నువ్వే క్రిస్మస్...

25 Dec, 2015 01:04 IST|Sakshi
నువ్వే క్రిస్మస్...

సంతోషంగా జీవించడానికి వజ్ర వైఢూర్యాలు అక్కర్లేదు.
నీవే ఒక ప్రకాశవంతమైన జీవితం అయితే...
అనంతమైన సంతోషాన్ని సంపాదిస్తావు.
నీలో ఆ కాంతి దాగి ఉంది.
నువ్వే ఆ కాంతిని మసకబార్చావు.
ఎన్నో మంచి సందేశాలలో ఆణిముత్యాలైన ఈ 10 జీవన సూత్రాలను
ఆచరిస్తే... నీలో దాగి ఉన్న సంతోషం మళ్లీ ప్రకాశిస్తుంది.
నీవే సమాజానికి ఒక గొప్ప పండగలాగా కనబడతావు.
నీవే ఓ వేడుక.
నీవే ఓ ఉత్సవం.
నీవే... క్రిస్మస్.

 
1. లోకానికి ఉప్పులా ఉండాలి..!
నిజమైన విశ్వాసి లోకానికి ఉప్పులా ఉండాలని సూచిస్తున్నాడు దేవుడు. ఉప్పులోని సారం పోయిందంటే అది బయట పారవేసేందుకు తప్ప దేనికీ పనికి రాదు. విశ్వాసి కూడా అంతే. నిజమైన విశ్వాసంతో జీవించినపుడే అతడికి విలువ. సోడియం, క్లోరైడ్ అన్న రెండు రసాయనాలూ ఉప్పును ఉపయోగకరమైనవిగా చేసినట్లే... సత్యం, ప్రేమ అనే రెండు ఆత్మీయాంశాలూ విశ్వాసిని ఈ లోకానికి ఉప్పుగా చేస్తాయి. సత్యం ఉండి ప్రేమ లేకపోతే విశ్వాసి నిరంకుశుడవుతాడు. అది అతని అహంకారానికి, తద్వారా తోటి జనుల అణచివేతకు దారితీస్తుంది. అతని వల్ల లోకానికి ప్రయోజనముండదు సరికదా ప్రమాదమేర్పడు తుంది. ప్రేమ ఉండి సత్యం లేకపోతే ఆ ప్రేమ బలహీన మవుతుంది, గుడ్డిదవుతుంది. అది మనిషిని బలహీన పర్చుతుంది. ఉప్పు నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ అన్ని పదార్థాల్లోనూ విలీనమైపోయి, వాటికి రుచినిస్తుంది. విశ్వాసి కూడా అంత నిరాడంబరంగా ఉండాలన్నది దేవుని కోరిక.

బైబిల్‌లో ఈ మాటను బలపరిచే ఒక చిన్న ఉదాహరణ ఉంది.  యెష్షయి ఏడుగురు కొడుకులు చాలా బలాఢ్యులు. రాజు కావడానికి అన్ని అర్హతలూ ఉన్నవారు. కానీ వారిలో ఎవరూ రాజులు కాలేదు. అత్యంత బలహీనుడు, గొర్రెల కాపరి అయిన దావీదును ఎంచుకుని, అతడిని చక్రవర్తిని చేశాడు దేవుడు. ఎందుకంటే అతడు నిజమైన విశ్వాసి. అలాంటివాడు రాజు అయితే ఎందరికో ఉపయోగపడతాడు. అందుకే అతణ్ని దేవుడు లోకానికి ఉప్పుగా చేశాడు.
 
2. అవునంటే అవును... కాదంటే కాదు!
 మాటలు విషాన్ని చిమ్మగలవు. తీయదనాన్ని కూడా పంచగలవు. మాటలే మనిషిని మహోన్నతస్థాయికి చేరుస్తాయి. అవే పాతాళానికీ తొక్కేస్తాయి. అందుకే మనిషి అంతరానికి బాహ్యానికి తేడా ఉండకూడదు. మాటలు మితంగా, భావ సహితంగా, ఆంతర్యంలోని నిగూఢమైన విషయాలను కూడా నిజాయితీతో వెల్లడించేవిగా ఉండాలని దేవుడు ఆదేశించాడు.

అవతలి వ్యక్తి ప్రగతి పట్ల ఆంతర్యంలో అసూయ, ఈర్ష్య రగులుతున్నా... పైకి మాత్రం ఎంతో ఆనందాన్ని నటించడంలో మానవుడు దిట్ట. కృతజ్ఞతాభావం లేకున్నా థాంక్యూ అని చెప్పడం, అవతలి వ్యక్తి బాగోగుల మీద శ్రద్ధ లేకున్నా ఆల్ ద బెస్ట్ చెప్పడం, అతని విజయం లోపల ద్వేషభావాన్ని రగిలిస్తున్నా కంగ్రాట్స్ చెప్పడం ఆధునిక మర్యాదగా మారిన నేపథ్యంలో మన మాట అలా ఉండకూడదని చెప్పడమే దేవుని ఆంతర్యం. మాట తప్పనివారు, మడమ తిప్పనివారే దేవుని బిడ్డలన్నది ఈ మాటల సందేశం. చరిత్రలో కొందరి తొందరపాటు మాటలు మహాయుద్ధాల్నే తీసుకొచ్చాయి. ఎంతో గొప్ప వ్యక్తులకు సైతం గౌరవం లేకుండా చేశాయి. అందుకే మాటలు మృదువుగా, సరళంగా, సూటిగా, కలుషిత రహితంగా ఉండాలన్నాడు ప్రభువు. అబద్ధాలాడటం మాత్రమే పాపం కాదు, నిజాన్ని దాచడం కూడా పాపమే. కాబట్టి మనం అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పేవారిగా ఉండాలే తప్ప... మెప్పు కోసమో, మరి దేని కోసమో మాటలు మార్చేవారిగా ఉండకూడదు. అది ప్రభువు దృష్టిలో హేయమైన పని!
 
3. ఇచ్చే గుణం ఉండాలి..!
తీసుకోవడం కన్నా ఇవ్వడమే ధన్యత.. ఎదుటివారి నుంచి ఆశించడం ఎంత పాపమో, మనకున్నది ఇతరులకు ఇవ్వడం అంత పుణ్యం. అయితే ఇవ్వడం అనేది రహస్యంగా జరగాలంటాడు ప్రభువు. అది ఇచ్చాం ఇది ఇచ్చాం అని గొప్పలు చెప్పుకోవడాన్ని ఆయన ఇష్టపడడు. కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదని ప్రభువు చెప్పాడు. దేవుని సృష్టి కూడా అలాగే ఉంది. సృష్టికి ఇవ్వడమే తెలుసు. సూర్యుడు వెలుగును,  మేఘాలు నీటిని, భూమి పంటను ఇస్తున్నాయి. ఒక్క మనిషి మాత్రమే తీసుకోవడంతో ఆనందం పొందుతాడు. కానీ ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇచ్చినప్పుడే తెలుస్తుంది. బైబిల్‌లో ఇందుకు ఉదాహరణగా జక్కయ్య కనపడతాడు.

జక్కయ్య యెరికో నగరంలో ఉండేవాడు. అతడో సుంకరి. ఎవరు ఎంత కష్టంలో ఉన్నా పట్టించుకునేవాడు కాదు. చిత్ర హింసలు పెట్టి మరీ పన్నులు వసూలు చేసేవాడు. ఒకసారి యేసు ప్రభువు ఆ ఊరికి వచ్చాడు. జక్కయ్య ప్రభువును చూశాడు. కరుణ నిండిన... దయ నిండిన... సమస్త జీవరాశులకూ ప్రేమను పంచుతున్న ప్రభువును చూశాడు. ఏ సంపదా లేని ప్రభువు అంత పంచుతూ ఉంటే... ఎంతో సంపద ఉండీ ఇతరుల దగ్గర ఇంకా పీడించి లాక్కుంటున్నానే అని పశ్చాత్తాపం చెందాడు జక్కయ్య. ఇవ్వడం గొప్ప అని తెలుసు కున్నాడు. తన ఆస్తిలో సగం బీదలకిచ్చాడు. అన్యా యంగా అందరి దగ్గరా తీసుకున్నదానికి నాలుగు రెట్లు తిరిగి ఇచ్చాడు. ఇవ్వడంలోని ఆనందాన్ని పొందాడు.
 
4. మనసు పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి!
వ్యభిచారం చేయడం పాపం అంటుంది ధర్మం. నేరం అంటుంది చట్టం. అయితే సంబంధం మాత్రమే కాదు, మోహపు చూపు చూసినా పాపమేనని బోధించాడు యేసు. ఇలాగే ఆయన మన మనసును ఏ విధంగా పరిశుద్ధం చేసుకోవాలో వివరించాడు. ఒక వస్తువును దొంగిలించడమే కాదు, దొంగిలించాలనుకోవడమూ పాపమే. తిట్టడం మాత్రమే కాదు, తిట్టాలనుకోవడమూ పాపమే అంటాడాయన. మనిషిలో కనబడకుండా ఉండే అత్యంత చీకటే పాపం. అయితే దేవునిలో అంతకు కోట్లాది వంతుల వెలుతురు ఉంది. మనిషి ఊహకందనంత ఉదాత్తమైన  క్షమాపణ ఉంది. మనిషి అంతరాత్మలో నిరంతరం సాగే అంతర్యుద్ధం పాపమైతే అతని విముక్తి కోసం దేవుడు చేసే నిరంతర యాగమే రక్షణ.

వీరిద్దరి మధ్య ఎప్పుడూ పాపం అడ్డంకిగా నిలుస్తూ ఉంటుంది. మనిషిని ఒంటరివాణ్ని, దేవుణ్ణి అతడికి పరాయివాణ్ని చేస్తూ ఉంటుంది. తోటి విశ్వాసులందరితో బంధాల్ని తెంచివేస్తుంది. చివరికి ఓటమిని, డొల్లతనాన్ని మాత్రమే మిగుల్చుతుంది. అందుకే పాపాన్ని కూకటివేళ్లతో సహా ఆంతర్యంలో నుండి పెకలించి వేయాలంటాడు ప్రభువు.
 
అయితే దేవుని శక్తి ముందు పాపం తలవంచ వలసిందే! కాబట్టి మనలోనే దేవుణ్ని నింపుకుంటే పాపం మన దరికి కూడా చేరదు. ఒకవేళ చేరినా దేవుని శక్తి ముందు నిలవదు. అయితే దేవుణ్ని నింపుకోవడం అంటే ఏమిటి? దేవుని ఆజ్ఞలను, దేవుడు చెప్పిన నీతి వచనాలను అలవర్చుకోవడం, వాటిని మన జీవితంలో అడుగడుగునా ఆచరించడమే!
 
5.  ఒక చెంపపై కొడితే, మరో చెంప చూపు!
ఓసారి దావీదు చక్రవర్తికి అడవుల్లో తల దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది అదనుగా తీసుకుని షిమీ అనే అతను దావీదు దుర్మార్గుడు, మోసగాడు, నరహంతకుడు అని దూషించడం మొదలెట్టాడు. దాంతో దావీదు అనుచరులు అతణ్ని చంపేద్దా మన్నారు. కానీ దావీదు ఒప్పుకోలేదు. అతణ్ని క్షమిద్దామన్నాడు. దాంతో షిమీ శాపాలన్నీ దావీదుకు ఆశీర్వచనాలుగా మారాయి.
 ఓసారి మదర్ థెరిస్సాను ఒక విశ్వవిద్యాలయం, స్నాతకోత్సవానికి ఆహ్వానించింది. అందుకు సమ్మతించిన ఆమెను విమర్శిస్తూ విప్లవవాద, వామపక్షవాద విద్యార్థులు నల్లజెండాలు, హోరెత్తే నినాదాలతో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. థెరిస్సా వాళ్ల ముందు చేతులు జోడించి, తనలో తప్పులుంటే క్షమించమని వేడుకున్నారు. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం.

పగతో శత్రువుకు గాయాలు చేయాలనుకునేవాడికి తెలియని విషయమేమిటంటే తన గాయాలు ఎన్నటికీ మాననివిగా పచ్చిగా ఉంటాయని. పగ సాధించాలను కున్నపుడు మన శత్రువుకు సమానమవుతాం. అవన్నీ క్షమించినపుడు అతన్ని అధిగమిస్తాం. అందుకే కంటికి కన్ను పంటికి పన్ను ధోరణికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు శత్రువును క్షమించాలన్న ప్రేమ సందేశాన్ని ప్రతిపాదించాడు. అదే సిద్ధాంతాన్ని తన జీవితంలో అమలు చేస్తూ శిలువలో తనను హింసించిన వారిని సైతం క్షమించాడు. పగవాడు నీ ఇంటికొస్తే అతనికి కడుపు నిండా భోజనం పెట్టు అని మనకూ సందేశమిచ్చాడు.
 
6. ఇతరులను విమర్శించకండి!

థామస్ అల్వా ఎడిసన్‌కి చిన్నతనంలో చదువుపైనే కాదు, దేనిపైనా శ్రద్ధ ఉండేది కాదు. ఒకరోజు ఇంటికొచ్చి స్కూలు వారిచ్చిన ఓ కాగితాన్ని తల్లికిచ్చి చదవమన్నాడు. తల్లి పెద్దగా చదివింది: ‘మీ వాడికి అవసరమైన దానికంటే ఎక్కువ తెలివి. అతనికి మేము పాఠాలు చెప్పలేం. ఇంట్లోనే చదివించుకోండి’ అని ఉంది అందులో. నాటి నుంచి ఎడిసన్‌కు తల్లే అధ్యాపకురాలయ్యింది. ఆ తర్వాత ఆయన మేధావిగా, శాస్త్రవేత్తగా పేరు పొంది ఎన్నో గొప్పవి కనుగొన్నాడు. తల్లి చనిపోయినప్పుడు ఆమె పెట్టె వెదికితే ఆ పాత ఉత్తరం కనిపించింది. అందులో నిజానికి ఇలా రాసి ఉంది: ‘మీవాడు ఎందుకూ పనికిరాడు. వాడికి చదువు చెప్పడం దండగ. ఇంట్లోనే పెట్టుకోండి!!’ ఒకవేళ టీచర్ మాటల్ని తల్లి పట్టించుకొని ఉంటే ఏమయ్యేది?! ఆమె మార్చి చదివింది కనుకనే ఆయన అంతటివాడయ్యాడు.

ఎదుటివారిని కించపర్చడం, తక్కువ చేసి మాట్లాడటం, వారి తప్పులెన్నడం చాలామందికి ఇష్టం. అలా ఇతరులకు తీర్పు తీర్చడం తప్పని, అలా తీర్పు తీర్చేవారికి దేవుడు కూడా అలాంటి తీర్పే తీరుస్తాడని యేసుక్రీస్తు బోధించాడు. నీ కంట్లో దూలం ఉండగా, అవతలి వ్యక్తి కంట్లోని నలుసునెందుకు తీసుకొమ్మని చెబుతావని ప్రశ్నించాడు. ఆయన మంచివాళ్లు, నీతిమంతుల కోసమే వర్షం కురిపించడు. అందరి కోసం కురిపిస్తాడు. చెడ్డవాళ్లు, అవినీతిమంతులు కూడా ఆ వర్షంలో సమానంగా తడుస్తారు. ఆయన తన కృపను సమానంగా పంచుతాడు. ఎక్కువ తక్కువలతో ఎవరినీ విమర్శించవద్దు. తీర్పులు ఇవ్వవద్దు. అలా చేసేవారు దేవునికి సన్నిహితం కాలేరు.
 
7. నిశ్చింతగా ఉండాలి!
 రేపటిని గురించిన చింత మనిషిలో భయాన్ని రగిలిస్తుంది. అయితే రేపటిని గురించి చింతించేవారు అవిశ్వాసులని యేసు చెప్పాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు వాటికంటే ఎంతో శ్రేష్టమైన మనుషులను పోషించడా అన్నది ఆ మాటల సారాంశం. అందుకే విశ్వాసి నిబ్బరంగా, నిశ్చింతగా జీవించాలి. ఒక మహా చక్రవర్తితో పోలిస్తే, మామూలు పక్షులు ఏమాత్రం!

అటు బలహీనమైన పక్షులనూ, బలవంతులైన చక్రవర్తులనూ కూడా సమానంగా పోషించే బలమైన దేవుడు ఉండగా జీవితంలో దేని గురించీ చింతించవలసిన అవసరం లేదు. దీని గురించి చెప్పడానికి ఒక కథ ఉంది.

ఓ వ్యక్తి చనిపోయాడు. అతణ్ని ఖననం చేశాక బంధువులంతా వెళ్లిపోయారు. భార్య, నాలుగేళ్ల కూతురు మాత్రం ఇంట్లో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. కూతురు భయంతో వణికిపోతోంది. ‘దేవుడున్నాడు కదమ్మా కాపాడుతాడు నిద్రపో’ అంది తల్లి. ‘ఆ కనిపించే చంద్రుడే దేవుని దీపమా’ అనడిగింది కూతురు. ‘అవునమ్మా, ఆయన వద్ద దీపాలు ఎప్పుడూ వెలుగు తూనే ఉంటాయి’ అంది తల్లి. ‘మరి ఆయన దీపం ఆర్పి నిద్రపోడా’ అనడిగింది కూతురు. ‘ఆయన అసలు నిద్ర పోడమ్మా, దివారాత్రులు మెలకువగా ఉండి మనల్ని కాపాడుతాడు’ అంది తల్లి. ‘అయితే ఆయన ఉండగా నాకు భయమెందుకు’ అంటూ హాయిగా నిద్రపోయింది కూతురు. ఆ నమ్మకం, నిశ్చింత అందరిలోనూ ఉండాలి!
 
8. లోకానికి వెలుగై ఉండాలి!

 ఆధునిక జీవనశైలిలో మెరుపు వేగం నేర్చుకున్నాం కాని వెలగడం మర్చిపోయాం. అయినా విజేతలమన్న భ్రమలోనే బతుకుతున్నాం. అయితే వెలిగేవాడే విజేత అంటాడు యేసుప్రభువు. అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటాడు. ఎన్నో కిలోమీటర్ల దూరంలోని లైట్ హౌజ్ పంపే చిరు వెలుగు కిరణాలు ఎంతో అధునాతనమైన బ్రహ్మాండమైన నౌకలకు, ప్రపంచమంతా చుట్టి వచ్చిన ప్రతిభావంతులైన నావికులకు తీరమెక్కడుందో, దారిలో ఏ ప్రమాదాలున్నాయో తెలుపుతుంది. లోకానికి విశ్వాసి అలాంటి దివిటీ వంటివాడు అంటాడు ప్రభువు. విశ్వాసి తాను వెలుగుతూ ఇతరులకు వెలుగుబాట చూపించాలి. చీకటిని చీకటి పారదోలలేదు. పగను పగ, ద్వేషాన్ని ద్వేషం రూపుమాపలేవు. చీకటిని వెలుగు జయించినట్టే పగను, ద్వేషాన్ని, అమానుషత్వాన్ని ‘ప్రేమ’ అనే వెలుగు మాత్రమే జయిస్తుందన్నది క్రీస్తు బోధనల సారాంశం.

వెలిగే దివిటీ చీకట్లో వెలుగుబాటును చూపించడమే కాదు, ఆరిపోయిన దివిటీలను వెలిగించి ఉజ్జీవానికి కూడా కారకమవుతుంది. వెలుగు ధైర్యాన్నిస్తుంది, గమనాన్ని ప్రమాదరహితం చేస్తుంది, గమ్యానికి చేర్చుతుంది. కాబట్టి మనిషి మనుగడకు వెలుగు ఎంతో అవసరం. మరి మనమే స్వయంగా వెలుగు కావడం అంటే ఏమిటి? ఇతరుల జీవితాలను ముందుకు నడిపేందుకు మనం సహకరించాలనే కదా! వారికి దారి చూపాలనే కదా! అలా చేసినప్పుడే మనం నిజంగా వెలుగుతాం!
 
9. శాంతిపూర్వక బంధం ఉండాలి!
 దేవుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఆలయానికి అర్పణలు తీసుకొస్తూ ఉంటారు. కాని దేవుడు ఆ అర్పణను చూడడు. దాన్ని తెచ్చిన భక్తుని హృదయంలోని కల్మషాన్ని చూస్తాడన్నది ఈ బోధ సారాంశం. దేవునికి, మనుషులకు మధ్య సుహృద్భావ శాంతియుత వాతావరణం కావాలి. అందుకే దేవుని సన్నిధికి అర్పణను తెచ్చినప్పుడు, ఆ తెచ్చిన వ్యక్తికి ఎవరితోనైనా కలహముందని గుర్తుకు వస్తే... అదక్కడే వదిలేసి వెళ్లి ముందు ఆ సహోదరుడితో సమాధానపడాలని ప్రభువు బోధించాడు. అంటే ఏమిటంటే... మనసులో ఇతరులపై పగ, ద్వేషాలు నింపుకుని, దేవునికి దగ్గరవుదామనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇతరులను ప్రేమించనివాడు, వారితో శాంతిపూర్వక బంధాన్ని నెరపనివాడు తన మనిషి కాదు అని దేవుడు స్పష్టంగా చెప్పేశాడు. అది మర్చిపోయి స్వార్థంతో వక్రమార్గంతో జీవిస్తూ... కేవలం ఖరీదైన అర్పణలతో దేవుని ప్రసన్నం చేసుకోగలనని ఎవరైనా భావిస్తే, లంచాలిచ్చి అధికారులను లోబర్చుకున్నట్టు దేవున్ని కూడా వశపర్చుకోగలనని భావించడమే అవుతుంది.

కాబట్టి దేవుని ప్రసన్నత కోరేముందు సాటి మనిషి మనసును గెలుచుకోవడం చాలా అవసరం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్న ఆజ్ఞకు అదే అసలైన అర్థం. అదే మన జీవన పరమార్థం. ఈ విషయాన్ని తెలుసుకున్ననాడే దేవుడి మనసులో చోటు దొరికేది. నిత్యజీవం మనకు సొంతమయ్యేది.
 
 10. ఇరుకు మార్గమే మంచి మార్గం!

 ప్రయాణం చేయాలనుకున్నప్పుడు విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటాం. ఎటువంటి ఆటంకాలూ, ఇబ్బందులూ కలగని దారిని చూసుకుని, అందులో సుఖంగా ప్రయాణించేయాలని అనుకుంటాం. ఇరుకు మార్గంలో ఆటంకాలు వస్తాయని మనకు భయం. అయితే మంచి మార్గం ఎప్పుడూ విశాలంగా ఉండదు. నిజాయతీగా ఉండాలి అనుకుంటే ఈ లోకంలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. అందుకని నిజాయతీని వదిలేసుకుని అవినీతికి పాల్పడితే దేవుడికి పూర్తిగా దూరమైపోతాం. ఆయన దృష్టిలో అవినీతిపరుడిగా మిగిలిపోతాం. ఈ విషయాన్ని క్రీస్తు బోధలు సుస్పష్టం చేశాయి. మంచి మార్గం ఎప్పుడూ కష్టాలతో నిండి ఉంటుందని, అయినా అందులోనే నడవమని కచ్చితంగా చెప్పాడు. అది కాదని మనకు నచ్చిన దారిని ఎంచుకుంటే ఏమవుతుందో యోనా అనే వ్యక్తి కథే మనకు చెబుతుంది. దేవుడు సేవ చేయడానికి ఒక చోటికి వెళ్లమని యోనాకు చెప్పాడు. ఆ కష్టాలన్నీ పడలేక అతడు వేరే చోటికి పారిపోదామనుకున్నాడు. తీరా అతను ఎక్కిన ఓడ తుపానులో చిక్కుకుంది. సముద్రంలో పడిపోతే ఓ పెద్ద చేప అతణ్ని మింగేసింది. అలా ఎన్నో కష్టాలు పడిన అతణ్ని చివరికి దేవుడే కాపాడాల్సి వచ్చింది. ఆ ఇరుకు మార్గంలోనే అతడు ప్రయాణించాల్సి వచ్చింది. చివరికి ఆ మార్గం అతణ్ని దేవుడి దగ్గరకు చేర్చాకగానీ తెలియలేదు... అతడికి ఆ దారి విలువ. కాబట్టి కష్టమైనా ఇరుకు దారిలోనే గమనం సాగిస్తే చేరాల్సిన గమ్యానికే చేరుకుంటాం!
 - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్
 
 

మరిన్ని వార్తలు