జన్యుమార్పిడితో సగం తగ్గిన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌...

2 Mar, 2018 12:57 IST|Sakshi

ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను జన్యుమార్పిడి పద్ధతులతో తగ్గించవచ్చునని పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధన స్పష్టం చేసింది. మన అవసరాలకు తగ్గట్టుగా కచ్చితమైన జన్యుమార్పులు చేయగలిగే క్రిస్పర్‌ క్యాస్‌ –9 టెక్నాలజీని వాడటం ద్వారా తాము కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను సగానికి తగ్గించగలిగామని వీరు తెలిపారు. ఏఎన్‌జీపీటీఎల్‌–3 ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువులో సహజమైన మార్పు ఉన్నవారిలో, ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు తక్కువగా ఉంటాయని, ఈ జన్యుమార్పును ప్రవేశపెట్టడం ద్వారా ఇతరుల్లోనూ ఇదే ఫలితాలు సాధించవచ్చునని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ముసునూరు కిరణ్‌ అంటున్నారు.

ఈ నేపథ్యంలో తాము ఎలుకలపై కొన్ని ప్రయోగాలు చేశామని, ముందుగా వీటికి ఏఎన్‌జీపీటీఎల్‌–3 జన్యువులో మార్పులు చేయగల క్రిస్పర్‌ ఆధారిత చికిత్స ఇచ్చామని.. వారం తరువాత పరిశీలించినప్పుడు మార్పులు 35 శాతం వరకూ పూర్తయినట్లు గుర్తించామని కిరణ్‌ వివరించారు. దీంతోపాటే ఆ ఎలుకల్లో హానికారక కొవ్వులు సగం వరకూ తగ్గినట్లు స్పష్టమైంది. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఐదేళ్లలో ఈ చికిత్స అందుబాటులోకి వస్తుందని.. తద్వారా గుండెజబ్బుల బారిన పడిన వారు జీవితాంతం మందులు తీసుకునే అవసరం లేకుండా పోతుందని.. జన్యుమార్పులు చేసే వ్యాక్సీన్‌ను ఒకసారి తీసుకుంటే సరిపోతుందని కిరణ్‌ వివరించారు.   

మరిన్ని వార్తలు