మార్గరెట్‌ మిషల్‌

27 May, 2019 01:02 IST|Sakshi

గ్రేట్‌ రైటర్‌

నాలుగేళ్లు పాత్రికేయురాలిగా పనిచేశారు మార్గరెట్‌ మిషల్‌ (1900–1949). ఆమె రాసే కథనాలు వర్ణనాత్మకంగా ఉండేవి. అయితే కాలినొప్పి వల్ల ఉద్యోగం మానేయాల్సివచ్చి, పూర్తిస్థాయి భార్యగా ఉండిపోదామనుకున్నారు. ఆ సమయంలో మార్గరెట్‌ భర్త ఆమె మనసు మళ్లించడానికి పుస్తకాలు తెచ్చిచ్చేవాడు. చిన్నతనం నుంచే చదువరి అయిన మార్గరెట్‌ గుట్టల కొద్దీ పుస్తకాలు చదివేది. వెయ్యి పుస్తకాలు చదివే బదులు నువ్వే ఒకటి ఎందుకు రాయకూడదూ అన్నాడోరోజు భర్త. అలా మొదలుపెట్టిన నవల ‘గాన్‌ విత్‌ ద విండ్‌’.

మార్గరెట్‌ మిషెల్‌ తండ్రి తరఫు, తల్లి తరఫు తాతలు స్కాట్లాండ్, ఐర్లాండ్‌ నుండి అమెరికాకు బతకడానికి పోయినవాళ్లు. బ్రిటన్‌తో అమెరికా స్వాతంత్య్రం కోసం పోరాడినవాళ్లు. అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో నివాసం ఏర్పరుచుకున్నవాళ్లు. ఉత్తరాది రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడ పరిశ్రమల కన్నా వ్యవసాయానికి ప్రాధాన్యం. కుటుంబ వ్యవస్థలు బలంగా ఉంటాయి. బానిసత్వం అంగీకార విలువ. 1860ల్లో మొదలైన అమెరికా అంతర్యుద్ధంలో ‘యూనియన్‌’ నుంచి విడిపోయేందుకు పోరాటం చేసి ఓడిపోయాయి. ఈ నేపథ్యంలో 1936లో రాసిన గాన్‌ విత్‌ ద విండ్‌ మహాభారతమంత విస్తృతమైనది.

ఇది కేవలం చరిత్రే కాదు, మనుషుల స్వభావాలను వడగట్టి రూపుదిద్దిన పాత్రల వల్ల నవలే ఒక చరిత్రైపోయింది. మూడు కోట్ల కాపీలు అమ్ముడుపోయాయి. బైబిల్‌ తర్వాత అమెరికన్లకు బాగా నచ్చిన పుస్తకంగా దీనికో సందర్భంలో ఓటు వేశారు. అదే పేరుతో సినిమాగా కూడా వచ్చి క్లాసిక్‌గా నిలిచింది. మిషెల్‌ జీవించివుండగా ప్రచురించిన ఏకైక నవల అదే(దీన్ని ‘చివరికి మిగిలింది’ పేరిట ఎం.వి.రమణారెడ్డి సంక్షిప్తంగా తెలుగులోకి అనువదించారు). ఒక తాగుబోతు వేగంగా నడుపుతున్న వాహనంతో ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తూ 48వ ఏటే మరణించారు. కౌమారబాలికగా రాసిన కొన్ని రచనలను ఆమె మరణానంతరం ప్రచురించారు.

మరిన్ని వార్తలు