హారియట్‌ టబ్‌మన్‌ బానిసల ప్రవక్త

18 Jun, 2020 03:06 IST|Sakshi
హారియట్‌ టబ్‌మన్‌ , ‘హారియట్‌’ చిత్రంలో  హారియట్‌గా సింథియా ఇరివో 

వారు నివసించిన ఖండాన్ని చీకటి ఖండం అన్నారు. వారి జీవితాలను సదా చీకటితో నింపారు. నల్ల పుట్టుక పుడితే బానిస అని అన్నారు. సంకెలలతో బంధించి హింసించారు. తెల్లవారి సేవకు ఆఫ్రికా నుంచి తరలింపబడ్డ నల్లవారు అమెరికాలో తమ స్వేచ్ఛ కోసం, గౌరవం కోసం యుగాలుగా పెనుగులాడుతూనే ఉన్నారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఘటన నేపథ్యంలో ఆ స్వేచ్ఛాపోరాటాలను గుర్తు చేసుకుంటున్నారు. ‘హారియట్‌ టబ్‌మన్‌’ ఇప్పుడు పదేపదే ప్రస్తావనకు వస్తున్నారు. బానిసగా పుట్టి బానిసల విముక్తి కోసం జీవితాన్ని ధారపోసిన ధీర ఆమె. 2019లో ఆమెపై వచ్చిన  బయోపిక్‌ ‘హారియట్‌’ పరిచయం ఇది.

‘ఇక్కడి నుంచి తర్వాతి సురక్షితమైన చోటు 25 మైళ్ల దూరంలో ఉంది. అంత దూరం ఒక్కదానివే ఎలా నడుస్తావు?’ అని అడుగుతాడు మిత్రుడు.
‘ఏం పర్లేదు. నేను దేవుడితో పాటు 
నడుస్తాను’ అంటుంది హారియట్‌.
‘బానిసల మొర దేవుడు వినడు’ అని ఆమె సోదరుడు ఒక సందర్భంలో హారియట్‌తో అంటాడు ఈ సినిమాలో. కాని హారియట్‌ ఎప్పుడూ దేవుడు తమ మిత్రుడని అనుకుంది. దేవుడు తన దగ్గరగా నిలబడి తనను నడిపిస్తున్నాడు అనుకుంది. దేవుడు తనకు చూపిన మార్గమే బానిసల విముక్తి అని అనుకుంది. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు దశాబ్దాల పాటు ఆమె బానిసల విముక్తి కోసమే పోరాడింది. వారి కోసం కత్తి పట్టుకుంది. తుపాకీని పేల్చింది. యుద్ధమే చేసింది. అమెరికా సమాజం నేటికీ సగౌరవంగా తలిచే ఆ నల్లవనిత హారియట్‌ టబ్‌మన్‌ (1822–
1913) జీవితం మీద ఎన్నో పుస్తకాలు సినిమాలు వచ్చాయి. 2019 వచ్చిన ‘హారియట్‌’ ఆస్కార్‌ నామినేషన్ల వరకూ వెళ్లింది.

బానిసల రాష్ట్రంలో
అమెరికాలో 19వ శతాబ్దపు తొలి దశకాలు ఘోరమైన బానిస వ్యవస్థకు సాక్ష్యంగా నిలిచాయి. పారిశ్రామికీకరణ ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు బానిస వ్యవస్థను అసహ్యించుకుంటే శారీరక శ్రమ అవసరమైన వ్యవసాయ ఆధారిత దక్షిణాది రాష్ట్రాలు బానిసల వ్యవస్థను స్థిరపరుచుకోవడానికి ఎంతకైనా తెగించే వరకూ వెళ్లాయి. ఈ ‘స్లేవ్‌ స్టేట్స్‌’, ‘ఫ్రీ స్టేట్స్‌’కు మధ్య నలిగి ఇక్కడి నుంచి అక్కడికి పారిపోవడానికి ప్రయత్నించిన ఆఫ్రికన్‌ అమెరికన్ల కథలు వేనవేలు. అలాంటి వారిలో ఒకరు మన కథానాయిక హారియట్‌ టబ్‌మన్‌. బానిసల రాష్ట్రాలలో ఒకటైన మేరీల్యాండ్‌లో ఆమె కథ మొదలవుతుంది. ఆమె తల్లిదండ్రులు బానిసలు.

అయితే తల్లి ఒక యజమాని దగ్గర తండ్రి ఒక యజమాని దగ్గర విడిగా ఉంటూ పని చేసే దురవస్థ ఆ రోజుల్లో ఒక విషాదకర వాస్తవం. హారియట్‌కు ఆరేళ్లు వచ్చి ఊహ తెలిసే సమయానికి ఆమెకు స్ఫురణకు వచ్చిన ఒకే ఒక్క విషయం– తన వైపు దిగులుగా చూస్తూ వేరే యజమానికి అమ్ముడుపోయి వెళ్లిపోయిన అక్క ముఖం. ఆ రోజుల్లో బానిసల యజమానులు తమ దగ్గర ఉన్న బానిసలను వేరే యజమానుల దగ్గరకు డబ్బు కోసం కిరాయికి పంపేవారు. టబ్‌మన్‌ అలా ఎనిమిదేళ్ల వయసులో కిరాయికి వెళ్లి ఒక్కర్తే అనుభవించిన వేదన ఆమెకు ఆ వయసులోనే బానిస వ్యవస్థ పట్ల ఏహ్యతను కలిగించింది.

అమ్మకానికి సిద్ధం
హారియట్‌ ఇప్పుడు వయసుకు వచ్చింది. పెళ్లి కూడా చేసుకుంది. ఆమె భర్త స్వతంత్రం పొందిన నల్లవాడు. ఈమె ఇంకా బానిసే. ఈమెకు రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలు కూడా బానిసలే  అవుతారు. స్వేచ్ఛ పొందే వీలు లేదు. ఇదంతా ఆలోచించే కొద్దీ ఆమెకు గుక్క తిప్పుకోకుండా ఉంటుంది. యజమాని కొడుకు ఇది గమనిస్తాడు. ఈమె ఉంటే ప్రమాదం అని తలచి అమ్మకానికి ప్రకటన విడుదల చేస్తాడు. అమ్మకం అంటే ఇక భర్తను వదిలి తల్లిదండ్రులను తోబుట్టువులను వదిలి ఎక్కడకు వెళ్లాలో. ఎవరు కొనుక్కుంటే వారి దగ్గరకు. ‘నేను బతికితే స్వేచ్ఛగా బతుకుతాను. లేదా చస్తాను. నేను ప్రాణాలతో ఉండగా నన్నెవరూ బానిసగా ఉంచలేరు’ అని ప్రకటిస్తుంది హారియట్‌. కెనడాను అప్పట్లో ‘ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ అనేవారు. అంటే బానిసల స్వేచ్ఛా ప్రాంతం. అక్కడి వరకూ పారిపోవాలి. లేదా ఉత్తరాన ఉన్న ఫిలడల్ఫియాకు పారిపోగలిగినా చాలు. అది ఫ్రీ స్టేట్‌. హారియట్‌ ఫిలడల్ఫియాకు పారిపోతుంది. ఒక్కత్తే. అర్ధరాత్రి. ‘ఆకాశంలో నార్త్‌స్టార్‌ని చూడు. దానిని చూస్తూ దానివైపు పరిగెత్తు’ అని చెబుతాడు చర్చి ఫాదర్‌. చీకటి బతుకులో మినుకు మినుకుమనే నక్షత్రమే పెద్ద ఆశ.

అండర్‌గ్రౌండ్‌ రైల్‌రోడ్‌ 
స్లేవ్‌ స్టేట్స్‌ నుంచి ఫ్రీ స్టేట్స్‌కు పారిపోవడానికి ఒక రహస్య వ్యవస్థ ఉండేది. దీనిని ‘అండర్‌గ్రౌండ్‌ రైల్‌రోడ్‌’ అనేవారు. అంటే గమ్యం చేరడానికి అవసరమైన అడ్డదార్లు, దారి మధ్యలో రహస్య షెల్టర్లు, ఆశ్రయం ఇచ్చే వ్యక్తులు వీరితో నిండిన వ్యవస్థ అన్నమాట. ఇందులో నల్లవాళ్లు ఉండేవారు, బానిసల పట్ల సానుభూతి ఉన్న తెల్లవారూ ఉండేవారు. ఆ వ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకున్న ఏకైక బానిస నిర్మూలనకర్త హారియట్‌. ఫిలడల్ఫియాకు చేరుకున్న తర్వాత ఆమె తన జీవితం, స్వార్థం చూసుకోలేదు. దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న బానిసల

విముక్తి కోసం అలసట 
లేనట్టుగా పని చేసింది. తన జీవితకాలంలో 13 సార్లు ఉత్తరాది నుంచి దక్షిణాదికి రహస్య ప్రయాణం చేసి 70 మంది బానిసలను అర్ధరాత్రి ప్రయాణాలతో విముక్తి కలిగించింది. ‘నేను ఒక్కసారి కూడా దారి తప్పలేదు. ఒక్క బానిస ప్రాణం కూడా పోనివ్వలేదు’ అని గర్వంగా చెప్పుకుందామె. జనం క్రమంగా ఆమెను ‘మోసెస్‌’ అని పిలవడం మొదలెట్టారు. నాడు ప్రజలను విముక్తం చేయడానికి వచ్చిన ప్రవక్త మోసెస్‌. నేడు నల్లవారిని విముక్తికి వచ్చిన ప్రవక్త హారియట్‌.

సివిల్‌ వార్‌
బానిసల వ్యవస్థ ఉండాలని దక్షిణాది రాష్ట్రాలు, నిర్మూలించాలని ఉత్తరాది రాష్ట్రాలు సివిల్‌ వార్‌ (1861–65)కు దిగినప్పుడు అదే  అదనుగా హారియట్‌ ఒక గెరిల్లా సైన్యమే తయారు చేసింది. 150 మంది నల్లవారితో ఆమె దళం ఉండేది. హారియట్‌ స్వయంగా తుపాకీ పట్టి ఈ సేనను నడిపించేది. ఆమె తన దళంతో దక్షణది రాష్ట్రాలపై చేసిన ఒక పెద్ద దాడిలో 750 మంది బానిసలు ఒకే సమయంలో స్వేచ్ఛను పొందారు. ఇది ఒక వీరోచిత గాథ. ఇంతా చేస్తున్నది ఒక ఆజానుబాహురాలు కాదు. కేవలం ఐదు అడుగుల ఎత్తు ఉండే పిట్టంత మనిషి. కాని ఆమె గుండె ధైర్యం ఒక ప్రామిస్డ్‌ ల్యాండ్‌ అంత.

చివరి రోజులు
హారియట్‌ తన చివరి రోజులు న్యూయార్క్‌లో గడిపింది. తన 91వ ఏట అయినవారందరి సమక్షంలో ప్రశాంతంగా వీడ్కోలు తీసుకుంది. అమెరికా ఆమె గౌరవార్థం స్మారక స్థూపాలు, చిహ్నాలు ఏర్పాటు చేసింది. ఆమె నివసించిన స్థలాలు, ఆమె పారిపోయిన అడవి దారి దర్శనీయ స్థలాలుగా మారాయి. ఆమె ముఖచిత్రంతో 20 డాలర్ల నోటు విడుదల అయ్యింది. డాక్యుమెంటరీలు, సినిమాలు అనేకం వచ్చాయి. కాని ఆమె గురించి నిజంగా బయట వారికి తెలియడం తక్కువ. ఈ బానిసల ముక్తిదాయిని గురించి తీసిన సినిమా ‘హారియట్‌’లో ఆమె పాత్రను గొప్ప నటి సింథియా ఇరివో పోషించింది. నటి కశి లెమొన్స్‌ దర్శకత్వం వహించింది. నల్లవారి గురించి చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఈ సినిమా వీక్షణం ఒక చరిత్ర 
దర్శనమే.
– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు