ఇవీ గ్రీన్‌హౌస్‌లే...

19 Nov, 2014 00:23 IST|Sakshi


నేల విడిచి వ్యవసాయం చేయడంపై ప్రపంచమంతా పెరిగిపోతోందనేందుకు నిదర్శనమీ రెండు చిత్రాలు. అంతకంతకూ పెరిగిపోతున్న అవసరాలు, తగ్గట్టుగా పెరగని వ్యవసాయ ఉత్పత్తుల మధ్య సమతౌల్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగం కూడా. మొదటి చిత్రంలో ఉన్నది నీటిపై తేలియాడే గ్రీన్‌హౌస్. స్టుడియో మొబైల్ అనే ఆర్కిటెక్ట్ సంస్థ డిజైన్ చేసింది. దాదాపు 750 చదరపు అడుగుల విస్తీర్ణముండే ఈ నిర్మాణం 96 ప్లాస్టిక్ డ్రమ్ములపై నిర్మించారు. పైకప్పులోని సోలార్ స్టిల్ ద్వారా నీరు అక్కడికక్కడే ఉత్పత్తి అవుతుంది. మొక్కలకు ఉపయోగపడుతుంది. సముద్రపు నీరు లేదా కలుషిత నీటి నుంచి కూడా స్వచ్ఛమైన నీటిని తయారు చేసుకునేందుకు అనువైన ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో.

తగిన పోషకాలు అందిస్తూ నేల అవసరం లేకుండా ప్లాస్టిక్ తొట్టెల్లో (ఈరకమైన వ్యవసాయాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు) మొక్కలు పండిస్తారు. ఇక రెండో చిత్రం... యునెటైడ్ కింగ్‌డమ్‌కు చెందిన కేట్ హాఫ్‌మన్, టామ్ వెబ్‌స్టర్ అనే ఇద్దరు ఔత్సాహికులు వాడేసిన షిప్పింగ్ కంటెయినర్‌తో చేసిన వినూత్న ప్రయోగమిది. కంటెయినర్ పైభాగంలో పారదర్శకమైన గ్రీన్‌హౌస్ ఏర్పాటు చేసి మొక్కలు, తొట్టెల్లో చేపలూ పెంచుతున్నారు. చేపల వ్యర్థాలు మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతోంది. దాదాపు 400 మొక్కలు పెంచుతూ వచ్చిన పంటను అక్కడికక్కడే అమ్మేస్తున్నారు. ఐడియా భలే!

>
మరిన్ని వార్తలు