెరికా పెళ్లికొడుకు

17 Jul, 2019 11:28 IST|Sakshi

గ్రేట్‌ ఇండియన్‌  సీరియల్స్‌–24

మిస్టర్‌ యోగి

అబ్బాయికి అన్నీ ఉన్నాయి తాళి కట్టించుకోవడానికి ఒక ఆడపిల్ల మెడ తప్ప... అన్నట్టు ఉంటుంది ఈ సీరియల్‌. ఎన్‌.ఆర్‌.ఐలు ఇండియాకు వచ్చి ఇక్కడ వధువును వెతుక్కోవడానికి అమ్మాయిలను కలిసి వారి గురించి నిర్ణయం తీసుకోవడానికి ఎలా సతమతమవుతారో ‘మిస్టర్‌ యోగి’ సీరియల్‌ 1980లలో దూరదర్శన్‌ ద్వారా ఇంటింటికీ చూపించింది. నవ్వులు పూయించింది.

నేటి యువత పొరుగూరుకు వెళ్లినంత సులువుగా విదేశాలకు వెళ్లి వచ్చేస్తున్నారు. పై చదువులు, ఉద్యోగాలు, అక్కడే సెటిల్‌ అవడం.. వంటి విషయాలు  చాలా సాధారణమై పోయాయి. కానీ, పెళ్లి విషయానికి వచ్చేసరికి దాదాపు ప్రతి ఒక్కరూ స్వదేశంవైపు దృష్టి సారిస్తున్నారు. ఒక్కరుగా వచ్చి పెద్దలు చూసిన పెళ్లి సంబంధాన్ని చేసుకొని జంటగా తిరిగి వెళ్లిపోతున్నారు. అలా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి ‘మిస్టర్‌ యోగి’ విదేశాల్లో విమానం ఎక్కి స్వదేశానికి తిరిగి వచ్చాడు. పెద్దవాళ్లు అప్పటికే సిద్ధంగా ఉంచిన ఓ డజను పెళ్లి సంబంధాలను మన యోగి ముందుంచారు. పన్నెండు సంబంధాలంటే.. 12 మంది అమ్మాయిలను కలవాలి. వారిలో ఎవరిని ఓకే చేసినా తమకు ‘ఓకే’ అన్నారు అమ్మానాన్న. ‘సరే’ అని బయల్దేరాడు యోగి. ఆ పన్నెండు మంది అమ్మాయిలను కలుసుకునే క్రమంలో అతను పడిన ప్రయాసలే ‘మిస్టర్‌ యోగి’ సీరియల్‌.

బుల్లితెరపై మొట్టమొదటి కామెడీ
ఆద్యంతం నవ్వులు పూయించిన ఈ సీరియల్‌ ‘కామెడీ’కి బుల్లితెర  మొదటిసారి వేదికయ్యింది. ఆ తర్వాత ఎన్నో కామెడీ సీరియల్స్‌కి, షోస్‌కి మార్గం సుగమం చేసింది. హాస్యపూరితమైన సన్నివేశాలు, సంఘటనలు ప్రేక్షకుడిని అమితంగా ఆకట్టుకుంటాయని రుజువు చేసింది మిస్టర్‌యోగి.

చిన్నా పెద్దా నవ్వుల కేరింత
ఇది ఇప్పటి మాట కాదు 80ల చివరి కాలం. భారతీయులు అప్పుడప్పుడే కొందరు పై చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లినవారు, వెళుతున్నవారూ ఉన్నారు. అలాంటి రోజుల్లో వచ్చిన ‘మిస్టర్‌ యోగి’ సీరియల్‌ మిలియన్ల మంది భారతీయుల మనస్సులను గెలుచుకుంది. ‘మిస్టర్‌ యోగి’ దూరదర్శన్‌ నిర్మించిన సీరియల్స్‌ అన్నింటిలోనూ ఓ మైలురాయి కావడం విశేషం. 80ల కాలంలో దూరదర్శన్‌లో వచ్చే సీరియల్స్‌ అన్నీ భారతీయ మధ్య తరగతి మానసిక వ్యధకి సంబంధించినవై ఉండేవి. ఆ సమయంలో సమాజంలోని వాస్తవ సంస్కృతిని కళ్లకు కట్టింది మిస్టర్‌ యోగి సీరియల్‌. మిస్టర్‌ యోగి కథ రచయిత ‘మథు రై’ రాసినది. ఈ కథాంశాన్ని ఓ నవల నుంచి తీసుకున్నారు రచయిత. దర్శకుడు కేతన్‌ మెహతా ఈ సీరియల్‌ను తీసిన విధానం అనేక విధాలుగా ప్రేక్షకుడి నోట అద్భుతం అనిపించింది. ఈ సీరియల్‌ను ముఖ్యంగా నాటి ఆధునిక యువతతో పాటు పెద్దలు కూడా చూడటానికి ఇష్టపడ్డారు. ఆ రోజుల్లో దూరదర్శన్‌ ప్రసారం చేస్తున్న అనేక సీరియల్స్‌తో పోల్చితే యోగి సీరియల్‌ అత్యంత తక్కువ వ్యవధిలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 80ల కాలంలో వచ్చిన సీరియల్స్‌తో పోల్చితే ఇది చాలా తక్కువ బడ్జెట్‌తో కూడినది. అంతేకాదు, ఇది వాస్తవ పద్ధతులకు చాలా దగ్గరగా ఉండేది..

ఓమ్‌పురి గొంతుకతో...
ప్రతి ఎపిసోడ్‌కు ముందు బాలీవుడ్‌ అగ్రనటుడు దివంగత ఓమ్‌పురి యోగి ఏం చేయబోతున్నాడో చెబుతూ ఉండటం ఈ సీరియల్‌లో మరో విశేషం. ఆ విధంగా మిస్టర్‌ యోగి ఎపిసోడ్స్‌ అన్నీ తర్వాత రాబోయే సంఘటననూ క్తుప్తంగా చూపిస్తుంది. ఏ సీరియల్స్‌లోనూ ప్రయత్నించని భిన్నమైన స్టైల్‌ ఇది. మొత్తం 13 ఎపిసోడ్లు. వీటిలోని ప్రతీ సన్నివేశం ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూయించింది. తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ, భావోద్వేగాలను చాలా చక్కగా చూపుతుంది. అంతేకాదు, ఈ సీరియల్‌ ద్వారా చాలా మంది నటీనటులు పరిచయమయ్యారు.

వరుడు మిస్టర్‌ యోగి
బక్కపలచగా ఉండే వ్యక్తి బుల్లితెరపై కనిపించినప్పుడు ఇతడేం అలరిస్తాడు ప్రేక్షకులను అనుకున్నారు అంతా. 1988లో బుల్లితెర ద్వారా నట్టింట్లో అడుగుపెట్టిన యోగి నాలుగునెలల పాటు ప్రేక్షకులను అమితంగా అలరించాడు. ఎంబిఎ చేసి అమెరికాలో సెటిల్‌ అయిన యోగేష్‌ ఐశ్వర్యాలాల్‌ పటేల్‌ అనే మిస్టర్‌ యోగి 12 మంది అమ్మాయిలను కలిసే క్రమంలో ప్రతి వధువు దగ్గర తన గురించి చెప్పుకోవడం, అతి మర్యాదలు, అసందర్భాలు.. అనేక సందర్భాల్లో ప్రేక్షకులను నవ్విస్తాయి. వీరిలో యోగి ఎవరిని తనకు సరి జోడీగా ఎంచుకుంటాడా అని  ఎదురు చూడటం ఆసక్తిగా మారింది ప్రేక్షకులకు.

మోహన్‌ గోఖలే
80ల కాలంలో అత్యంత ప్రతిభావంతులైన కళాకారులలో మోహన్‌ గోఖలే ఒకరు. భారతీయ సినిమా, టెలివిజన్, నాటకం, ఆర్ట్‌ ఫిల్మ్స్‌లో పేరొందిన మోహన్‌ మిస్టర్‌ యోగి సీరియల్‌ ద్వారా దేశవ్యాప్త పేరు సంపాదించుకున్నారు. మరాఠీ టీవీ సీరియల్స్, సినిమాల్లోనూ నటించిన మోహన్‌ దూరదర్శన్‌లో ‘భారత్‌ ఏక్‌ ఖోజ్‌’ సీరియల్‌లోనూ నటించారు. మోహన్‌ కుటుంబ సభ్యుల్లో దాదాపు అందరూ సినిమా, థియేటర్‌ రంగాలలో ఉన్నవారే. తండ్రి సీనియర్‌ జర్నలిస్ట్‌. సోదరుడు విక్రమ్‌ గోఖలే మరాఠీ నాటకాల్లో పేరొందిన నటుడు. భార్య శుభాంగి మరాఠీ నాటకం, సినిమా, టెలివిజన్‌ నటి. కూతురు సఖి గోఖలే మరాఠీ టెలివిజన్, థియేటర్‌ ఆర్టిస్ట్‌. మోహన్‌ 45వ ఏట గుండెపోటుతో మరణించారు.

వధువు.. పల్లవి జోషి
హీరోతో పాటు హీరోయిన్‌ పల్లవి జోషి కూడా ఈ సీరియల్‌ ప్రముఖ పాత్ర పోషించారు. పల్లవి జోషి ఇండియన్‌ నటిగా అప్పటికే దేశమంతా ఆమె పరిచయం. యోగి సీరియల్‌లో ఆమె నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలను అందుకున్నారు.– ఎన్‌.ఆర్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు