ఆకుపచ్చని కాంతి...

28 May, 2014 22:54 IST|Sakshi
ఆకుపచ్చని కాంతి...

సహజంగా!
 
గ్రీన్ టీ అంతర్గత అవయవాల ఆరోగ్యానికే కాదు మేని సౌందర్యానికీ ఉపయోగించవచ్చు. చర్మ మృదుత్వాన్ని, కాంతిని పెంచుకోవచ్చు.  
 
 గ్రీన్ టీ క్లెన్సర్: గ్రీన్ టీ బ్యాగ్‌తో తేనీరు తయారుచేసుకొని సేవించాలి. ఆ టీ బ్యాగ్ చల్లారిన తర్వాత, గట్టిగా పిండాలి. ఆ నీటిని వేళ్లతో అద్దుకుంటూ ముఖం, మెడ భాగాలపై మెల్లగా 2 నిమిషాల సేపు రుద్దాలి. అదే టీ బ్యాగ్‌తోనూ ముఖమంతా రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని మలినాలు తొలగి, వడలిన ముఖం తాజాగా మారుతుంది.
 
 గ్రీన్ టీ స్టీమ్ ఫేసియల్: ఫేసియల్ సమయంలో సాధారణ వేడి నీటితో ముఖానికి ఆవిరిపడుతుంటారు. ఇందుకోసం గ్రీన్ టీ బ్యాగ్‌ను ఉపయోగించవచ్చు. పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగించి, అందులో గ్రీన్ టీ బ్యాగ్‌ను కట్ చేసి ఆకును మాత్రమే వేయాలి. గిన్నెను కిందకు దించి, తలను ముందుకు వచ్చి, పైన టవల్‌ను కప్పుకోవాలి. ఇలా వచ్చే ఆవిరిని 3-4 నిమిషాలు మాత్రమే ముఖానికి పట్టాలి. (వేడి భరించగలిగేటంత దూరంలో ఉండాలి).
 
గ్రీన్ టీ రోజ్ వాటర్: రోజ్‌వాటర్‌ను (మార్కెట్లో లభిస్తుంది) వేడి చేసి, అందులో గ్రీన్ టీ బ్యాగ్‌ను ఉంచాలి. 5 నిమిషాల తర్వాత టీ బ్యాగ్ తీసేసి, మిశ్రమం చల్లబడ్డాక, గాలిచొరబడని బాటిల్‌లో పోసి, ఫ్రిజ్‌లో పెట్టాలి. అలసిన కళ్లకు విశ్రాంతి, వడలిన చర్మానికి తాజా దనం రావడానికి ఈ గ్రీన్ టీ రోజ్‌వాటర్‌ని దూదితో అద్దుకొని, తుడుచుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల వయసుపైబడిన కారణంగా వచ్చే ముడతలు తగ్గుతాయి. ఎండకు కందిన చర్మం సహజకాంతిని నింపుకుంటుంది.
 

మరిన్ని వార్తలు