నన్నిలా వదిలేయొచ్చుగా!

27 May, 2014 22:47 IST|Sakshi
నన్నిలా వదిలేయొచ్చుగా!

వేదిక
 
రెండేళ్లక్రితం నాకు పెళ్లయింది. ఈ మధ్యనే నా భర్త నుంచి విడాకులు తీసుకున్నాను. అమ్మానాన్నల దగ్గరే ఉంటున్నాను. అసలేమైందంటే మా అమ్మానాన్నలకు నేను ఒక్కగానొక్క కూతుర్ని...ఏ లోటు లేకుండా పెంచారు అమ్మానాన్నా. చదువు పూర్తయిపోగానే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఐదంకెల జీతం.

ఓ ఏడాది తర్వాత అమ్మానాన్న మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. పెళ్లికి ముందు నా భర్త గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. మంచి చదువు, ఉద్యోగం, అందగాడు, ఆస్తిపరుడు....ఇలా ఆకాశానికి ఎత్తేయడంతో అమ్మానాన్న అడిగినంత కట్నం ఇచ్చి...గ్రాండ్‌గా పెళ్లి చేసి నన్ను అతనికి కట్టబెట్టారు. పెళ్లి సమయంలో నేను ఒక నెలరోజులు సెలవు పెట్టాను. దాంతో పెళ్లి తర్వాత చాలారోజులు ఇంట్లోనే ఉండేదాన్ని. ఆ సమయంలో నా భర్త నన్ను చాలా బాగా చూసుకున్నాడు.
 
ఎప్పుడైతే నేను ఆఫీసుకి వెళ్లడం మొదలుపెట్టానో ఆయన అసలు రూపం భయపడడం మొదలైంది. ఒళ్లంతా అనుమానమే ఆయనకి. ఉదయం ఓ పది నిమిషాలు ముందు బయలుదేరినా, సాయంత్రం ఓ పావుగంట ఆలస్యమైనా సవాలక్ష ప్రశ్నలతో వేధించడం మొదలుపెట్టారు. ఆయన ప్రవర్తన గురించి మా అత్తగారికి చెబితే... ‘నువ్వు...వాడి మాటలేం పట్టించుకోకు’ అనేవారు. కానీ ఆయన అనే మాటలు, ఆయనకొచ్చే అనుమానాలు చాలా భయంకరంగా ఉండేవి. ఊహించడానికి వల్లకాని నిందలు వేసేవారు. నా స్నేహితురాలితో చెబితే...‘ఇలాంటి సమస్యలు చాలామంది ఆడవాళ్లకు తప్పడం లేదు. నీ భర్త కళ్లు తెరిపించే ప్రయత్నం చేస్తే ముందు నీ పరువే పోతుంది. నిప్పులేకుండా పొగరాదు కదా!, ఈ రోజు అమ్మాయిల్ని నమ్మడానికి లేదు...లాంటి డైలాగులన్నీ నీ చెవిన పడతాయి.
 
వాటిని విని తట్టుకోగల శక్తి ఉంటే నీ భర్త గురించి పెద్దవాళ్లకు చెప్పి బుద్ధి చెప్పించు’ అంది. నాకంత ఓపిక లేక...ఓ ఏడాదిపాటు నోరునొక్కుకుని భరించాను. ఆయన దుర్మార్గం రోజురోజుకీ ఎక్కువైపోవడంతో భరించే శక్తి లేక ఒకరోజు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఆయనపై గృహహింస కేసు పెట్టాను. అమ్మానాన్న...బంధువులు, స్నేహితులు అందరూ షాక్. ‘నువ్వేనా ఇంత పనిచేసింది!’ అంటూ ఆశ్చర్యపోయారు. అమ్మానాన్నా నా బాధను అర్థం చేసుకున్నారు. అలాంటి అనుమానపు రాక్షసుణ్ణి జీవితాంతం భరించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మధ్యనే విడాకులు వచ్చేశాయి. నేను అదే ఉద్యోగంలో కొనసాగుతున్నాను.
 
నేను నా భర్త నుండి విడిపోయానని తెలియగానే నా చుట్టుపక్కలవారు నన్ను కొంచెం దూరం పెట్టడం మొదలుపెట్టారు. వారి చూపుల్లో అర్థం మారింది. వారి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పనని తెలిశాక నాతో మాటలు కూడా తగ్గాయి. బంధువులు మాత్రం అమ్మానాన్నలను ‘అమ్మాయిని అలా వదిలేయకండి! ఏదో ఒక దారి చూడండి’ అంటూ తరమడం మొదలెట్టారు. నాకు మాత్రం మళ్ళీ పెళ్లంటే భయం వేస్తోంది. నన్నిలా ప్రశాంతంగా వదిలేయొచ్చుగా!     - విష్ణుప్రియ, పఠాన్‌చెరువు, హైదరాబాద్

మరిన్ని వార్తలు