వీరి కుటుంబానికి  కులం... మతం లేవు..!

15 Feb, 2019 00:04 IST|Sakshi

పోరాట న్యాయం

తిరుపత్తూర్‌లో ప్రముఖ న్యాయవాది ఆమె.  దేశంలో కుల, మత భేదాలు లేకుండా అందరికీ సమ న్యాయం చేయాలనే పట్టుదల కలిగిన మహిళ. దీనిపై ఆమె పోరాటం దేశానికి మార్గదర్శకం చేసింది. ఆదేంటో చూడాలంటే  తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూర్‌... 

ఆనంత కృష్ణన్, మణిమొళి దంపతులకు పెద్ద కుమార్తె ఆమె. పోలీసులచే చిత్రహింసలకు గురై, వారికి వ్యతిరేకంగా పోరాడి జైల్లోనే ప్రాణాలు విడిచిన స్నేహలతకు గుర్తుగా ఆమెకు స్నేహ అని పేరు పెట్టారు. ఆమె తన ఇంటిపేరుగా తల్లి పేరులోని మొదటి అక్షరం ఎం, తండ్రి పేరులోని మొదటి అక్షరం ఏ రెండు కలిపి ఎంఎ.స్నేహ అయ్యింది. పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పుడు మొదటిసారి నీది ఏ క్యాస్ట్‌? అని అడిగారు. నాకు కులం లేదని మా తల్లిదండ్రులు చెప్పారు అని చెప్పిందామె. పోనీ మతం అయినా చెప్పమన్నారు. ‘మాకు కులం, మతం లేవని చెప్పారు మా తల్లిదండ్రులు’ అని సమాధానం ఇచ్చిందామె. అలా మొదలైన స్నేహ జీవితంలో పాఠశాల, కళాశాల వరకు ఎక్కడా కులం, మతం అనే ఆప్షన్‌ లేదు. 

ఆమె సోదరీమణులు ముంతాజ్, జెన్నిఫర్‌ కూడా అలాగే కులం, మతం అనే ఆప్షన్‌ లేకుండా విద్యాభ్యాసం ముగించారు. కుల, మతభేదాలు లేకుండానే పార్తిపరాజాతో ఆమెకు వివాహం జరిగింది. ఆమె పిల్లలు నజ్రీన్, ఆతిల జరీన్, ఆరీఫా జోసిలకు కూడా కులమతాలు అంటకుండా పెంచుతున్నారు. కులం, మతం అంటూ కొట్టుకునే ఈ సమాజానికి స్నేహ దంపతులు మార్గదర్శకులుగా నిలిచారు. కులాలు, మతాలతో కొట్టుకునే ఈ సమాజానికి భిన్నంగా అవేవీ వారికి లేవని నిరూపించుకునే ప్రయత్నంలో వారు తమకు కులం, మతం లేవనే ప్రభుత్వ సర్టిఫికెట్‌ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే అధికారులు పలుమార్లు వారిని నిరాశపరిచారు. వారు ఫలానా మతం, ఫలానా కులం అంటూ సర్టిఫికెట్‌ ఇచ్చే ప్రభుత్వాలు, అధికారులు, వారు ఏ కులానికీ, మతానికీ చెందిన వారు కాదనే సర్టిఫికెట్‌ ఎందుకు ఇవ్వరనే న్యాయపోరాటం ప్రారంభించారు స్నేహ దంపతులు. అలా అలుపెరగకుండా వారు చేసిన పోరాటానికి న్యాయం జరిగింది. ఆర్డీవో ఆదేశాల మేరకు తిరుపత్తూర్‌ తహసీల్దారు సత్యమూర్తి స్నేహ కుటుంబం ఏ కులానికీ, మతానికి చెందినవారు కాదంటూ సర్టిఫికెట్‌ అందచేయటం కొసమెరుపు.  అలా స్నేహ దంపతులు తాము ఏ కులానికో, మతానికో చెందినవారం కాదని, తమది మానవజాతి అంటూ ప్రభుత్వ పత్రం పొందిన మొదటి కుటుంబంగా రికార్డులకెక్కారు.
– సంజయ్‌ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధిసాక్షి టీవీ, చెన్నై బ్యూరో  

మరిన్ని వార్తలు