గ్రీడ్ ఈజ్ బ్యాడ్

26 Sep, 2015 23:26 IST|Sakshi
గ్రీడ్ ఈజ్ బ్యాడ్

సోల్ / దురాశ
ఆశ నిరాశలు మానవ జీవితంలో సహజాతి సహజమే అయినా, ప్రాథమికంగా మనిషి ఆశాజీవి. ఆశాభంగాలు ఎదురైనప్పుడు వాటిల్లో నిరాశ నుంచి త్వరగా తేరుకుని, ఆశాదీపాన్ని ఆరిపోకుండా కాపాడుకోగలిగే వాళ్లను ఆశావాదులంటారు. నిజానికి ఇలాంటి వాళ్లే కార్యసాధకులు. బతుకు మీద ఆశను అడుగంటించేసుకుని నిరంతరం నిరాశలో మునిగిపోయే వారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఇలాంటి నిరాశావాదులు తమ జబ్బును పక్కవాళ్లకూ అంటించేందుకు ప్రయత్నిస్తారు.

నిరాశావాదులు మన పరిసరాల్లో ఉంటే కార్యసాధనలో మనమూ వెనుకబడిపోతాం. కాబట్టి వీళ్ల పట్ల తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే! ఆశావాదులు, నిరాశావాదుల సంగతి అలా ఉంచితే, లోకంలో కొందరు దురాశావాదులూ ఉంటారు. అన్నీ తమకే కావాలనుకుంటారు ఇలాంటి వాళ్లు. తాము ఆశించేదానికి తగిన యోగ్యత తమకు ఉందా లేదా అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోరు. ఇలాంటి వాళ్లే మరీ డేంజరస్ పీపుల్. వీళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత క్షేమం.
 
సంతృప్తికి ఆమడ దూరం

సామాన్యులు ఎంతసేపూ ఆశ నిరాశాల్లోనే కొట్టుమిట్టాడుతుంటారు. తమకు గల చిన్ని చిన్ని ఆశలు నెరవేరిపోతే చాలు తృప్తిగా జీవితాన్ని వెళ్లదీసేస్తారు. ఆశించినది దక్కకుంటే కొంతకాలం నిరాశలో మునిగినా, తిరిగి తేరుకుని తమ కర్మ ఇంతేనని సరిపెట్టుకుంటారు. దురాశావాదులు అలా కాదు. ఆశాభంగములను వారెన్నడూ సహించజాలరు. ఆశించినది దక్కేంత వరకు కంటి నిండా నిద్రపట్టదు. షడ్రసోపేతమైన భోజనమూ రుచించదు. తమ ఆశాభంగాలకు కారణమని భావించే వారిపై నిష్కారణంగా పగ పెంచుకుంటారు. అదను చూసి వారిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు.

ఇలాంటి వాళ్లే రాజకీయాల్లో, వ్యాపారాల్లో ఎదుటి వాళ్లను నిర్దాక్షిణ్యంగా తొక్కేసి మరీ పెకైదిగిపోతారు. యోగ్యతా సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా కోరుకున్నవి పొందడానికి వీళ్లు ఎంతకైనా తెగిస్తారు. దురాశాపరులు సంతృప్తికి ఆమడ దూరంలో ఉంటారు. ఎంతటి అయాచిత, అనాయాస లాభాలు సైతం వాళ్లకు సంతృప్తినివ్వలేవు. ఎంత సంపద పోగేసుకున్నా వీళ్ల నోటంట ‘ఇక చాలు’ అనే మాట చచ్చినా రాదు. ఇలాంటి దురాశాపరులకు పొరపాటున అధికారం దొరికిందంటే, ఇక అంతే సంగతులు! జనాలను యథేచ్ఛగా దోచుకుంటూ నియంతలుగా తయారవుతారు.
 
దురాశా పురాణం
ప్రపంచంలోని దాదాపు అన్ని మతాల్లోను, పురాణాల్లోను దురాశ గురించిన ప్రస్తావన ఉంది. మన పురాణాలు దురాశనే ‘లోభం’గా పేర్కొన్నాయి. లోభాన్ని అరిషడ్వర్గాలలో ఒకటిగా పరిగణించాయి. దురాశ మహా పాపం అని కూడా పలు మతాలు ఉద్బోధించాయి. దురాశ వల్ల ఎన్ని సంపదలు సమకూరినా, మనశ్శాంతి మాత్రం ఉండదని హితవు పలికాయి. పోగాలము దాపురించినప్పుడు హితవచనాలేవీ రుచించవని ఆర్యోక్తి. దురాశ మితిమీరితే అది ఆత్మవినాశనాన్ని కూడా కొని తెస్తుంది. అతి లోభం... అంటే, మితిమీరిన దురాశ వల్ల దుర్యోధనుడు నాశనమైన ఉదంతాన్ని పురాణ ప్రవచనాలు చెప్పే వారందరూ ఉద హరిస్తూ ఉంటారు.

అయితే, దురాశాపరులకు ఇలాంటివేవీ పట్టవు. పురాణాల్లోనే కాదు, చరిత్రలోనూ దురాశాపరుల గురించి చాలా ఉదాహరణలు దొరుకుతాయి. రోమన్ చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా పేరుమోసిన రోమన్ సేనాని మార్కస్ క్రాసస్, మంగోల్ నాయకుడు చెంగిజ్ ఖాన్, బురిడీ స్కీములతో జనాల నెత్తిన కుచ్చుటోపీ పెట్టి కోట్లు కొల్లగొట్టిన అమెరికన్ కేటుగాడు చార్లెస్ పొంజీ వంటి దురాశాపరులు జనాలను దారుణంగా దోచుకున్నారు. దురాశ వల్ల ఎన్నో అనర్థాలు మానవజాతికి అనుభవానికి వచ్చినా జనాభాలో దురాశాపరుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది.
 
యుగ ధర్మమా..? జనాల ఖర్మమా..?
కలియుగంలో ధర్మం ఒంటిపాదంతో కుంటి నడక నడుస్తుందని, అలాంటి ధర్మ‘సంకట’ కాలంలో లోకంలో దురాశాపరులు పెచ్చరిల్లుతారని పురాణాలు చెబుతున్నాయి. పలువురు కాలజ్ఞానులు కూడా ఇదే విషయాన్ని బలపరచారు కూడా. మనుషుల్లో దురాశ మితిమీరడం యుగ ధర్మం అనుకుని సరిపెట్టుకోవాలో, ఇదంతా మన ఖర్మమని సరిపెట్టుకోవాలో తెలియని అయోమయావస్థ సామాన్యులకు మిగిలింది. ఆధునిక యుగంలో అన్ని రంగాలూ అధునాతనంగా పరిణమించినట్లే, దురాశ కూడా మరింత ఆధునికతను సంతరించుకుంది. ప్రజాస్వామ్యం చలామణీలో ఉన్న చోట్ల అయితే, మరీ సాఫిస్టికేటెడ్‌గా మారింది. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్న దేశాల్లో దురాశాపరుల్లో మెజారిటీ జనాలు రాజకీయాల్లో చేరి, యథేచ్ఛగా మూడు స్కీములు, ఆరు స్కాములతో ఆ విధంగా ముందుకు పోతున్నారు. ప్రజాస్వామిక దేశాల్లోనే దురాశాపరుల పురోగతి ఇలా ఉంటే, ఇక నియంతృత్వ రాజ్యాల సంగతి చెప్పేదేముంది? ఆధునిక యుగంలో దురాశాపరులు కూడా తెలివి మీరారు. ఉత్త దురాశతోనే ఉపయోగం లేదని, దురాశలు నెరవేరాలంటే కూసింత తెలివితేటలు ఉండాలని గ్రహించిన వారయ్యారు.

మెదడు తలకాయలో లేకున్నా, బొత్తిగా అరికాల్లోకి జారిపోకుండా దానిని కనీసం మోకాల్లో పదిలంగా ఉండేట్లు చూసుకుంటే చాలు, లోకాన్ని ఏలేయవచ్చనే నమ్మకం ప్రబలిన వాళ్లయ్యారు. ఇలాంటి వాళ్లు విజయానికి అడ్డదారులు... జనాలను కొల్లగొట్టడం ఎలా..? వంటి అముద్రిత గ్రంథాలను రహస్యంగా చదువుకుంటూ చావు తెలివితేటలను పెంచుకుంటూ ఉంటారు. తెలివితక్కువ సన్నాసుల్లోనూ దురాశాపరులు లేకపోలేదు. అయితే, వాళ్ల వల్ల జనాలకు పెద్దగా అనర్థాలేమీ జరిగే ప్రమాదమేదీ ఉండదు. వాళ్ల మూర్ఖత్వమే జనాలకు శ్రీరామరక్ష. ‘కన్యాశుల్కం’లో లుబ్ధావధానులు తెలివితక్కువ దురాశాపరుడు. ఆ ముసలాడు తెలివితక్కువ వాడు కావడం వల్లనే, రామప్పంతులు మొదలుకొని కరటకశాస్త్రి శిష్యుడి వరకు అతగాడికి టోకరా ఇస్తారు. ఒకప్పుడు ‘దురాశ దుఃఖమునకు చేటు’ అనే నీతివాక్యం బడిగోడల మీద విరివిగా కనిపించేది. ఆ కాలంలోనూ దురాశాపరులు ఉండేవాళ్లు. ఇప్పుడా నీతివాక్యం అంత విరివిగా కనిపించడం లేదు. అయితే, ఇప్పుడు దురాశాపరుల సంఖ్య ద్విగుణం బహుగుణంగా వృద్ధి చెందుతోంది.

మరిన్ని వార్తలు