ఎండల్లో హెయిర్‌కేర్

10 Mar, 2016 23:12 IST|Sakshi
ఎండల్లో హెయిర్‌కేర్

ఎండకాలంలో చర్మసంరక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో కేశసంరక్షణకు కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం శ్రద్ధపెడితే తీవ్రమైన ఎండల్లోనూ అలల్లా ఎగిసిపడే కేశాలు సాధ్యమే.
 
* ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చర్మానికి రాసినట్లే జుట్టుకు లేదా మాడుకు కొంచెం సన్‌స్క్రీన్ లోషన్ అప్లయ్ చేయాలి. ఈ లోషన్లు రాసినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత లేదా రాత్రి పడుకునే లోపుగా తలస్నానం చేయాలి. అలా సాధ్యం కానప్పుడు లోషన్లకు బదులుగా మాడుకు కొబ్బరినూనె రాయాలి.
 
* ఈ కాలంలో స్విమ్మింగ్‌పూల్స్ అన్నీ నిండుగా ఉంటాయి. ఈతప్రియులు ఎండవేడి నుంచి సాంత్వన పొందడానికి ఎక్కువ సేపు నీటిలో ఉండడానికి ఇష్టపడతారు. అయితే స్విమ్మింగ్‌పూల్స్‌లో ఉండే నీటిలో క్లోరిన్ కలుపుతారు, ఉప్పునీరు కూడా ఉంటుంది. కాబట్టి పూల్‌లో దిగే ముందు తలను మంచినీటితో తడపాలి. జుట్టు తగినంత నీటిని పీల్చుకున్న తర్వాత ఎంత సేపు పూల్‌లో ఉన్నా ఆ నీటిని పీల్చుకోదు. కాబట్టి అందులోని రసాయనాల ప్రభావం జుట్టుపై పడదు. స్విమ్మింగ్ పూర్తయిన తర్వాత తప్పని సరిగా తలస్నానం చేయాలి.
 
* తలస్నానం పూర్తయిన తర్వాత కండిషనర్ వాడకాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. సమ్మర్ కోసం ప్రత్యేకంగా సన్‌స్క్రీన్ ఉన్న హెయిర్ కండిషనర్‌లు మార్కెట్‌లో దొరుకుతాయి.
 
* తలస్నానం చేసేటప్పుడు చివరగా నిమ్మరసం కలిపిన నీటితో జుట్టును తడపాలి. ఇలా చేయడం వల్ల కేశాలు దృఢంగా మారతాయి. కాని ఎండకాలంలో పొడిజుట్టుకు నిమ్మరసం వాడితే మరింత నిర్జీవంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పొడిజుట్టుకు కాఫీ డికాషన్ వంటి కండిషనర్‌లను వాడడం మంచిది.
 
* మూడు కప్పుల మంచినీటిలో రెండు కప్పుల ఆపిల్‌సైడర్ వెనిగర్ కలిపి ఈ మిశ్రమాన్ని తలస్నానం పూర్తయ్యాక చివరగా జుట్టుకు పట్టించాలి. చుండ్రు ఉంటే ఈ మిశ్రమాన్ని జుట్టుకుదుళ్లకు కూడా పట్టించాలి.

మరిన్ని వార్తలు