హెయిర్‌ కౌన్సెలింగ్‌

30 May, 2018 01:03 IST|Sakshi

మునపటి పెద్ద జుట్టు... మళ్లీ పెరగాలంటే...?
నా వయసు 26 ఏళ్లు. గతంలో నాకు ఒల్తైన జుట్టు ఉండేది. అప్పట్లో నేను పెద్ద జడ వేసుకునేదాన్ని. గత మూడు నాలుగేళ్లుగా నా జట్టు పలచబడుతోంది. ఇప్పుడు నా జుట్టు ఇదివరకటిలాగే పొడుగ్గా పెరిగే అవకాశం ఉందా? ఒకవేళ పెరిగే అవకాశం లేకపోతే కనీసం ఉన్న జుట్టు రాలకుండా ఉండేందుకు మార్గం చెప్పండి. – సావిత్రి, విశాఖపట్నం

జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. మహిళల్లో ఇలా జుట్టు రాలిపోడానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. ఐరన్, విటమిన్‌ బి12 లోపం వల్ల ఇలా జరగవచ్చు. దీంతోపాటు హార్మోన్ల మార్పుల వల్ల కూడా జుట్టు రాలవచ్చు. ప్రధానంగా పాలీ సిస్టిక్‌ ఓవేరియన్‌ డిజార్డర్‌ (పీసీఓడీ) వల్ల కూడా ఇలా కావచ్చు. ఈ వ్యాధి ఉన్నవారిలో రక్తంలో యాండ్రోజెన్‌ అనే హార్మోన్‌ పాళ్లు పెరగడం వల్ల జుట్టు రాలిపోతుంది. ప్రధానంగా తల పైభాగంలో ఉండే ప్రాంతంలో జుట్టు రాలడం ఎక్కువ. ఈ సమస్య ఉన్నవారిలో జుట్టు రాలడంతోపాటు మొటిమలు, స్థూలకాయం, శరీరం ఇన్సులిన్‌కు సరిగా స్పందించకపోవడం (ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌) వంటి సమస్యలూ రావచ్చు.

మీరు మొదట ట్రైకోస్కాన్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత కొన్ని పరీక్షలు చేయించుకోవడం అవసరం కావచ్చు. సీరమ్‌ టోటల్‌ టెస్టోస్టెరాన్, సీరమ్‌ ఇన్సులిన్, 3డీ యూఎస్‌జీ పెల్విస్‌ (అల్ట్రా సౌండ్‌ స్కాన్‌), టీ3, టీ4, టీఎస్‌హెచ్, సీరమ్‌ ఫెరిటిన్, బీ12, విటమిన్‌ డి, సీబీపీ... అనే పరీక్షలు ముందుగా చేయించి, మీ జుట్టు రాలడానికి అసలు కారణాన్ని కనుక్కోవాలి. నిర్దిష్ట కారణాన్ని కనుగొంటే ఆ లోపాన్ని సరిచేసేలా చికిత్సను ఫోకస్‌డ్‌గా చేయవచ్చు. ఒకవేళ హార్మోన్ల లోపం ఉన్నట్లు తెలిస్తే, దాన్ని అధిగమించడానికి ఎండోక్రైనాలజిస్ట్‌ లేదా గైనకాలజిస్ట్‌ ఆధ్వర్యంలో మందులు వాడాల్సి ఉంటుంది.

ఒకవేళ ఐరన్‌ లేదా విటమిన్‌ బీ12, విటమిన్‌ డి లోపాలు ఉంటే... ఆ పోషకాల సప్లిమెంట్స్‌ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీ జుట్టు రాలడం చాలా ఎక్కువగా ఉంటే బయోటిన్, సా పాల్మెటో సప్లిమెంట్లు బాగా ఉపకరిస్తాయి. దీనితో పాటు మినాక్సిడిల్‌ 2% లోషన్‌ను రోజూ రాత్రివేళ తలపై రాసుకోవాలి. ఇక మీ నుంచి రక్తాన్ని స్వీకరించి, అందులోని ప్లేట్‌లెట్లు, ప్లాస్మా వంటివి మళ్లీ మీకే అందించే ఆటోలోగస్‌ ప్రోసిజర్స్‌ వంటి ప్రక్రియలూ ఉపయోగపడతాయి. ఇవన్నీ మీరు కోల్పోయిన పెద్ద జడను మళ్లీ వచ్చేందుకు చాలావరకు దోహదపడే అడ్వాన్స్‌డ్‌ ప్రక్రియలు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్‌ లేదా ట్రైకాలజిస్ట్‌ను సంప్రదించండి.


- డాక్టర్‌ స్మిత ఆళ్లగడ్డ ,చీఫ్‌ ట్రైకాలజిస్ట్‌ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్‌ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు