గుంతర్‌ గ్రాస్‌

19 Mar, 2018 01:05 IST|Sakshi
గుంతర్‌ గ్రాస్‌

గ్రేట్‌ రైటర్‌

ప్రస్తుతం పోలండ్‌లో ఉన్న ఒకప్పటి అర్ధ–స్వయం ప్రతిపత్తిగల నగరం ‘ఫ్రీ సిటీ ఆఫ్‌ డాంజిగ్‌’లో జన్మించాడు గుంతర్‌ గ్రాస్‌(1927–2015). మాతృభాష జర్మనీ. తను జన్మించిన డాంజిగ్‌ బాల్యపు అనుభవాలు ఆయన రచనల్లో ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. 1959లో వచ్చిన మొదటి నవల ‘ద టిన్‌ డ్రమ్‌’ ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. మేజిక్‌ రియలిజం శైలిలో ఐరోపా ఖండంలో వచ్చిన విలువైన రచనగా మన్నన అందుకుంది. ఇదే పేరుతో 1979లో సినిమా కూడా వచ్చింది. అది ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది. గ్రాస్‌ తర్వాత రాసిన ‘క్యాట్‌ అండ్‌ మౌజ్‌’, ‘డాగ్‌ ఇయర్స్‌’ నవలలను కలిపి డాంజిగ్‌ ట్రయాలజీ అంటారు.

మొదటిదైన ‘పీలింగ్‌ ది ఆనియన్‌’తో కలిపి మూడుభాగాల ఆత్మకథ వెలువరించాడు. ‘ద ఫ్లౌండ(ర్‌)’, ‘మై సెంచరీ అండ్‌ క్రాబ్‌వాక్‌’ ఆయన ఇతర రచనలు. కవిగా, నాటకకర్తగా, శిల్పిగానూ ప్రజ్ఞ కనబరిచిన గ్రాస్‌ను 1999లో నోబెల్‌ సాహిత్య పురస్కారం వరించింది. కౌమారదశలో తప్పనిసరైన మిలిటరీ సర్వీసులో భాగంగా నాజీ సైనికుడిగా పనిచేశాడు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో యుద్ధఖైదీగా పట్టుబడి, తర్వాత విడుదలయ్యాడు. వామపక్ష రాజకీయ దృక్పథం ఉన్నవాడిగా పేరున్న గ్రాస్‌ తన చివరిదశలో వెల్లడించిన ఈ అంశం సాహిత్య లోకంలో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికైనా తన బరువును దించేసుకున్నానని ఆయన పేర్కొన్నాడు.
 

మరిన్ని వార్తలు