కోగో నోడా ( గ్రేట్‌ రైటర్‌ )

3 Sep, 2018 00:26 IST|Sakshi

ఆనందమంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సినిమాకళ ప్రేమికులు ఇవ్వగలిగే జవాబుల్లో ఒకటి: యాసుజిరో ఓజు సినిమాలను చూడగలగడం! ఈ జపాన్‌ దర్శకుడి చిత్రాల్లోని పాత్రల పరిణామం, అవి ఒక తార్కిక ముగింపునకు చేరే తీరు సహజంగా, అంతకంటే సున్నితంగా ఉంటుంది. జపాన్‌ ఆత్మను ఈ చిత్రాల్లో దర్శించవచ్చు. ఈ ప్రపంచ మేటి దర్శకుడి నిజమైన బలం రచయిత కొగో నోడా(1893–1968). పాత్రికేయుడిగా, స్టూడియో రచయితగా పనిచేశారు నోడా ముందు. ఓజు తొలి చిత్రం, 1927 నాటి మూకీ ‘స్వోర్డ్‌ ఆఫ్‌ పెనిటెన్స్‌’తో వీరి స్నేహం మొదలైంది. టాకీల నుంచి రంగుల చిత్రాల దాకా, ఓజు మరణించే 1963 వరకు అది కొనసాగింది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘టోక్యో స్టోరీ’, ‘లేట్‌ స్ప్రింగ్‌’, ‘ఫ్లోటింగ్‌ వీడ్స్‌’, ‘యాన్‌ ఆటమ్‌ ఆఫ్టర్‌నూన్‌’ లాంటి కళాఖండాలన్నింటికీ స్క్రీన్‌రైటర్‌  కొగో నోడా. తరాల మధ్య అంతరాలనూ, కుటుంబ సంబంధాల్లోని గాఢతనూ ఇవి గొప్పగా చూపుతాయి. సుమారు 25 సినిమాలకు వీళ్లు కలిసి పనిచేశారు. ఒక కథను ప్రారంభించే ముందు ఓజు, నోడా ఎక్కడో ఏకాంతంగా ఒక గదిని తీసుకునేవారట. ఆ కాలంలో తాగి పడేసిన మద్యపు సీసాల్ని బట్టి స్క్రిప్టు ఎంత బలంగా వచ్చిందో చెప్పొచ్చని జోక్‌ చేసేవాడు ఓజు.
 

మరిన్ని వార్తలు