ఉతికి ఇస్త్రీ చేస్తా

15 Nov, 2019 03:56 IST|Sakshi

కనిపెట్టిందెవరో కానీ..!

ప్రపంచంలో విద్యను కనిపెట్టిన వ్యక్తి తీవ్ర ప్రమాదంలో పడ్డాడు. ఆ వ్యక్తి కోసం ఈ ఫొటోలోని పిడుగు సీరియస్‌గా గాలిస్తోంది. పొరపొటున దొరికాడో అంతే సంగతులు ఈ పిల్ల చేతిలో! సబ్బునీళ్లతో ఉతికి మంచినీళ్లలో జాడించి ఎండలో ఆరబెట్టి చక్కగా ఇస్త్రీ చేసేస్తుందట ఆ వ్యక్తిని.

గుర్రున చూసే ఎమోజీ ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్నారా?  
గుజరాత్‌కు చెందిన ఆరేడేళ్ల ఈ అమ్మాయి  నిద్రను, ఆటను చెడగొట్టే స్కూల్‌ టైట్‌ షెడ్యూల్‌ మీద విరుచుకుపడుతున్న తీరును వీడియో తీశారు. దాన్ని అరుణ్‌ బొత్రా అనే పోలీస్‌ ఆఫీసర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ట్విట్టర్‌లో పెట్టిన గంటకే దాదాపు రెండున్నర లక్షల పై చిలుకు వీక్షణాలు వచ్చాయట. ‘‘కనీసం ఒక్క నెల రోజులైనా ఈ స్కూల్‌ నుంచి నాకు చుట్కారా (విముక్తి) కావాలి. అరే.. పొద్దున్నే నిద్రలేపుతారు.. మంచినీళ్లు తాగిస్తారు.. బ్రష్‌ చేసుకొమ్మని వెంటపడ్తారు.. తర్వాత పాలు తాగమని పోరుతారు.. స్నానం చేయమని తోస్తారు.. టిఫిన్‌ కుక్కుతారు.. స్కూల్‌కి పరిగెత్తమంటారు.

స్కూల్లో మాత్రం? ముందు ప్రేయర్‌.. తర్వాత ఇంగ్లిష్‌.. ఆ తర్వాత ఈవీఎస్‌ (ఎన్వైర్‌మెంటల్‌ సైన్స్‌).. తర్వాత మ్యాథ్స్‌.. గుజరాతి.. ఆ తర్వాత జీకే.. ఆ జీకే అంటే మ్యాథ్సే కదా... అసలు ఈ  స్కూల్, చదువు కనిపెట్టిన వాళ్లు నాకు కనిపిస్తే నీళ్లలో ముంచి.. ఇస్త్రీ చేస్తా..’’ అంటూ స్కూల్, హోమ్‌వర్క్, పేరెంట్స్‌ ఒత్తిడిని గుక్క తిప్పుకోకుండా ఏకరువు పెట్టింది.  ‘‘ఇదంతా పెట్టి దేవుడు మంచే చేశాడు కదా?’’ అని వీడియో తీసిన వ్యక్తి ఆ అమ్మాయిని అడిగితే? ‘‘ఆ.. ఆ.. చదువుకొమ్మని వెంటపడ్డం ఏం మంచి? ఇదొక్కటి లేకపోతే ఎంత మజాగా ఉంటుంది?’’ అంటూ ముక్కుపుటాలదిరిస్తూ విరుచుకుపడింది ఆ చిచ్చరపిడుగు. ‘‘ఇంతకీ మోదీ..’’ అని ఆ వ్యక్తి ఏదో అడగబోతుండగా.. అది పూర్తికాకుండానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. ‘‘ఈసారి మోదీని ఓడించాల్సిందే’’అంటూ నడుముకు చేయిపెట్టుకొని తాపీగా ఆన్సర్‌ ఇచ్చింది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా