తలుపు... తలుపు...

20 Sep, 2016 23:52 IST|Sakshi
తలుపు... తలుపు...

గురజాడ వెంకట అప్పారావు కథా సంకలనం ‘ఆణిముత్యాలు’లో తొలి కథ ‘దిద్దుబాటు’ ‘‘తలుపు.. తలుపు..’’ అనే పదాలతో మొదలవుతుంది. నిజానికి ఈ మహాకవి సరికొత్త తెలుగు సాహిత్య వాకిలిని అలా తట్టి తెరిపించారనిపిస్తుంది. తెలుగు సాహితీలోకాన్ని కొత్త గవాక్షాల నుంచి వీక్షించేటట్టు చేసినవారు గురజాడ అప్పారావు. ప్రబంధ యుగంతో హంపీ విజయనగరంలో తెలుగు సాహిత్య క్షీణదశ ఆరంభమైందంటారు. కానీ తెలుగునాట ఉన్న విజయనగరంలో అభ్యుదయం దిశకు తెలుగు సాహితిని మరలించినవారు అప్పారావు (సెప్టెంబర్ 21, 1862- నవంబర్ 30, 1915). నాటకం, కథ, గేయం, కవిత్వం, చరిత్ర, విద్య, శాసన పరిష్కరం- బహుముఖాలుగా ఆయన తెలుగు సాహిత్యానికీ, సంస్కృతికీ సేవలు చేశారు. 

‘కన్యాశుల్కం’ గురజాడ వారి నాటకం. ఇందులో ఆయన విధవా సమస్య, బాల్య వివాహాలు, విధవా పునర్ వివాహాలు, వేశ్యా సమస్యల గురించి చర్చించారు. వీటిలో ఏ సమస్యా వర్తమాన సమాజంలో అదే రూపంలో లేదు. అంత తీవ్రతతోనూ లేదు. కానీ ఆ నాటకం అజరామరంగా నిలబడే ఉంది.

నేటికీ వేగుచుక్క ఈ నాటకం!
ఆధునిక సాహిత్యం మీద కూడా కన్యాశుల్కం నాటకం ప్రభావం తీవ్రంగానే ఉంది. సాహిత్యంలో రూపం, సారం; వాటి మధ్య తూకం అన్న చర్చ వస్తే ఈ అంశంతోనే జవాబు వెతకవచ్చు. రాబట్టుకోవచ్చు కూడా. అదే మహాకవి తెలుగు సాహిత్య విమర్శకు అందించిన వరం. అందుకే నేటికీ ఈ నాటకం వేగుచుక్కలాగే వెలుగుతోంది. అంతర్లీనంగా చాలా అంశాలు ఇంకా నడుస్తూ ఉంటాయి. ఆ నాటకంలో పాత్రలు చిరంజీవులుగా మిగిలాయి.

గిరీశం, మధురవాణి, రామప్పపంతులు, అగ్నిహోత్రుడు, లుబ్ధుడు, కరటకశాస్త్రి, మీనాక్షి, బుచ్చమ్మ, వెంకమ్మ వంటి ప్రధాన పాత్రలు తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానం పొందాయి. చిత్రంగా సౌజన్యారావు, పూజారి గవరయ్య, పొటిగరాపు పంతులు, బంట్రోతు, పూటకూళ్లమ్మ, మహేశం, వెంకటేశం వంటి చిన్న పాత్రలు సైతం అంతే ఆకర్షణను కలిగి ఉంటాయి. తెలుగు సమాజానికి ఆరంభమైన కుహనా మేధావుల బెడద  గురించి కూడా రసరమ్యంగా చిత్రించారు అప్పారావు. గురజాడ వారి శిల్ప చాతుర్యం, సంభాషణ కూర్చే సామర్థ్యం, సహజత్వం అద్భుతమనిపిస్తాయి.

గిరీశం... ది గ్రేట్
దాదాపు 120 ఏళ్ల క్రితం రాసిన నాటకం గురించి ఇదంతా. ఇందులో మధురవాణి గురించి: ఒక సందర్భంలో మధురవాణి అనే వేశ్య లేకపోతే ఈ కళింగానికి ఎంత లోటు వచ్చి ఉండేదో కదా! అంటాడు కరటకశాస్త్రి. ఆరుద్ర ఇంకో అడుగు ముందుకు వేసి, ‘అసలు మధురవాణి పాత్రని గురజాడ సృష్టించకుంటే తెలుగు సాహిత్యానికి ఎంత లోటు జరిగేదో’ అని. గిరీశం పాత్రకు గురజాడ బీజం వేశారు. కానీ అది మహాకవి అంచనాలకు అందని రీతిలో ఎదిగిపోయిందని విమర్శకుల అభిప్రాయం. ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటేగానీ పొలిటీషియన్ కానేరడోయ్’ అనగలిగినవాడు గిరీశం ది గ్రేట్. ఇది ఇప్పుడు ఈ దేశంలో ఉన్న తొంభయ్‌శాతం రాజకీయవేత్తలకు వర్తిస్తుందంటే అతిశయోక్తి కాదుకదా!

యాంటీ నాచ్... ప్రో నాచ్
నిజానికి సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అయ్యే చాలామంది నిజ స్వరూపం ఎలాంటిదో కరటకుడి చేత మహాకవి చెప్పించిన నిర్వచనాలు ఇవాళ్టికి వర్తిస్తాయి. ఇది యాంటీనాచ్ (వేశ్యా సంపర్కాన్ని వ్యతిరేకించేవారు) ఉద్యమకారుల గురించి కరటకుడు వెల్లడించిన చీకటిసత్యాలు. కొందరు పగలు యాంటీనాచ్. కొందరు రాత్రి ప్రోనాచ్. కొందరు సొంతూళ్లో యాంటీనాచ్. కొందరు పొరుగూరు వెళితే ప్రోనాచ్....’ ఇలా సాగుతుంది. పురుషాధిక్య సమాజానికి వెండి తీగలు కాల్చి వాతలు పెట్టిన మహోన్నత పాత్ర మధురవాణి. ‘వేశ్యలంటే అంత చులకనా పంతులు గారూ!’ అంటుందామె. ‘నాటకమల్లా పగటివేషాల్లోకి దిగిందే’ వంటి లోతయిన సంభాషణలు కూడా మహాకవి ఆ పాత్ర చేతే పలికించారు.

కొండుభట్టీయం,  బిల్హణీయం (అసంపూర్ణం) గురజాడవారి రెండు నాటిక లు. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, కన్యక వంటివి గేయ కావ్యాలు. వాటిని చూస్తే స్త్రీల దుస్థితి పట్ల ఆయన పడిన క్షోభ ఎంతటిదో అర్థమవుతుంది. డిసెంట్ పత్రం విద్యా వ్యవస్థ లోటుపాట్లను చెబుతుంది.

పెళ్లికూతురు... పిల్ల దెయ్యాలు
మూఢనమ్మకాల మీద గురజాడ వారు వేసిన చురకలు మరీ అద్భుతమైనవి. ముఖ్యంగా దెయ్యం పట్టడం అనే అంశం మీద ఆయన సృష్టించిన దృశ్యం ఇప్పటికీ స్మరణీయమే. కరటకుడి శిష్యుడు మహేశానికి ఆడవేషం కట్టి, లుబ్ధుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అనుకున్నట్టు పెళ్లయ్యాక వణియం గిణియం విప్పేసి శిష్యుడు పారిపోతాడు. ఆ కొత్త పెళ్లికూతురిని లుబ్ధుడే చంపేశాడని రామప్పపంతులు నాటకం ఆడతాడు. ఆ లేని దెయ్యాన్ని సీసాలో బంధిస్తాడు పూజారి గవరయ్య. అంతేనా! అసలు ఆడదే కాని ఆ దొంగ పెళ్లికూతురికి చనిపోయిన ముందు మొగుణ్ణి కూడా సృష్టించి వాణ్ణి కూడా అదే సీసాలో బంధిస్తాడతడు. అప్పుడు మీనాక్షి (లుబ్ధుడి కూతురు)కి వచ్చిన సందేహం అద్భుతం. ‘ఆ రెండు దెయ్యాలని (లేనివి) ఒకే సీసాలో బంధిస్తే దెయ్యప్పిల్లలు పుడుతాయేమో!’ అంటుందామె. దెయ్యం అనే అభూత కల్పన మీద ఇంతటి వ్యంగ్యాస్త్రం ఇంతవరకు వచ్చి ఉండదు.

మహాకవి మనకిచ్చిన సంపద
‘ఆణిముత్యాలు’ పేరుతో వచ్చిన  గురజాడ కథలు... ‘దిద్దుబాటు’, ‘మీ పేరేమిటి?’, ‘మెటిల్డా’, ‘పెద్ద మసీదు’, ‘మతము - విమతము’, ‘సంస్కర్త హృదయం’. ఇవి ఆ మహాకవి మనకిచ్చి వెళ్లిన కథా సంపద. ప్రతి కథ ఆణిముత్యమే. సంస్కర్త హృదయంలో మహాకవి వాస్తవిక దృష్టి మరింత అద్భుతం.

 ‘రిఫార్మ్ అన్నమాట ఇంగ్లిషులో చెబితే నీకు ఎంత అర్థమైందో, తెలుగులో సంస్కరణ అని చెప్పినా అంతే అర్థమవుతుంది’ అంటూ శిష్యుడు వెంకటేశానికి గిరీశం ఒకసారి చెబుతాడు. నిజమే సంస్కర్తలు కూడా మనుషులే. దేవుళ్లు కారు. ఆ విషయాన్ని అత్యంత రమణీయంగా  సంస్కర్త హృదయంలో చెప్పారు గురజాడ. ప్రొఫెసర్ అయ్యర్ (యాంటీనాచ్ ఉద్యమకారుడు), సరళ (వేశ్య) ప్రధాన పాత్రలుగా ఈ కథను గురజాడ అందించారు. ఇది ఇంగ్లిష్‌లో రాసిన కథ.

ఇంతకీ ఈ కథకి ముగింపుగా రెండు వాక్యాలు గమనిస్తే ఏదీ పరిపూర్ణం కాదు. ఏ మనిషీ పరిపూర్ణుడు కాడు అని నిజాయితీగా అంగీకరించారని అనిపిస్తుంది. ‘సంస్కరణ అంటే బురదలో ఉన్నవారిని పైకి తీయబోయి, తాము కూడా బురదలో కూరుకుపోవడమే’ అంటారాయన. భ్రమలని కాకుండా, నినాదాలను కాకుండా వాస్తవాలను చిత్తశుద్ధితో చెప్పగలిగిన వాస్తవిక వాది మాత్రమే ఈ మాట అనగలడు. అందుకే గురజాడ మహాకవి. యుగపురుషుడు. ద్రష్ట.
- డాక్టర్ గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు