జానె కహా గయే వొ దిన్...

9 Aug, 2015 23:06 IST|Sakshi
జానె కహా గయే వొ దిన్...

గ్రేట్ మాస్టర్స్

1971లో జై కిషన్ చనిపోయినప్పుడు బొంబాయి మొత్తం భోరుమంది. 41 సంవత్సరాలకే తుది శ్వాస విడిచిన ఆ గొప్ప సంగీతకారుడి అంతిమయాత్రలో అందరూ వేలాదిగా పాల్గొన్నారు. జై కిషన్ రోజూ కూర్చునే చర్చ్‌గేట్‌లోని ఒక హోటల్‌లోని ఒక టేబుల్ మీద నెల రోజుల పాటు క్యాండిల్ వెలిగించి వేరొకరు కూర్చోకుండా ఘనంగా నివాళి అర్పించారు. మరి శంకర్ చనిపోయినప్పుడు? శంకర్- జైకిషన్ జోడిలోని అంతే గొప్ప ఆ సంగీతకారుడు 1987లో చనిపోయినప్పుడు     ఆ సంగతి ఎవరికీ తెలియదు. పేపర్లలో కూడా ఆ వార్త మొక్కుబడిగా వచ్చింది. ఆయన అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు తప్ప వేరెవరూ పాల్గొనలేదు.

ఆఖరుకు రాజ్‌కపూర్ కూడా. జైకిషన్ చనిపోయాక శంకర్     తన ఘన పరంపరను అదే జోడీ పేరు మీద కొనసాగించడానికి చాలా పెనుగులాడాడు. అయితే కెరీర్ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆయన కోపం, ముక్కుసూటితనంతో అవస్థలు పడ్డవాళ్లంతా ఆయనను ఇబ్బంది పెట్టడానికి చూశారు. ఆర్కెస్ట్రాను కుదించి తక్కువ ఆర్కెస్ట్రాతోనే హిట్స్ ఇమ్మని కోరారు. లతా మంగేష్కర్‌తో వైరం (మరో గాయని శారదను ప్రోత్సహించాడన్న కారణంగా) కూడా ఆయనకు శాపంగా మారింది. మహమ్మద్ రఫీ జోక్యం చేసుకుని శంకర్‌కు లతాకు సంధి కుదిర్చితే ‘సన్యాసి’ సినిమాలో శంకర్ కోసం ఆమె పాడింది. ‘చల్ సన్యాసి మందిర్ మే’ పెద్ద హిట్. అయినప్పటికీ శంకర్‌కు పాత ప్రభ రాలేదు. సింహం గుహకే పరిమితమైంది. అది చనిపోయి ఉండవచ్చు. కాని దాని గర్జనలు నేటికీ ఏ నాటికీ వినిపిస్తూనే ఉంటాయి.

 

మరిన్ని వార్తలు