లాక్‌డౌన్‌: పోలీసు వంట

17 Jun, 2020 03:28 IST|Sakshi

పోలీసులు అనగానే మనకు ఖాకీ డ్రెస్‌తో పాటు వారి కాఠిన్యమే గుర్తుకు వస్తుంది. కానీ, గుజరాత్‌లోని వడోదరా మహిళా పోలీసులు మాత్రం ప్రతి రోజూ 1200 మంది పేదలకు ఆహారం స్వయంగా వండిపెడుతూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇంత పెద్ద సంకల్పానికి శ్రీకారం చుట్టింది అక్కడి ఐపిఎస్‌ అధికారి సరోజ్‌ కుమారి. దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించిన మూడు రోజులకే సరోజ్‌కి పేదల ఆహారం గురించిన ఆలోచన వచ్చింది. పనులు లేక, డబ్బుల్లేక పేదలు పస్తులుండకూడదని భావించిన సరోజ్‌ మార్చి 25న పోలీస్‌ స్టేషన్‌కు దగ్గరలోనే ఓ వంటశాలను ఏర్పాటు చేసింది. అందుకు కావల్సిన రేషన్‌ కోసం పై అధికారులతో మాట్లాడింది. కొంత సరంజామా పోలీసు బృందమే సమకూర్చింది.

ఈ అధికారి చొరవతో 50 మంది మహిళా పోలీసులు తమ విధులు పూర్తయ్యాక మూడు గంటల సమయాన్ని వంట చేయడానికి కేటాయించారు. దీంతో మొదట 550 మందికి వంట చేయడంతో ప్రారంభించారు. ఇప్పుడు ప్రతీరోజు 1200 మందికి వండి వార్చుతున్నారు. ఇక్కడి పోలీసు బృందమంతా కలిసి ఆహారాన్ని పంపిణీ చేస్తుంది. పోలీసాఫీసర్‌ సరోజ్‌ తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్రమంతా ఆమెకు అభినందలు తెలుపుతోంది. ఈ సేవ కారణంగా సరోజ్‌కు ఉమెన్‌ ఐకాన్‌ అవార్డు కూడా లభించింది.

మరిన్ని వార్తలు