కృష్ణ పరవశం

22 May, 2019 00:25 IST|Sakshi

రాముణ్ణి సీరియల్‌ హీరోగా చేయొచ్చని ‘రామాయణ్‌’ ద్వారా గ్రహించిన రామానంద్‌ సాగర్‌ కృష్ణుడి వేణుగానంతో 200 ఎపిసోడ్లు తీయవచ్చని నిరూపించాడు. శ్రీకృష్ణుడిపై నిర్మించిన ‘శ్రీకృష్ణ’ సీరియల్‌ ఆ విహారి విశ్వరూపాన్ని ఇంటింట్లో ప్రత్యక్షం చేయించింది. ఆ కృష్ణ పరవశం నేటికీ మరపురానిది.

బాల్యంలో కన్నతల్లి దేవకి అయినా పెంచిన తల్లి యశోద దగ్గర  అల్లారుముద్దుగా పెరుగుతాడు కృష్ణుడు. రామానంద్‌సాగర్‌ దేవకిలా శ్రీకృష్ణ సీరియల్‌కి ప్రాణం పోస్తే.. తాను యశోదలా మురిపెంగా పెంచి ప్రతి ఒక్కరి కళ్లకు కట్టింది దూరదర్శన్‌. 1993 నుంచి 1996 వరకు నాలుగేళ్ల పాటు శ్రీకృష్ణ లీలలను ప్రసారం చేసింది గ్రేట్‌ ఇండియన్‌ టెలివిజన్‌. 90ల కాలంలో బుల్లితెరకు దాదాపు వందకోట్ల ఆదాయం తెచ్చిన సీరియల్‌ శ్రీకృష్ణ కావడం విశేషం.కృష్ణుడి గురించి దేశమంతా తెలుసు. కథలు కథలుగా కృష్ణుడు ప్రతి ఇంటి బిడ్డడే. ఆ అల్లరి, కొంటెతనం తెలియనివారుండరు. ఆ వెన్నదొంగను అప్పటికే సినిమా పరిశ్రమ ఎన్నో విధాల పరిచయం చేసింది.

మళ్లీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది అనుకోలేదు రామానంద్‌సాగర్‌. అప్పటికే రామాయణానికి ముందు తన పేరును సార్థకం చేసుకున్న రామానంద్‌సాగర్‌ రాముడు తర్వాత మరో పురాణ పురుషుడిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనుకున్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడిని అప్పటికే జనం చూసి ఉన్నారు. తిరిగి కృష్ణుడిని చూడాలంటే ఓ ప్రత్యేకత ఉండాలి. అందుకే భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, హరివంశం, విష్ణుపురాణం, పద్మపురాణం, గర్గ సంహిత, భగవద్గీత, మహాభారత్‌ గ్రం«థాల నుంచి కృష్ణుడున్న ప్రతీ సన్నివేశాన్ని తీసుకున్నారు. ఆసక్తిగా మలుచుకున్నారు. మూడేళ్ల పాటు టీవీ ప్రేక్షకులను కృష్ణలీలలతో అలరించారు.

రాక్షస సంహారమే ప్రధానం
కంసుడు తన చెల్లెలు దేవకి – బావ వసుదేవుడిని బంధించి చెరసాలలో ఉంచుతాడు. యోగులకు, దేవతలకు తాను భూమ్మీద జన్మిస్తున్నట్టు చెబుతాడు వైకుంఠ నారాయణుడు. దేవకి కడుపున అష్టమసంతానంగా జన్మిస్తాడు నారాయణుడు. కంసుడి కంటపడకుండా ఉండటానికి వసుదేవుడు ఆ బిడ్డను గంపలో పెట్టుకొని అర్ధరాత్రి కారాగారాన్ని ముంచేస్తున్నట్టు పరవళ్లు తొక్కుతున్న యమునా నదిని దాటుకొని రేపల్లెలో ఉన్న నందుని ఇంటికి చేరుతాడు. యశోద ప్రసవించిన ఆడబిడ్డను తీసుకొని, తన కొడుకును ఆమె పక్కన పడుకోబెట్టి తిరిగి కారాగారం చేరుకుంటాడు. దేవకి ప్రసవించిందని తెలుసుకున్న కంసుడు ఆ బిడ్డను చంపడానికి కత్తి ఎత్తుతాడు.

దాంతో ఆ బిడ్డ అదృశ్యమై తను యోగ మాయ అని, తాను దేవకి బిడ్డ కాదని, రేపల్లెలో కృష్ణుడు పెరుగుతున్నాడని, అతడే కంసుడిని హతమారుస్తాడని చెప్పి అదృశ్యమౌతుంది. అప్పటినుంచి కంసుడు రేపల్లెలో పెరుగుతున్న కృష్ణుడిని చంపడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. యశోదా గారాబు తనయుడిగా కృష్ణుడు రేపల్లెలో చేయని అల్లరంటూ ఉండదు. గోకులంలో గోవర్ధానాన్ని ఎత్తి యాదవులందరినీ కాపాడిన విధం, సాందీపుని ఆశ్రమంలో నేర్చిన విద్య, రాక్షసులను సంహరించి, తన బలగాన్నంతా కాపాడుకున్న విధం... చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి మనసును గెలుచుకుంది. కృష్ణుడి బాల్యంతోపాటు కౌమారం అటు నుంచి రాధాకృష్ణుల ప్రేమనూ బుల్లితెర మీద హృద్యంగా చూపారు దర్శకులు.

మంచి పక్షాన నిలిచిన దైవం
బృందావనం నుంచి ద్వారక చేరి మామ కంసుడిని హతమార్చి తల్లిదండ్రులని చెరసాల నుంచి విడిపించిన బలరామకృష్ణుల గాధలను టీవీ కట్టేసినా మరచిపోలేక పోయారు ప్రేక్షక జనం. ద్వారకా నగరం, అక్కడ కృష్ణుడి వైభవంతోపాటు తనను కోరి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదరించే సుగుణాన్ని ఎంతో అందంగా కళ్లకు కట్టారు. భారత యుద్ధ సమయంలో అర్జునుడు–దుర్యోదనాదుల రాక, యుద్ధంలో పాండవుల పక్షాన కృష్ణుడు పాల్గొనడం.. వంటి ఘట్టాలనూ చూపారు. కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు కృష్ణుని కథ పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది. మహాభారతం చివరిలో కృష్ణుని నిర్యాణంతో సీరియల్‌ ముగుస్తుంది.

– ఎన్‌.ఆర్‌

వందకోట్ల కృష్ణుడు
1993లో బుల్లితెరమీద ప్రత్యక్షమైన శ్రీ కృష్ణ సీరియల్‌ను 1995లో బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డ్‌ వరించింది. వందకోట్ల సంపాదనతో దూరదర్శన్‌ ద్వారకానగర వైభవమంత వెలిగిపోయింది ∙ సిరివెన్నెల సినిమా హీరో సర్వదమన్‌ డి. బెనర్జీ. కృష్ణుడిగా బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు ∙శ్రీ కృష్ణ సీరియల్‌ను రామానందసాగర్, సుభాష్‌ సాగర్, ప్రేమ్‌సాగర్‌లు ‘సాగర్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ ద్వారా నిర్మించారు. దర్శకులు రామానంద్‌సాగర్, ఆనంద్‌సాగర్, మోతీసాగర్‌లు ∙యువ కృష్ణుడిగా స్వాప్నిల్‌ జోషి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కృష్ణుడుగా బెనర్జీ నటించారు.

స్వాప్నిల్‌ జోషి కన్నా బెనర్జీ కృష్ణుడిగా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరస్థానాన్ని పొందారు. అందుకు బెనర్జీ రూపమే కాదు చిరుమందహాసం, నటన జనాన్ని అమితంగా ఆకట్టుకున్నాయి ∙రవీంద్ర జైన్‌ ఈ సీరియల్‌ సంగీతాన్ని అందించారు. ‘శ్రీ కృష్ణ గోవింద్‌ హరే మురారీ’ టైటిల్‌ సాంగ్‌ ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా చాలా పాపులర్‌ అయ్యింది ∙ఈ సీరియల్‌ మారిషస్, నేపాల్, సౌత్‌ ఆఫ్రికా, జకర్తా, థాయిలాండ్‌ టీవీలు సైతం ప్రసారం చేశాయి ∙ఆ తర్వాత వివిధ చానెల్స్‌లో ప్రసారమైన జై శ్రీ కృష్ణ, రాధా కృష్ణ, పరమావతార్‌ శ్రీ కృష్ణ.. వంటి సీరియల్స్‌ ప్రేక్షకులను అలరించాయి. అలరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు