కమ్యూనిస్టు – డాక్టరు – రచయిత్రి

13 Apr, 2020 01:38 IST|Sakshi
రషీద్‌ జహాన్‌

గ్రేట్‌ రైటర్‌

నాలుగు అగ్నికణాలు కలిసి ఒక తుఫాన్‌ను సృష్టించాయి. అది 1932 శీతాకాలం. ఉత్తర ప్రదేశ్‌లోని నలుగురు యువతీ యువకులు కలిసి ‘అంగారే’ (అగ్నికణాలు) పేరుతో ఉర్దూలో పది చిన్న కథలు, నాటికల సంకలనం వేశారు. అది ఆనాటి రాజకీయ, సామాజిక వ్యవస్థపై యువతరం ప్రకటించిన యుద్ధం. దీనికి కేంద్ర బిందువైన రషీద్‌ జహాన్‌ కోపోద్రిక్త యువరచయిత్రిగా గుర్తింపు పొందింది.

ఏడాది తిరక్కుండా అసెంబ్లీ ఆ పుస్తకాన్ని నిషేధించింది. అగ్నికణాల రషీద్‌ జహాన్‌గా పేరుపడ్డ ఆమె నిషేధానికి భయపడలేదు. తన భావాలతో కొందరిని విసిగిస్తూ, రెచ్చగొడుతూ కొత్త తరానికి ప్రేరణ అయ్యింది. అప్పటికి 14 ఏళ్ళ వయసున్న ఇస్మత్‌ చుగ్తాయ్‌ ఈమె నుంచే ప్రేరణ పొంది, ఆ తరువాత ప్రముఖ రచయిత్రిగా గుర్తింపు పొందింది. ‘ఆమె నన్ను పూర్తిగా చెడగొట్టింది. ఆమె చాలా ధైర్యస్తురాలు. ఏ విషయమైనా, నిర్భయంగా, బహిరంగంగా మాట్లాడేది. నేను అచ్చం ఆమెలాగానే ఉండాలనుకున్నాను’ అని రషీద్‌ జహాన్‌ గురించి ఇస్మత్‌ చుగ్తాయ్‌ తన ఆత్మకథలో రాసింది.

ప్రగతిశీల భావాలున్న అలీఘడ్‌లోని ఒక కుటుంబంలో రషీద్‌ జహాన్‌ 1905లో జన్మించింది. ఆమె తండ్రి షేక్‌అబ్దుల్లా స్త్రీల విద్య, విజ్ఞానాల కోసం ‘ఖాతూన్‌’ అనే ఉర్దూ పత్రికను నడిపేవాడు. చిన్న తనం నుంచి స్త్రీ విద్యే ఊపిరిగా జీవించిన రషీద్‌ 19 ఏళ్ళ వయసులో సైన్సులో పట్టా పొంది, మరో అయిదేళ్ళకు ఢిల్లీలో వైద్యవిద్యను పూర్తి చేసుకుంది. తొలితరం ఉర్దూ రచయిత్రి మాత్రమే కాదు, తొలితరం స్త్రీ వైద్యురాలిగా కూడా గుర్తింపు పొందింది. అప్పటి వరకు నిషేధించినట్టు చూసిన లైంగిక ఆరోగ్యం, గర్భధారణ, గర్భస్రావం, కుటుంబ నియంత్రణ, స్త్రీల లైంగిక జడత్వం వంటి అంశాలపైన ఆమె రాయడానికి ప్రయత్నించింది.

1933లో భారత కమ్యూనిస్టు పార్టీలో పూర్తికాలపు సభ్యురాలిగా చేరింది. ఆ మరుసటి సంవత్సరం తన సహ రచయిత మహమ్మద్‌ జఫ్ఫార్‌ను వివాహం చేసుకుంది. అతను ఇంగ్లాడ్‌ వెళ్ళి ‘అభ్యుదయ రచయితల సంఘం’(పీడబ్ల్యూఏ) ముసాయిదా ప్రణాళికను పట్టుకొచ్చాడు. ‘అంగార్‌’ రచయితల భావాలు భారత దేశంలో ఏర్పడిన ‘అభ్యుదయ రచయితల సంఘం’ ప్రణాళికలో ప్రతిధ్వనించాయి. లక్నోలో 1936 లో ప్రేమ్‌చంద్‌ అధ్యక్షతన జరిగిన అభ్యుదయ రచయితల సంఘం ప్రథమ మహాసభల నిర్వహణలో రషీద్‌ కీలక పాత్ర పోషించింది. అమృత్‌సర్‌లో కొంత కాలం వైద్యవృత్తిని కొనసాగిస్తూ, అక్కడి కార్మిక వర్గం కోసం పాటుపడింది. ఆ తరువాత డెహ్రాడూన్‌ వచ్చి అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం (ఏబీపీడబ్ల్యూఏ) కార్యక్రమాలలో పూర్తిగా మునిగిపోయింది.

ఆమె పాతిక నుంచి 30 కథలు, 15 నుంచి 20 లఘు నాటికలు రాసినట్టు లెక్క. వాటిలో చాలా మటుకు లభ్యం కావడం లేదు. ‘ఆమె స్త్రీ పాత్రలు లేచి నిలబడ్డాయి. ధిక్కరించాయి. ప్రతిఘటించాయి. అవి సంకల్ప బలం ఉన్న పాత్రలు’ అని సాహిత్య చరిత్రకారిణి మధులికా సింగ్‌ రాస్తారు. ‘దిల్లీకే షైర్‌’(ఢిల్లీ యాత్ర) అన్న ఆమె కథ చాలా ప్రశంసలు పొందింది. ‘పర్దే కే పీఛే’(బురఖా వెనుక) అన్న చిన్న నాటిక కూడా ఎంతో పేరు తెచ్చింది. ఇది ‘అంగారే’లో ప్రచురితమైంది. ‘ఇఫ్తారి’, ‘గరీబోంకా భగవాన్‌’, ‘ఇస్తికార’ వంటి కథలు ద్వంద్వ విలువల కపటత్వాన్ని బహిర్గతం చేశాయి. రక్షిందా జలీల్‌ రాసిన రషీద్‌ జహాన్‌ జీవిత కథకు రాసిన ముందు మాటలో ఆమె మేనల్లుడు, భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సల్మాన్‌ హైదర్‌ ఇలా అంటారు: ‘ఆమె కమ్యూనిస్టు సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఎక్కడికెళ్లినా మఫ్టీ పోలీసులు  వెన్నాడేవారు.

’ స్త్రీ వైద్య నిపుణురాలిగా, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా, ‘చింగారి’ అనే ఉర్దూ సాహిత్య పత్రిక సంపాదకురాలిగా బహుముఖాలుగా కృషి చేసింది. అయినా తనను ‘కామ్రేడ్‌ రషీద్‌ జహాన్‌’ గా పిలిపించుకోవడానికే ఇష్టపడేది. గర్భాశయ క్యాన్సర్‌కు మాస్కోలో చికిత్స పొందుతూ 1952 లో తుదిశ్వాస విడిచింది. అప్పుడామె వయసు 47 సంవత్సరాలు. ‘కమ్యూనిస్టు– డాక్టరు– రచయిత్రి’ అన్న మూడు మాటలు మాస్కోలోని ఆమె సమాధిపైన శిలాక్షరాలుగా వెలుగుతూనే ఉంటాయి.
(మూలం : అబిద్‌ ఖాన్, అక్షయ చవాన్‌ వ్యాసం)
 - డా‘‘ ఎస్‌.జతిన్‌ కుమార్‌

రషీద్‌ నన్ను పూర్తిగా చెడగొట్టింది. ఏ విషయమైనా, నిర్భయంగా, బహిరంగంగా  మాట్లాడేది. నేను అచ్చం ఆమెలాగానే ఉండాలనుకున్నాను.
– ఇస్మత్‌ చుగ్తాయ్‌

మరిన్ని వార్తలు