మధుమేహులకు శాకాహారంతో ఎక్కువ ప్రయోజనం?

16 Feb, 2018 00:49 IST|Sakshi

ఆరోగ్యంగా ఉండేందుకు ఏది మేలన్న విషయంలో ఇప్పటికే చాలా చర్చలు ఉన్నాయిగానీ..  ఊబకాయంతోపాటు మధుమేహమున్న వారికి శాకాహారం మేలని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసి విడుదల చేసే బీటా కణాలపై ఒక అధ్యయనం చేసి మరీ తాము ఈ విషయాన్ని తెలుసుకున్నామని హనా కాహ్లెలోవ్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఊబకాయం ఉండి.. మధుమేహ లక్షణాలు లేని కొంతమందిని రెండు గుంపులుగా విడగొట్టి ఒకరికి పండ్లు, కాయగూరలు, గింజధాన్యాలతో అతితక్కువ కొవ్వు గల ఆహారం అందించారు. రెండో గుంపులోని వారి ఆహారంలో ఎలాంటి మార్పు చేయలేదు. రెండు గుంపుల్లోని కార్యకర్తలు వ్యాయామం, తీసుకునే మందుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా చూశారు.

పదహారు వారాల తరువాత జరిపిన పరిశీలనలో శాకాహార ఆధారిత గుంపులోని వారి రక్తంలోని చక్కెరల మోతాదు గణనీయంగా తగ్గినట్లు తెలిసింది. మధుమేహ నివారణకు ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందని హానా తెలిపారు. శాకాహారం మధుమేహాన్ని నివారించడంతోపాటు వ్యాధి ఉన్నవారికీ మేలైన చికిత్సగా పనిచేస్తుందని గతంలోనూ ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. అంతేకాకుండా బరువు, కొవ్వుల మోతాదు, రక్తపోటులను తగ్గించుకునేందుకు కూడా శాకాహారం మంచిదని ఈ అధ్యయనాల ద్వారా తెలిసింది. 

మరిన్ని వార్తలు