తొందరపాటు... అనర్థదాయకం!

22 Jun, 2017 00:53 IST|Sakshi
తొందరపాటు... అనర్థదాయకం!

ఆత్మీయం

తొందరపాటు, తొందరపడి ఇతరుల మీద ఒక అభిప్రాయానికి రావడం అందరికీ ఉండే అలవాటే. రామాయణ కాలం నుంచి ఉన్నదే. లక్ష్మణుడు కైక మీద కోపంతో ఆమెను నిందిస్తుంటే ‘వివేకం కలవారెవరయినా తమకు ఎవరిమీద అభిమానం ఉంటుందో వారిని ప్రశంసించాలే కాని ఇతరులను నిందించడం ధర్మం కాదు’ అని శ్రీరాముడు లక్ష్మణునికి హితవు చెబుతాడు. అలాగే మేనమామల ఇంటి నుంచి వచ్చిన భరతుడు... రాముడు అరణ్యానికి వెళ్లాడని తెలుసుకుని, పరుగుపరుగున అన్నగారికోసం అడవికి పరివారంతో బయలుదేరాడు. అల్లంత దూరాన్నుంచే వారిని చూసిన లక్ష్మణుడు తమను అడవుల నుంచి కూడా వెళ్లగొట్టడానికే భరతుడు వస్తున్నాడని భ్రమతో విల్లెక్కుపెట్టబోయాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడిని శాంతింపచేసి, భరతుడు వచ్చిన తరవాత వివరాలు అడిగి తెలుసుకున్నాడు. భరతుడు... రాముడిని అయోధ్యకు తీసుకువెళ్లడానికి వచ్చాడనే విషయం తెలుసుకున్న లక్ష్మణుడు తల దించుకున్నాడు. రామరావణ సంగ్రామ సమయంలో విభీషణుడు రాముని శరణుకోరి వచ్చినప్పుడు లక్ష్మణుడు విభీషణుడిని నమ్మవద్దని, ఇక్కడికి కేవలం గూఢచారిగానే వచ్చాడని అంటాడు. కాని విభీషణుడి పలుకులతో లక్ష్మణుడు తప్పు తెలుసుకుంటాడు. తొందరపాటు వద్దనీ, ఇతరులను అనవసరంగా నిందించవద్దనీ హితవు పలుతాడు రాముడు. వీటన్నిటిని బట్టి చూస్తే తొందరపాటు ఎంత అనర్థదాయకమో అర్థం అవుతుంది.

మరిన్ని వార్తలు