శుభ వర్తమానంకీస్తు జననం

24 Dec, 2013 22:58 IST|Sakshi

వందల ఏళ్లుగా ఒకటే నిరీక్షణ! రక్షకుడు వస్తాడని, ఎడతెగని కడగండ్ల నుంచి కాపాడతాడని కళ్లార్పని వీక్షణ. ఏమిటి నమ్మకం వస్తాడని? మత గ్రంథాలు చెప్పాయి, ప్రవచనాలు చెప్పాయి. అన్నిటినీ మించి అంతరాత్మ చెబుతోంది!
 ఇక తిరుగేముంది? విశ్వసించినవారి ఆశ ఫలించకుండా ఉంటుందా?
 క్రీస్తు జన్మించాడు. లోకరక్షకుడై ఆయన భువికి ఏతెంచాడు.
 ఆ శుభ వర్తమానం మొదట అందింది ఎవరికో తెలుసా? సామాన్యులకు,
 అణగారిన వర్గాల వారికి! ఏమిటి ఇందులోని అంతరార్థం?  

 
 ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహాము పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని బేత్ సహోర్ గ్రామ శివార్లలో కొందరు గొర్రెల కాపరులు తమ మందలతో పొలాల్లో ఉండగా అకస్మాత్తుగా గొప్ప వెలుగు వారిమధ్య ప్రకాశించింది. వాళ్లంతా భయంతో వణికిపోయారు. ఆ వెలుగులో ఒక దూత వారికి కనిపించి ‘భయపడవద్దు’ అని అభయమిచ్చి, దావీదు పట్టణమైన బెత్లెహాములో లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మించాడన్న వార్తను ప్రకటించింది. అది అందరికీ శుభవర్తమానమని ఆ దూత తెలిపితే, కాపరులంతా ఆనందంగా బెత్లెహాము వెళ్లి మరియను, యోసేపును, శిశువైన యేసుప్రభువును దర్శించడమేగాక ఆ వార్తను ఆ ప్రాంతమంతా ప్రకటించారు (లూకా 2:1-20).
 
రక్షకుని రాకకోసం అంటే హెబ్రీహాషలో ఒక ‘మెస్సీయా’ కోసం యూదులు వందల యేళ్లుగా ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత అణచివేతకు గురైన యూదులు మెస్సీయా రాకతో తమ కష్టాలన్నీ తీరుతాయని విశ్వసించారు. మెస్సీయా రాక గురించి వారి మతగ్రంథాలు, ప్రవచనాలు చెప్పాయి. యూదుల ఆరాధన దినమైన శనివారం నాడు వాళ్లంతా సమాజమందిరాల్లో ఆరాధన చేస్తున్నప్పుడు మెస్సీయా రాక మీదే మతాధికారులు ఎక్కువగా ప్రసంగాలు చేస్తూ, మెస్సీయా వచ్చి బంగారు పాలన అందిస్తాడని చెప్పి ఊరడిస్తుంటారు. మెస్సీయా పాలనలో అగ్రాసనాలు తమవేనని, తామే ఆయన తో సహపాలకులమని వారి విశ్వాసం.

ఈ నేపథ్యంలో మెస్సీయగా యేసుక్రీస్తు భువికేతెంచాడు. ఆయన రాక ముందుగా తమకే తెలుస్తుందని, మెస్సీయా పాలన అంటే పరోక్షంగా ఆ పాలన తమదేనని భావిస్తున్న మతపెద్దల అంచనాలను తారుమారు చేస్తూ, యేసుప్రభువు జన్మశుభవార్త పామరులు, గొర్రెల కాపరులకు ముందుగా ప్రకటించబడటం యూదుల్లో అగ్రవర్ణాలవారికి మింగుడు పడలేదు! అందరిలోలాగే యూదుల్లోనూ రకరకాల తెగలున్నాయి. ఆ తెగల్లో గొర్రెల కాపరులది అథమస్థాయి. యెరూషలేము పట్టణంలోని దేవాలయంలో నిత్యం జరిగే బలుల కోసం గొర్రెలు, మేకలు సరఫరా చేయడం ఆ కాపరుల వృత్తి. గొర్రెల కాపరులను, యూదు పెద్దలు అంటరానివారుగా పరిగణించేవారు.

అందువల్ల గొర్రెల కాపరులకు దేవాలయం లోపలికి ప్రవేశం నిషేధించారు. అలాంటి గొర్రెల కాపరులకు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మెస్సీయగా పంపిన వార్తను ముందుగా ప్రకటించడం జీర్ణం చేసుకోలేని విషయమైంది. ఆ కోపంతోనే యేసుక్రీస్తు మెస్సీయగా కానేకాడని వారు ప్రకటించారు. యూదులంతా ఆ మాటే నమ్మారు. పామరులైన గొర్రెల కాపరులు ప్రకటించిన రక్షకుని రాకడ శుభవార్త ప్రపంచం నలుమూలలకూ చేరగా, యూదుపెద్దలు సృష్టించిన అబద్ధపు వార్త ఇశ్రాయేలు దేశ సరిహద్దుల్లో యూదుల్లో మాత్రమే ప్రబలిందన్నమాట!!
 
యేసుక్రీస్తు రాకతో లోకమంతా వెలుగుమయమైంది.  నిరుపేదలకు యేసుక్రీస్తు రాక ఊరటనిచ్చింది. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ, ఆత్మీయంగానే కాదు సామాజికంగా కూడా యేసుక్రీస్తు విప్లవాత్మకతను రేకెత్తించాడు. బలియర్పణను పాప పరిహార విధానంగా పాత నిబంధన కాలంలో దేవుడే ఏర్పరచాడు. యెరూషలేములో చక్రవర్తియైన సోలోమోను నిర్మించిన మహాదేవాలయం యూదులందరికీ దైవారాధనకు ప్రధాన కేంద్రమైంది. దేవుణ్ణి దేవాలయాలకు, ఆయన పూజావిధివిధానాల నిర్వహణను కొన్ని వర్గాలకు పరిమితం చేసే విధానానికి యేసుక్రీస్తు తన రాకతో చెల్లు చీటీ రాశాడు.

దేవుడైన యేసుక్రీస్తు, తానే బలిపశువుగా, దేవునికి పాపికి మధ్య తానే మధ్యవర్తిగా ఒక వినూత్న దైవిక ఆరాధన వ్యవస్థను పీడిత ప్రజానీకం కోసం ఏర్పర్చాడు. తమ తరతరాల ఆర్జనకు గండి పడటంతో యూదు అగ్రవర్ణాల వారు రోమాప్రభుత్వంతో చేతులు కలిపి ఆయన హత్యకు కుట్ర పన్నారు.  యేసుక్రీస్తు రక్షకుడుగా విప్లవం తేవడానికి చాలా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. నిత్యుడు, ఈ లోకనియమాలకు అతీతుడైన ఆయన ఈ లోకాన్నే  తన నివాసం చేసుకోవలసి వచ్చింది. ఈ లోకానికి వేంచేయడానికి ఒక నిరుపేద తల్లి గర్భాన జన్మించి ఆమె రొమ్మున పాలు తాగవలసి వచ్చింది.

తానే జీవాహారమైన ప్రభువు ఈ లోకంలో రొట్టెల కోసం ఆకలితో అలమటించవలసి వచ్చింది. జీవజలాల ఊటయైన యేసు ఈలోకంలో నీళ్ళకోసం దాహం గొన్నాడు. తానే మార్గమైన ఆ దేవదేవుడు ఈలోకవాసంలో కాలినడకన పయనించాడు. తానే సత్యమైన యేసుక్రీస్తు అసత్య ప్రచారాలకు, సాక్ష్యాలకు బలయ్యాడు. విశ్వానికంతటికీ న్యాయాధిపతి అయిన ఆ దేవుడు యేసుక్రీస్తుగా హేరోదు, పిలాతు వంటి అన్యాయస్థులైన న్యాయమూర్తుల ముందు దోషిగా నిలబడ్డాడు. జననమరణాలకు అతీతుడైన ఆయన ఈ లోకంలో ఒక రోజున పుట్టి మరొకరోజున మరణించి పునరుత్థానుడయ్యాడు. ఇదంతా ఆయన చెల్లించిన మూల్యం.
 
ఈ లోకానికి ఇంతటి ఆనందాన్ని తెచ్చిన ఆయన రాక వెనక అంతా విషాదమే!! ఆ విషాదంలోనే ఈ లోకానికి ఉషోదయమైంది. సర్వజనావళిని సంపాదించుకోవడానికి తన వైభవాన్నంతా వదులుకున్న మహా రక్షకుని జన్మదినం ఇది.  యేసుక్రీస్తు రూపంలోని దేవుని ప్రేమను మానవులంతా అనుభవించలేకపోతే, ఒక జీవనది ఊరిపక్కనుండే ప్రవహిస్తున్నా, ఊరిలోని ప్రజలు దాహంతో అలమటించటంతో సమానం.దేవుని ప్రేమకానుకగా ఈ లోకాన్ని దర్శించి, పలకరించి, స్పృశించి, పులకరింపజేసిన మహారక్షకుడు యేసుక్రీస్తును ఈ క్రిస్మస్ మరోసారి మానవాళికి పరిచయం చేసి మరో శుభోదయాన్ని తెచ్చింది. హ్యాపీ క్రిస్మస్.
 
- రెవ.టి.ఎ. ప్రభుకిరణ్
 
 ఇంగ్లండ్‌లో 1850 దాకా క్రిస్మస్ రోజున సెలవు ఇచ్చేవారు కాదు.
 
 జపాన్‌లో చాలామంది క్రైస్తవులు క్రిస్మస్‌నాడు కేఎఫ్‌సీలో తినడానికి ఇష్టపడతారు.
 
 అమెరికాలో 95 శాతం మంది క్రిస్మస్‌ను అట్టహాసంగా జరుపుకుంటారు. కాని వారిలో కేవలం 6 శాతం మంది మాత్రమే ఆ రోజున చర్చికి వెళ్తారు.
 
 పెరూదేశంలో క్రిస్మస్ నుండి డిసెంబర్ 31 లోగా ప్రజలంతా తమకున్న తగాదాలను పరిష్కరించుకుని, ఆనందంగా గడుపుతారు.
 
 అమెరికాలో ఎవరైనా ఏదైనా కావాలనుకుంటే  కవరు మీద సాంటాక్లాజ్ అని రాస్తే చాలు!
 
 ప్రపంచంలో ఇప్పటిదాకా ఏర్పాటుచేసిన క్రిస్మస్ ట్రీలలో కెల్లా అతి పెద్ద ట్రీ ఎత్తు 221 అడుగులు.
 
 క్రిస్మస్ రోజున పేదలకు కానుకలిచ్చేందుకు అక్కడక్కడా బాక్స్‌లు పెడతారు. ఆ డబ్బాలను 26 వ తేదీన లెక్కపెట్టి పేదలకు పంచుతారు. దానినే బాక్సింగ్ డే అంటారు.
 

మరిన్ని వార్తలు