గ్రేట్‌ రైటర్‌

2 Jul, 2018 01:28 IST|Sakshi

ఫ్రాన్స్‌ దేశీయుడైన రోమా రోలో రచనలకు మనిషి కేంద్ర బిందువు. ఆయన మానవతావాది. యుద్ధాన్నీ, ఫాసిజాన్నీ వ్యతిరేకించాడు. ఆయన ఉద్గ్రంథం ‘జాన్‌ క్రిస్టఫె’ పది సంపుటాల నవల. ఫ్రాన్స్‌ను తన రెండో ఇల్లుగా మలుచుకున్న ఒక జర్మన్‌ సంగీత మేధావి రూపంలో తన ఆదర్శాలు, ఆసక్తులు, దేశాల మధ్య అవగాహనలు విశదంగా వ్యక్తం చేశాడు. నాటకం, నవల, చరిత్ర, వ్యాసం ప్రక్రియల్లోనూ కృషి చేశాడు. నాటకరంగాన్ని ప్రజాస్వామీకరించడానికి నడుం బిగించాడు. తూర్పు దేశాల తత్వశాస్త్రం, ముఖ్యంగా భారత్‌ వేదాంతం ఆయన్ని ఆకర్షించింది. టాగూర్, గాంధీజీలతో సంభాషించాడు. గాంధీ మీద పుస్తకం రాశాడు. వయసులో పెద్దవాడైనప్పటికీ సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ మీద ఆయన ప్రభావం ఉంది. వారిరువురూ ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపారు. ఈ విశ్వంలో తానూ ఒకడిగా ఉన్నాననే మనిషి సంవేదనను వ్యక్తపరిచే ‘ఓషియానిక్‌ ఫీలింగ్‌’ పదబంధాన్ని సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌కు రాసిన ఓ లేఖలో సృష్టించాడు. ఈ మానవతావాదిని 1915లో నోబెల్‌ సాహిత్య పురస్కారం వరించింది. 1866–1944 ఆయన జీవనకాలం. రోమా స్నేహితుడు, రోమా జీవిత చరిత్ర రాసిన స్టెఫాన్‌ త్సైక్‌ ఆయన్ని ‘ఐరోపా నైతిక చేతన’గా అభివర్ణించాడు.
 

మరిన్ని వార్తలు