-

గ్రేట్‌ రైటర్‌ విలియం గోల్డింగ్‌

18 Feb, 2019 01:59 IST|Sakshi

కరేంజా అంటే ప్రేమ అని అర్థం, కార్నిష్‌ భాషలో. బ్రిటన్‌లో ఒక మైనారిటీ తెగ అయిన కార్నిష్‌ ప్రజల ఈ భాష ఇప్పుడు అంతరించిపోయింది. ఇంగ్లిష్‌ వాళ్లు, బ్రిటిష్‌ వాళ్లకు భిన్నమైన సాంస్కృతిక అస్తిత్వంతో బతికే ఈ కార్నిష్‌ తెగలో జన్మించాడు సర్‌ విలియం గెరాల్డ్‌ గోల్డింగ్‌ (1911–1993). గోల్డింగ్‌ వాళ్లు తమ ఇంటికి పెట్టుకున్న పేరు కరేంజా. ఈ ఇంట్లోనే చిన్నతనంలో ఆ తెగకే ప్రత్యేకమైన జానపద గాథలు తల్లి చెబుతుండగా వింటూ పెరిగాడు.  ఏడేళ్ల నుంచే రాయాలని ఉబలాటపడేవాడు. అయితే, 1954లో తన నలభై మూడో ఏటగాని ‘లార్డ్‌ ఆఫ్‌ ద ఫ్లైస్‌’ అచ్చుకాలేదు. తొలి నవలతోనే ఒరిజినల్‌ రైటర్‌ అన్న పేరొచ్చింది.

దీని ఆధారంగా అదేపేరుతో వచ్చిన సినిమా కూడా క్లాసిక్‌గా నిలిచింది. ఫ్రీ ఫాల్, ద పిరమిడ్, ద పేపర్‌ మెన్‌ ఆయన ఇతర నవలలు. మంచితనం కంటే చెడ్డతనానికి సులభంగా ఆకర్షించబడేదేదో మనిషిలో స్వాభావికంగా ఉందని నమ్ముతాడు గోల్డింగ్‌. దాన్నే ఆయన రచనల్లో అన్వేషిస్తాడు. విపత్కర పరిస్థితుల్లో మనిషి ఎలా బతికి బట్టకట్టతాడు అనేది కూడా ఆయనకు ఆసక్తి కలిగించే అంశం. ఆర్కియాలజీ, సముద్ర ప్రయాణాలు అన్నా ఇష్టమే. రైట్స్‌ ఆఫ్‌ పాసేజ్, క్లోజ్‌ క్వార్టర్స్, ఫైర్‌ డౌన్‌ బిలో– ఈ మూడు నవలలను సీ ట్రయాలజీగా పిలుస్తారు. మ్యాన్‌ బుకర్, నోబెల్‌ పురస్కారాలు స్వీకరించిన గోల్డింగ్‌– రెండు వేల పదాలు రోజూ రాయడానికి ప్రయత్నించేవారు. ఒడిలో కూర్చున్న పిల్లాడి కుతూహలాన్ని సంతృప్తిపరచగలిగిందే మంచి నవల అనేవారు.

మరిన్ని వార్తలు