చూపున్న వేళ్లు

19 Jan, 2015 22:28 IST|Sakshi
చూపున్న వేళ్లు

కంటిచూపు పోతే సర్వం పోయినట్లే అనుకుంటాం. కానీ చూపే సర్వస్వం కాదని హఫీజ్‌ని చూస్తే అర్థమౌతుంది! తన స్కిల్‌ని, విల్ పవర్‌ని కలిపి... వేళ్లను ఒత్తులుగా చేసుకుని జీవితాన్ని వెలిగించుకుంటున్న ఈ మెకానిక్... ఆ వెలుగులోనే పదేళ్లుగా తన బతుకుబండిని లాక్కొస్తున్నాడు. ఒక్క మాటలో... హఫీజ్ తన వేళ్లపై తను నిలబడ్డాడు.  
 
హఫీజ్ స్వస్థలం వరంగల్ జిల్లా కాశీబుగ్గ. ఇంటికి పెద్ద కుమారుడు. ఇద్దరు తమ్ముళ్లు. తండ్రి అఫ్జల్ వాచ్‌మన్‌గా పనిచేసేవారు. హఫీజ్ పదోతరగతి వరకు స్థానిక పాఠశాలలోనే చదువుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ పరిస్థితి అతడిని పై చదువులు చదవనివ్వలేదు. తండ్రికి ఆసరాగా ఉండవచ్చని దగ్గర్లోని ఆటోనగర్‌లో వాహనాల మెకానిక్‌గా చేరాడు. లారీ మెకానిక్‌గా మంచి పేరు సంపాదించాడు. అప్పుడే నజీమాతో పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు. అఫ్సానా, ముజామిల్. వచ్చిన సంపాదనతోనే భార్య బిడ్డలను, తల్లిదండ్రులను పోషించుకునేవాడు. అలా సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో ఒక్కసారిగా ఊహించని మలుపు! దాన్నెప్పటికీ మరిచిపోలేడు హఫీస్.  ‘‘2003లో ఆటోనగర్ నుంచి విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడితో అయిపోలేదు. ఆసుపత్రిలో చికిత్స వికటించి ఒక కన్ను చూపు కోల్పోయింది. అయితే, ఈ సంగతి చుట్టుపక్కల వారికే కాదు మా ఇంట్లో వారికీ తెలియనివ్వలేదు. బాధపడతారనేది ఒక కారణమైతే, ఒంటి కన్నుతో డ్రైవింగ్ ఎలా చేస్తున్నావ్ అని అడుగుతారనీ, మెకానిక్ పనులు తగ్గిపోతాయేమోననీ చెప్పలేదు. అలాగే పనులు చేసుకుంటూ వస్తుంటే..  2005లో మళ్లీ ఓ ప్రమాదం. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో బాణాసంచా పేలుస్తున్నాం. ఆ సమయంలో టపాసులు పేలి నేరుగా కళ్లలోకి దూసుకెళ్లాయి. ఆ ప్రమాదంలో... ఉన్న రెండో కన్నూ పొగొట్టుకున్నాను’’ అని నాటి సంఘటనల విషాదాన్ని వివరించారు హఫీజ్!
 
దిక్కుతోచలేదు

‘‘చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులే కాదు, పట్నం ఆసుపత్రుల్లోనూ చూపించారు మా వాళ్లు. మెకానిక్ పనులు చేసి కూడబెట్టిన రూపాయి రూపాయి ఆసుపత్రులకు తిరగడానికే ఖర్చయ్యిందే తప్ప ప్రయోజనం లేకపోయింది. చూపు లేకపోవడంతో ఎవరి సాయమూ లేకుండా అడుగు కూడా వేయలేకపోయేవాడిని. ఇక పనులేం చేయగలను!

రోజులు నెలల్లోకి మారుతున్నాయి. ఎవరో ఒకరి ఆసరా లేనిదే అడుగు బయట పెట్టలేని స్థితి. ఫీజులు కట్టలేక పిల్లల చదువులు ఆగిపోయాయి. ఆరునెలలు దిక్కు తోచని స్థితిలోనే ఉన్నాను. పూట గడవడమే కష్టంగా మారింది. నా భార్య బీడీలు చుట్టి, కుటుంబానికి ఆసరా అయ్యింది. ఇప్పటికీ బీడీలు చుడుతూనే ఉంది. వాచ్‌మెన్ పనిని వదిలేసిన నా తండ్రి తిరిగి వాచ్‌మన్‌గా కొనసాగాల్సి వచ్చింది. తెలిసినవారు, దయార్ద్రహృదయులు నా పరిస్థితికి జాలి పడి సాయమందించారు’’ అంటూ చూపు కోల్పోయిన తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలను, చేయూతనందించిన వ్యక్తులను గుర్తుచేసుకున్నారు హఫీజ్!
 
వేరే దారీ లేదు

అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు కలలు లక్ష్యాలవైపుగా దూసుకెళుతుంటాయి. అవాంతరం ఎదురైనప్పుడు అవన్నీ కల్లలౌతాయి. కానీ హఫీజ్ తన కాళ్లపై తను నిలబడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.‘‘స్నేహితుల దగ్గర కొంత డబ్బు అప్పు తెచ్చి, ఒక ఆటో కొన్నాను. దాన్ని అద్దెకిచ్చి, వచ్చిన డబ్బుతో గడపవచ్చని ఆశ. అలా కొన్ని నెలలు గడిపాను. ఆటో రిపేర్‌కు వచ్చినప్పుడల్లా నాకు తెలిసిన మెకానిక్ పనితోనే దానిని బాగు చేసేవాడిని. నేను చేస్తున్న పని చూసినవాళ్లు, తెలిసినవారు తమ వాహనాలను తీసుకొచ్చి బాగుచేయమనేవారు. వేళ్లతోనూ, చేతులతోనూ తడిమి, ఆ వాహనానికి ఎక్కడ సమస్య ఉందో గుర్తించేవాడిని. అలా ఎవరు వాహనం తీసుకొచ్చినా బాగుచేయడం, అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవడం.. ఏదో తెలియని కొత్త శక్తి నాలో వచ్చి చేరినట్టు అనిపించింది. తెలిసిన విద్యే కదా. వేళ్లకు చూపు తెచ్చుకుంటే చాలు బతుకుబండి నడిచిపోతుంది అనిపించింది. అలా కాశీబుగ్గలో మా ఇంటి దగ్గరే మెకానిక్‌గా వాహనాలకు మరమ్మతు చేయడం మొదలుపెట్టాను. పదేళ్లుగా ఇదే పని. కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. పిల్లలను చదివించుకోగలుగుతున్నాను. ఇప్పుడు కొడుకు ఏడవ తరగతి, కూతురు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. నాలుగు ఆటోలు సమకూరితే, వాటిని అద్దెకిచ్చి, ఈ మెకానిక్ పనిచేస్తూ పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఆశ, కల. స్థోమత లేక నాలాగే వారి చదువులూ ఆగిపోతాయేమో అనే భయం తప్ప మరో ఆలోచన లేదు’’ అని చెప్పారు హఫీజ్.
 కష్టాలు వస్తే కుంగిపోయి జీవితంలో వెనకంజ వేయడం సరికాదని చెప్పే హఫీజ్... భవిష్యత్తు కోసం కలలు కనాలంటే కంటిచూపు మీదే ఆధారపడనక్కర్లేదని కూడా నిరూపిస్తున్నారు. విధి పరీక్షలో నెగ్గి చూపున్నవారికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
 
ఎవరి సాయమూ తీసుకోడు


నేను ఆటో డ్రైవర్‌ని. ఐదేళ్లుగా హఫీజ్ నాకు తెలుసు. ఆటోలకు, ద్విచక్రవాహనాలకు ఏ సమస్య వచ్చినా మా కంటే బాగా వేళ్లతో చెక్ చేసి చెప్పేస్తాడు. వెంటనే మరమ్మతు చేస్తాడు. అందుకు ఎవరి సాయమూ తీసుకోడు. చూపు లేకపోయినా చూపున్నవారితో సమానంగా చేసే హఫీజ్ పని విధానం చూసి మేమంతా ఆశ్చర్యపోతుంటాం.
 - మోహన్, ఆటో డ్రైవర్
 
పాఠకులకు  గమనిక
 
పేరుకు ఇది

‘మిణుగురులు’ శీర్షికే అయినా, ఇందులో వచ్చే వ్యక్తుల ఆదర్శవంతమైన జీవితాలు సమాజానికి దివిటీల వంటివి. చీకటిని తిడుతూ కూర్చోక, హఫీజ్‌లా చిరుదివ్వెలు వెలిగించుకున్న వారెవరైనా మీకు తారసపడితే వారి వివరాలు మాకు తెలియజేయండి. అంధులలో స్ఫూర్తి నింపడానికి మీ వంతు కర్తవ్యంగా ముందుకు రండి.
 మా చిరునామా
 మిణుగురులు, ఫ్యామిలీ, సాక్షి దినపత్రిక,
 రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34.
 

మరిన్ని వార్తలు