గ్రేట్‌ రైటర్‌: డి.హెచ్‌.లారెన్స్‌

15 Oct, 2018 00:33 IST|Sakshi

డేవిడ్‌ హెర్బర్ట్‌ లారెన్స్‌ (1885–1930) ఆంగ్ల కవి, రచయిత. ఇంగ్లండ్‌లోని కార్మికుల ఇంట్లో పుట్టిన లారెన్స్‌ తన హృదయంలో నిలుపుకొన్న గ్రామసీమల గురించి రాశాడు. వాటిల్లో తీవ్రస్వరంతో లైంగికత, జీవశక్తి, ఉద్వేగ సంబంధ ఆరోగ్యం వ్యక్తమయ్యాయి. ఈ కారణంగా వివాదాస్పద రచయితగా ముద్రపడ్డాడు.  తనకున్న విశేషమైన ప్రజ్ఞను బూతుచిత్తరువులు రాయడం కోసం వృథా చేసినవాడిగా అపఖ్యాతి పాలయ్యాడు. ఈ దాడిని తట్టుకోలేక స్వచ్ఛంద దేశ బహిష్కారం విధించుకున్నాడు.

ఆరేళ్లు పెద్దదైన, ముగ్గురు పిల్లల తల్లి ఫ్రీడా వీక్లీతో కలిసి జర్మనీ పారిపోయాడు. ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియా, ఇటలీ, శ్రీలంక, అమెరికా, మెక్సికో లాంటి దేశాలు తిరుగుతూ తమ విహారేచ్ఛను సంతృప్తిపరుచుకున్నారు. అయితే జర్మనీ, ఫ్రాన్స్‌ మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు బ్రిటిష్‌ ఏజెంట్‌గా అనుమానాలు ఎదుర్కొన్నాడు. తల్లితో గాఢమైన అనుబంధం కలిగిన లారెన్స్, కేన్సర్‌తో ఆమె మరణించినప్పుడు కదిలిపోయాడు. ఆ సంవత్సరమంతా అనారోగ్య సంవత్సరంగానే గడిపాడు. నిమోనియా, మలేరియాతో తానూ చాలాసార్లు బాధపడ్డాడు. హోమోసెక్సువాలిటీ ఆలోచనలు కలిగినట్టుగా కనిపిస్తాడు. పైకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గొప్పవాళ్లందరికీ అటువైపు మొగ్గుంటుంది అని వ్యాఖ్యానించాడు. అయితే లారెన్స్‌ విషయంలో ఒక ఆకర్షణగా అది కనబడినా, లైంగిక సంబంధం దాకా పోయినట్టుగా ఆధారాలు లేవు. 

క్షయ వ్యాధి కారణంగా 45 ఏళ్ల వయసులో మరణించాకగానీ లారెన్స్‌ రచనా విశిష్టతను సాహిత్యలోకం అంచనా కట్టలేకపోయింది. ‘సన్స్‌ అండ్‌ లవర్స్‌’, ‘ద రెయిన్‌బో’, ‘లేడీ ఛాటర్లీస్‌ లవర్‌’, ‘విమెన్‌ ఇన్‌ లవ్‌’ ఆయన ప్రసిద్ధ రచనలు. 

మరిన్ని వార్తలు