బంగారంలాంటి ఉపవాసం

16 May, 2019 00:02 IST|Sakshi

చెట్టు నీడ / రంజాన్‌ కాంతులు

‘‘సమాధిలో కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి. హాజీసాబ్‌ కు ఏమీ అర్థంకాక తలపట్టుకుని కూర్చున్నారు. అంతలో ఒక దైవదూత వచ్చి ‘‘హాజీ సాబ్‌ మీరు చేసిన నమాజులు, సత్కార్యాలేమీ మీ మన్నింపుకోసం సరితూగడం లేదు.’’ అంది.‘‘నా జీవితంలో మూడు సార్లు హజ్‌ యాత్ర చేశాను గదా’’ అన్నాడు.‘‘అందులో రెండు హజ్‌లు మీ సొంత డబ్బుతో చేయలేదు. ఒక హజ్‌ మాత్రం లోపభూయిష్టంగా ఉంది’’ అంది దైవదూత. దైవదూత చెప్పిన ఈ మాటలకు హాజీసాబ్‌ లో ఆందోళన మరింత ఎక్కువయ్యింది. ‘‘మీ దగ్గర ఉపవాసాలేమైనా ఉన్నాయా?’’ అని దైవదూత ప్రశ్న.‘‘నా దగ్గర మొత్తం నలభైఏళ్ల పాటు పాటించిన ఉపవాసాలున్నాయి’’ అని ఎంతో ఆతృతతో చెప్పారు హాజీసాబ్‌.

దైవదూతఒక్కో ఉపవాసాన్ని పరిశీలనగా చూసింది. 40 ఏళ్లపాటు పాటించిన ఉపవాసాల్లో ఒక్క ఉపవాసమూ లోపరహితంగా లేదని తేలింది.‘ఉపవాసంలో చాడీలు, పరనింద, అబద్ధం మానుకోలేకపోయానని. నలభైఏళ్లపాటు పాటించిన ఉపవాసాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని’ అప్పటికే కుమిలిపోతున్నారు హాజీసాబ్‌.‘‘హాజీ సాబ్‌ మీకు శుభాకాంక్షలు..’’ అంటూ దైవదూత సంతోషంగా అభినందనలు అని చెప్పడంతో హాజీసాబ్‌కు ప్రాణం లేచి వచ్చినట్లయింది.‘‘నా దగ్గర ఉన్న రికార్డును తీక్షణంగా పరిశీలిస్తే మీ కర్మల చిట్టానుంచి బంగారపు ఉపవాసం ఒకటి కనబడింది’’ అంది దైవదూత.

‘‘బంగారపు ఉపవాసమా? నేనెప్పుడూ దాన్ని పాటించలేదే’’ అని హాజీసాబ్‌ దైవదూత వైపు ఏమీ అర్థం కానట్లు చూశారు.‘మీరు ఏటా రమజాన్‌లో ఒక నిరుపేద ఉపవాసికి ఇఫ్తార్‌ చేయించే వారు. అదే ఆ బంగారపు ఉపవాసం అనిపించుకుంది’’ అని దైవదూత సమాధానం ఇచ్చింది.ఎంతో ప్రచారంలో ఉన్న ఈ కథ కల్పితమే కావచ్చు. అబద్ధాలు, చాడీలు, దుర్భాషలు, చెడుచూపు, అవినీతి సొమ్ము సంపాదించడం లాంటి వాటిని మానుకోకుండా ఉపవాసాలు పాటించే వారికి ఆకలిదప్పులు తప్ప మరేమీ ప్రాప్తించవని ప్రవక్త (స) పరోక్షంగా హెచ్చరించారు. 
– ముహమ్మద్‌ ముజాహిద్‌

మరిన్ని వార్తలు