ఆశయాల లేఖనం

30 Sep, 2019 01:57 IST|Sakshi

పరిచయం  గూడూరు లక్ష్మి

ఈ ఏడాది దేశం...బాపూజీ నూట యాభయ్యవ జయంతి వేడుకలు జరుపుకుంటోంటే..గాంధీజీ పెన్నా తీరాన స్థాపించిన ‘పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం’ మరో రెండేళ్లలో...శతాబ్ది ఉత్సవాలకు         సిద్ధమవుతోంది.ఆ ఆశ్రమంలోని లక్ష్మి తన చిత్రలేఖనంతో, స్ఫూర్తిదాయక ప్రసంగాలతో జాతిపిత ఆశయాలను విస్తరింపజేస్తోంది.

‘ఆనం కవితా లక్ష్మి‘... అని ఆమె ఇంటి ముందుకెళ్లి అడిగినా సరే... ఎవరూ తెలిసినట్లు ముఖం పెట్టరు. ‘గూడూరు లక్ష్మి’ అని జిల్లాలో ఎవరిని అడిగినా సరే మన మాట పూర్తయ్యేలోపు బదులిస్తారు. నెల్లూరు జిల్లాలో గాంధీజీ ఆశయాలను గౌరవించే ప్రతి ఒక్కరికీ గూడూరు లక్ష్మి సుపరిచితురాలు. పిల్లల్లో దేశభక్తి పెంపొందించాలనుకునే స్కూల్‌ టీచర్లు ‘తమ స్కూల్‌కి వచ్చి పిల్లలకు గాంధీజీ గురించి మంచి మాటలు చెప్పవలసిందిగా’ ఆమెను సంప్రదిస్తారు. ఆమెతో వారి అనుబంధం అక్కడితో ఆగిపోదు. ఆ స్కూల్‌ పిల్లలు పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమానికి ఫీల్డ్‌ ట్రిప్‌కి వెళ్లే వరకు కొనసాగుతుంది. గాంధీజీ ఆశయ సాధన కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమ ప్రచార కమిటీకి మహిళా అధ్యక్షురాలు గూడూరు లక్ష్మి.

దశాబ్దకాలంలో ఆమె ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు అన్నీ కలిపి మొత్తం నాలుగు వందలకు పైగా విద్యాసంస్థల్లో విద్యార్థులకు గాంధీ ఆశయాలను బోధించారు. ఇక ప్రతి శని, ఆదివారాల్లో ఆశ్రమంలో అన్ని వయసుల వారికీ నిర్వహించే గాంధియన్‌ స్టడీస్‌ క్లాసులు చెప్తారు. ‘‘గాంధీజీ ఒక జ్ఞాపకం కాదు, మనతోపాటు జీవిస్తున్న ఒక స్ఫూర్తి’’ అన్నారామె. ‘‘గాంధీజీకి నివాళి అర్పించడం అంటే... జయంతి, వర్థంతి రోజుల్లో ఒక దండ వేసి దణ్ణం పెట్టడం కాదు, గాంధీ సూక్తులను మన జీవితంలో భాగంగా మలుచుకోవాలి. ఆయన ఆశయాలను మనం ఆచరించడమే జాతిపితకు అర్పించే అసలైన నివాళి’’ అన్నారామె. గాంధీ ఆశ్రమంలో ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు తన జీవితాన్ని, తన అడుగులు ఆశ్రమం వైపు పడిన జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు గూడూరు లక్ష్మి.

ఆశ్రమానికి పయనమిలా
‘‘మా వారు రెడ్‌క్రాస్‌ మెంబరు. రక్తదాత కూడా. గాంధీ ఆశ్రమం నిర్వహణ బాధ్యత రెడ్‌క్రాస్‌ చూస్తోంది. ఒక సేవా కార్యక్రమం సందర్భంగా  2008లో తొలిసారి ఆశ్రమంలో అడుగుపెట్టాను. ఆ సమావేశంలో గాంధీ గారి ఆశయాల మీద నా ఇష్టాన్ని గమనించిన రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ ఏవీ సుబ్రహ్మణ్యం గారు ‘గాంధీజీని చదివి, ఆయన ఆశయాలతో స్ఫూర్తి పొందిన వాళ్లు అక్కడితో ఆగిపోకూడదు, వాటిని ప్రచారంలోకి తీసుకురావాలి. గాంధీజీని పిల్లలు పుస్తకంలో ఒక పాఠంగా చదివితే సరిపోదు. అంతకంటే ఎక్కువగా వాళ్ల చిన్న మెదళ్లలో బలమైన ముద్రపడాలి. అందుకోసం మీరు ప్రచార బాధ్యతలను చేపడితే బావుంటుంది’ అని సూచించారు. అలా ఆశ్రమం నా జీవితంలో ఒక భాగమైంది.

పొణకా కనకమ్మను చదివాను
గాంధీజీ మీద ఇష్టంతో ఆశ్రమంలో ప్రచార బాధ్యతలను తలకెత్తుకున్నాను. అయితే ఆ ఆశ్రమం స్థలదాత పొణకా కనకమ్మ గురించి ఆ తర్వాత చదివాను. కనకమ్మకు తొమ్మిదో ఏటనే పెళ్లయింది. పెళ్లయిన తర్వాత ట్యూషన్‌ పెట్టించుకుని ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం నేర్చుకుని కవితలు కూడా రాశారు. ఆమె స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. పల్లిపాడులో బ్రిటిష్‌ కాలంలో తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చేవారు. హింసాత్మక ప్రవృత్తిని ప్రేరేపించే ఈ ప్రదేశాన్ని అహింసాయుతంగా మార్చాలనుకున్నారు గాంధీజీ. అప్పుడామె ఈ స్థలాన్ని ఆశ్రమం కోసం విరాళంగా ఇచ్చారు. గాంధీజీ పిలుపునిచ్చిన అనేక పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సామాన్యులను చేరదీసి వారికి దేశానికి స్వాతంత్య్రం ఎంత అవసరమో తెలియ చెప్పేవారు కనకమ్మ. ఆమె ఆధ్యాత్మిక ముని రమణమహర్షి శిష్యురాలు కూడా. కనకమ్మ బాలికల కోసం నెల్లూరులో కస్తూర్బా బాలికల పాఠశాలను స్థాపించారు. మనకు స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా సరే ఇప్పటికీ సమాజంలో ఆడపిల్లకు రెండవ ప్రాధాన్యమే దక్కుతోంది.

ఆశ్రమానికి వచ్చే పిల్లలకు స్వాతంత్య్రోద్యమంలో స్త్రీల భాగస్వామ్యం గురించి తెలియాలంటే అది కనకమ్మ గారి విగ్రహంతోనే సాధ్యం అనిపించింది. నా ప్రతిపాదనను కమిటీ సభ్యులంతా సంతోషంగా స్వాగతించారు. అప్పుడు కాకతాళీయంగా జరిగిన అద్భుతం ఏమిటంటే... అప్పటి వరకు నిధుల్లేక ఆశ్రమ నిర్వహణ కష్టంగా ఉండేది. ఆమె విగ్రహం పెట్టాలనుకున్న వెంటనే టూరిజం శాఖ నుంచి ఆశ్రమం అభివృద్ధి కోసం కోటీ నలభై లక్షలు శాంక్షన్‌ అయ్యాయి. ఆ డబ్బుతో ఆశ్రమాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడంతోపాటు కనకమ్మ విగ్రహాన్ని కూడా చేయించగలిగాం. తెనాలిలో శిల్పి దగ్గర కూర్చుని ఆమె పోలికలు యథాతథంగా వచ్చే వరకు మార్పులు చేయించి, తుది రూపు వచ్చిన తర్వాత 2017లో గాంధీ జయంతి రోజున విగ్రహావిష్కరించాం. ఆశ్రమం కోసం సహాయసహకారాలడిగితే మా ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిగారు, ఇతర నాయకులు కూడా బాగా సహకరిస్తున్నారు.’’ అన్నారు లక్ష్మి.

మరో లక్ష్మి వచ్చింది
గాంధీజీకి కూతుళ్లు లేరు. లక్ష్మి అనే అమ్మాయిని దత్తత చేసుకున్నారు. అయితే ఆ లక్ష్మి అప్పట్లో గాంధీజీ ఆశయాలకు దూరంగా వెళ్లిపోయింది. ‘జాతి పిత ఆశయాలను నిలబెట్టడానికి మరో లక్ష్మి వచ్చింది’ అని మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌లో గూడూరు లక్ష్మిని చూసిన గాంధేయ వాదులు ప్రశంసలు కురిపించారు. ఆమె సేవాగ్రామ్‌లో రాట్నం వడకడం, రకరకాల వృత్తుల్లో శిక్షణనిచ్చే బేసిక్‌ ఎడ్యుకేషన్‌ కోర్సు పూర్తి చేశారు. పల్లిపాడు ఆశ్రమంలో సేవాకార్యకర్తల బృందం గాంధీజీ పుట్టిన పోర్‌బందర్, పెరిగిన రాజ్‌కోట్, ఉద్యమం నడిపిన సబర్మతి ఆశ్రమాన్ని పరిశీలించి... ఆ మ్యూజియాలలో ఉన్న ప్రతి ఫొటో పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో ఉండేలా చూశారు. ఇప్పుడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని సందర్శిస్తే గాంధీజీ జీవితం మొత్తం కళ్లకు కడుతుంది.

బాపూజీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల చిత్రాలన్నీ ఇక్కడి ఫొటో ఎగ్జిబిషన్‌లో ఉన్నాయి. ఆశ్రమంలో చేయగలిగినవి ఆశ్రమంలో చేస్తూ, ఆశ్రమంలో చేయలేని కార్యక్రమాలను సొంతంగా చేస్తున్నారు గూడూరు లక్ష్మి. యార్లగడ్డ ప్రభావతి సేవా పురస్కారంతోపాటు బహుమతిగా అందుకున్న పాతిక వేల నగదుతో ‘శ్రీ కళాలయ ట్రస్ట్‌’ స్థాపించారు. భర్తకు దూరమైన మహిళలకు చిత్రలేఖనంతోపాటు ఉపాధి కళలను నేర్పిస్తారామె. చిత్రలేఖనంలో చెయ్యి తిరిగిన లక్ష్మి గాంధీ చిత్రాలతోపాటు దేశ నాయకుల చిత్రాలను, ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రిస్తారు. దుస్తుల మీద ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌ కూడా చేస్తారు. ఆశ్రమంలో ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ క్లాసులు చెప్పడంతోపాటు తాను స్వయంగా మహిళల ఉపాధికి దారులు చూపిస్తున్నారు.

కొత్త తరానికి బాటలు
గూడూరు లక్ష్మికి డిగ్రీ సెకండియర్‌లో ఉండగా పెళ్లయింది. అప్పుడు చదువాపేసిన ఆమె కూతురు లాస్యతోపాటు డిగ్రీ పూర్తి చేశారు. అక్కడితో ఆగిపోకుండా గాంధియన్‌ థాట్‌ లో పీజీ చేశారు. ఇప్పుడు ఎల్‌ఎల్‌బీ చేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత గాంధీ ఆశయాల మీద పీహెచ్‌డీ చేయాలనేది ఆమె కోరిక. పల్లిపాడు ఎస్‌సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత చేసుకుని... ఆ పిల్లలకు గాంధీ గారి కథలు చెప్పడం, తేలిగ్గా గాంధీజీ బొమ్మలు వేయడమెలాగో నేర్పించడం. తెలుగు భాష పరిరక్షణకు పాటలు, పద్యాలు నేర్పించడం ఆమె నిర్వర్తిస్తున్న విధులు. పిల్లల చేత దేశ నాయకుల వేషాలు వేయిస్తారు. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం నిర్వహణకు కొత్త తరాన్ని తయారు చేయడం కోసమే ఇదంతా అన్నారామె.

లక్ష్మి గురించి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ‘ఇన్ని పనులను ఒంటి చేత్తో నిర్వహిస్తోంది’ అనిపించడం సహజమే. అయితే ఇది మాట మాత్రంగా అనాల్సిన మాట కాదు. నిజంగానే ఆమె ఒంటి చేత్తోనే ఇన్నింటినీ చక్కబెడుతున్నారు. ఇరవై ఏళ్ల కిందట జరిగిన బస్‌ ప్రమాదంలో ఆమె ఎడమ చెయ్యి తెగిపోయింది. అప్పటి నుంచి ఆమె ఒక్క చేత్తోనే జీవితాన్ని జయిస్తున్నారు. లెక్కపెట్టడానికి వీల్లేనన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అందుకే అనేక సంస్థలు ఆమెను ‘మా ఉద్యోగులను మోటివేట్‌ చేయడానికి మీకంటే రోల్‌ మోడల్‌ మాకెవ్వరూ అక్కర్లేదు, మీరే వచ్చి ప్రసంగించండి’ అని ఆహ్వానిస్తున్నాయి.
– వాకా మంజులారెడ్డి

గాంధీజీ ఆశయం...కనకమ్మ దాతృత్వం
పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం నెల్లూరు జిల్లా, ఇందుకూరు పేట మండలం, పల్లిపాడు గ్రామంలో ఉంది. నెల్లూరు పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ గ్రామంలో సత్యాగ్రహ ఆశ్రమం స్థాపించడానికి నిర్ణయమైన తర్వాత గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోధురాలు పొణకా కనకమ్మ పదమూడు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. గాంధీజీ 1921 ఏప్రిల్‌ ఏడవ తేదీన ఆశ్రమానికి పునాదిరాయి వేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి తీరాన ఆశ్రమాన్ని నిర్మించిన గాంధీజీ... దక్షిణాదిలో జాతీయోద్యమానికి స్ఫూర్తి కేంద్రంగా పెన్నా నది తీరాన ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. జాతీయోద్యమంలో భాగంగా గాంధీజీ 1929లో కస్తూర్భాతోపాటు గాంధీజీ ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. ఒక రాత్రి బస చేశారు కూడా. ఈ ఆశ్రమానికి పదిహేను కిలోమీటర్ల దూరానున్న మైపాడు గ్రామంలో బంగాళాఖాతం తీరాన ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ ఉప్పు పండించారు. ఈ ఆశ్రమాన్ని దక్షిణాది సబర్మతి, ఆంధ్రప్రదేశ్‌ సబర్మతి అని కూడా వ్యవహరిస్తారు. గాంధీజీ మునిమనుమడు తుషార్‌ గాంధీ 2015, మే నెలలో ఈ ఆశ్రమాన్ని సందర్శించి గాంధీజీకి నివాళులర్పించారు.

ఆశ్రమంలో దొంగలు పడ్డారు
గాంధీజీ పల్లిపాడుకు తొలిసారి వచ్చినప్పుడు బ్రాహ్మణులు తమ వీథికి రావలసిందిగా ఆహ్వానించారట. దళితులను కూడా ఆహ్వానిస్తే వాళ్లతో కలిసి వస్తానని చెప్పార్ట గాంధీజీ. అలా గాంధీజీ ఆధ్వర్యంలో పల్లిపాడులో 1921లోనే బ్రాహ్మణులు, దళితులు కలిసి నడిచారు. అలాగే మా ఆశ్రమంలో కార్యకర్తలెవరూ ఆభరణాలు ధరించరు. ఆశ్రమంలో ఒకసారి దొంగతనం జరిగింది. పోలీసులు దొంగలను పట్టుకున్నారు. అప్పుడు ఆశ్రమంలో ఉన్న వాళ్లంతా ఒకేమాట మీద ‘మా నగలు మా దగ్గరే ఉన్నాయి. అసలు దొంగతనమే జరగలేదు. ఎవరినీ శిక్షించవద్దు’ అని చెప్పార్ట. తర్వాత ఆ దొంగలు తప్పు ఒప్పుకుని, క్షమించమని వేడుకుంటూ, ‘ఇక జీవితంలో దొంగతనం చేయం’ అని మాటిచ్చారట.

అప్పటి నుంచి ఆశ్రమవాసులు దొంగతనాన్ని ప్రేరేపించే పనులు మనం చేయకూడదని, ఆభరణాలు ధరించరాదనే నియమం పెట్టుకున్నారు. ఆశ్రమాన్ని చూడడానికి వచ్చిన పిల్లలకు గాంధీ సూక్తులతోపాటు దొంగల కథను కూడా చెప్తాం. నూట యాభయ్యవ జయంతి ముగింపు వేడుకల కోసం పాతిక పాఠశాలలకు వెళ్లి పిల్లలను చైతన్యవంతం చేశాం. ఈ నెల 25వ తేదీన ఏడు స్కూళ్ల నుంచి పదిహేను వందల మంది పిల్లలు వచ్చారు. ఏ పని అయినా మా ఆశ్రమ కమిటీ సభ్యులంతా చర్చించుకుని, తలా ఒక బాధ్యత పంచుకుంటాం.
– గూడూరు లక్ష్మి, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ ప్రచార కమిటీ అధ్యక్షురాలు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా