గ్రేట్‌ రైటర్‌

29 Jan, 2018 00:30 IST|Sakshi

హెర్మన్‌ హెస్సె

చిన్నతనంనుంచే పొగరుబోతుగా కనబడేవాడు హెర్మన్‌ హెస్సె (1877–1962). దానికి తన తెలివితేటలే కారణం. స్నేహితులతో కన్నా పుస్తకాలతో ఎక్కువగా గడిపేవాడు. దానివల్ల వారితో కలిసిన సందర్భాల్లో వారిలో ఇమడలేక ఇబ్బంది పడేవాడు. అంతెందుకు, తన కుమారుడికి నాలుగేళ్ల వయసుకే ఇంత విస్మయం గొలిపే మెదడు ఎలా ఉందని ఆశ్చర్యపోతూ భర్తకు ఉత్తరం రాసింది హెస్సె వాళ్లమ్మ. పుట్టుకతో జర్మనీయుడైన హెస్సె వేదాంతం, తత్వశాస్త్రం, గ్రీకు పురాణాలు ఎక్కువ చదివి, వాటి సారాన్ని జీర్ణించుకున్నాడు. ఇక రచయితగా అవతరించడంలో ఆశ్చర్యం ఏముంది! గౌతమబుద్ధుడి జీవితపు సారాన్ని సిద్ధార్థుడనే సాధారణ మానవుడికి ఆపాదించి, అతడు బుద్ధుడి(జ్ఞాని)గా పరిణామం చెందిన తీరును చిత్రించిన ‘సిద్ధార్థ ’ హెస్సె క్లాసిక్స్‌లో ఒకటి. ఇది హెస్సె మీద భారతీయ సారస్వతపు ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ నవల ఆధారంగా అదే పేరుతో శశికపూర్‌ ప్రధాన నటుడిగా సినిమా కూడా వచ్చింది. ‘దేమియాన్‌’, ‘స్టెపెన్‌వూల్ఫ్‌’, ‘ద గ్లాస్‌ బీడ్‌ గేమ్‌’ ఆయన ఇతర ప్రసిద్ధ నవలలు. 1946లో నోబెల్‌ పురస్కారం పొందిన హెస్సె, నిన్ను నువ్వు వదిలేసుకోవాలి, ఆకాశంలోని మేఘంలా; నిరోధించకు, అంటాడు.

మరిన్ని వార్తలు