ఫీట్లు చెయ్యగలడు... ఈ గుంటడు గోడలెక్కగలడు!

28 Sep, 2015 18:25 IST|Sakshi

నెట్ ఇంట్లో

రెండేళ్ల అరట్ హుసైనీ గత జన్మలో గబ్బిలమై ఉంటాడు. అందుకే తలకిందులుగా వేళ్లాడగలుగుతాడు. కనీసం కోతి అయినా అయి ఉంటాడు. ఎందుకంటే ఆ బుడతడు కోతి కొమ్మచ్చి ఆడితే కోతులు సిగ్గుపడిపోతాయి. ఇవన్నీ కాకపోయినా ఖచ్చితంగా అమీబా అయి ఉంటాడు. ఎటు పడితే అటు శరీరాన్ని మెలిపెట్టేయగలడు. ఏ రూపమంటే ఆ రూపం దాల్చేయగలడు. హుసైనీ టీవీపై చేసే జిమ్నాస్టిక్‌లు చేయగలడు. గోడలపై ఎగబాకేయడాలు చేయగలడు. చిటారు కొమ్మల నుంచి వేలాడగలడు. చిన్న డబ్బాలో శీర్షాసనం వేయగలడు. చూస్తే ఔరా అనిపిస్తుంది. కాస్త ఖాళీగా ఉంటే చాలు పిల్లిమొగ్గలు వేస్తాడు. ఎత్తుల నుంచి దూకేస్తాడు. ఇరాన్‌కి చెందిన అరట్ హుసైనీ ఇన్‌స్టాగామ్ అకౌంట్‌కి గ్రాములు కాదు, కిలోలు కాదు, టన్నుల కొద్దీ అభిమానులున్నారు. ఏకంగా ఇరవై వేల మంది ఫాలోయర్ల్లు ఉన్నారు. ఈ గుంటడి ఘనకార్యాలను ఇన్‌స్టాగ్రామ్ విడియోల్లో చూడొచ్చు.  http://www.buzzfeed.com/andreborges/pantles.va7x8pWn1
 
 తప్పిపోయిన కొడుకు తల్లిని వెతుక్కుంటూ రావాలంటే ఇప్పుడు యాదోంకీ బారాత్ లాంటి పాటలు పాడాల్సిన అవసరం లేదు. అమర్, అక్బర్, ఆంథోనీలను కలిపే మన్మోహన్ దేశాయ్ లాంటి డెరైక్టర్ అంతకన్నా అవసరం లేదు. గూగుల్ ఎర్త్‌ను నమ్ముకుంటే చాలు, న్యూయార్క్ సబ్ వే మెట్లమీద ఎలుకైనా, ఇరాన్‌లో రెండేళ్ల హుసైనీ అయినా ఇన్‌స్టంట్ హీరోలు అయిపోవాలంటే నెట్ ఒక్కటి ఉంటే చాలు. నెట్ యుగంలో కొత్త దంపతులకు అరుంధతి, వశిష్టులను నక్షత్రాలుగా చూపించనక్కర్లేదు... పండుటాకులు లారా, హోవార్డ్‌ల యూట్యూబ్ విడియో చూపిస్తే చాలు. తినలేక వదిలేసిన ఆహారాన్ని ఆకలిగొన్నవారి నోళ్లలోకి పెట్టే ఆడమ్ స్మిత్ చేయూత... కర్తవ్యనిష్ఠకోసం జీవితంలోని అత్యంత ఆనందమయ క్షణాలను కూడా కాదనుకున్న గువో యువాన్ అనే నర్సు మంచి మనసు... ఎంచుకునే ఛాయిస్ మీది! కానీ వాళ్ల కథ చెప్పే వాయిస్ మాత్రం సోషల్ మీడియాదే!
 
కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు!

అన్నయ్య రైళ్లలో చెత్త ఊడుస్తున్నాడు. తమ్ముడికి ప్లాట్‌ఫారంపైనే నిద్ర పట్టేసింది. కళ్లు తెరిచి చూసేసరికి అన్నయ్య లేడు. ముందు ఒక రైలు ఆగి ఉంది. అన్నయ్య అందులో ఉన్నాడేమోనని అందులోకి మనవాడు ఎక్కేశాడు. అంతలో రైలు కదిలింది. ఆ రైలు కోల్‌కతాకి చేరింది. అక్కడి వేలాది వీధి బాలుళ్లలో మనవాడూ ఒకడయ్యాడు. కొన్నాళ్లకి అనాథాశ్రమం చేరుకున్నాడు. ఆ అనాథాశ్రమం అతడిని ఆస్ట్రేలియన్ దంపతులకు దత్తత ఇచ్చేసింది. కటికపేదరికం నుంచి కనక వర్షంలోకి వెళ్లాడు మనవాడు. కానీ మనను మ్యాప్ మీద ముద్రితమైన తన ఊరి రైల్వే ప్లాట్ ఫారం, పక్కనే జలపాతం, కొద్ది దూరంలో ఉన్న డ్యామ్ చిత్రాలు మాత్రం చెక్కు చెదరలేదు. సరూ అనే వీధిబాలుడి నుంచి సరూ బ్రెయర్లీగా మారిన మనవాడు గూగుల్ తల్లినే నమ్ముకుని కోల్‌కతా నుంచి 1200 కిమీ దూరంలో రైల్వే స్టేషన్, డ్యామ్, జలపాతం ఉన్న ఊరిని వెతికాడు. అలాంటి ఊరు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా అని తేలింది. అలా వెతుక్కుంటూ ఖాండ్వాకి వచ్చాడు. అక్కడకు చేరుకునేసరికి మనసు లోయల ముడుతల్లో దాగున్న జ్ఞాపకాలపై పొగమంచు పొరలు కరిగిపోయాయి. నేరుగా తన ఇంటికే వెళ్లి తలుపు తట్టాడు. తన వద్దనున్న చిన్నప్పటి ఫోటో చూపిస్తే తప్ప ఇంట్లో వాళ్లు 31 ఏళ్ల తర్వాత కాలం కలిసొచ్చిందని, తమ కొడుకే నడిచొచ్చాడని నమ్మలేకపోయారు. 1981 నుంచి 2012 దాకా ఖాండ్వా నుంచి కోల్‌కతా మీదుగా టాస్మేనియా వెళ్లి తిరిగొచ్చిన సరూ బ్రెర్లే నెట్ కనెక్టివిటీ ఉదంతం జస్ట్ కథకాదు, ఇది ఖరాఖండి నిజం. ఇప్పుడు సరూ కథ ’స్లమ్ డాగ్ మిలియనీర్’ దేవ్ పటేల్ హీరోగా ఒక సినిమాగా తయారవుతోంది.
 http://www.telegraph.co.uk/culture/film/11362518/Remarkable&story&of&lost&boy&who&found&mother&using&Google&Earth&after&25&years&to&become&film.html
 
 
పిడికెడు బియ్యం - గుప్పెడు సాయం

 ఏడాదికి 1.3 బిలియన్ టన్నుల ఆహారం తినడానికి యోగ్యంగా ఉన్నా చెత్తకుప్పల్లోకి చేరుతోంది. ఇది మొత్తం ప్రపంచంలో తయారైన ఆహారంలో మూడో వంతు. తినడానికి యోగ్యంగా ఉన్నా చెత్తకుప్పల్లో పారేసే ఆహారాన్ని ఆకలిగొన్న వారికి అందిస్తే...? ఆడమ్ స్మిత్ అనే షెఫ్ గారికి ఇదే ఆలోచన వచ్చింది. 2013లో ఆయన ఇంగ్లండ్‌లో ఇలాంటి ఆహారాన్ని సేకరించి పేదలకు అతి తక్కువ ధరలకు ఇవ్వడం మొదపెట్టాడు. ఈ పనికి రియల్ జంక్ ఫుడ్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టాడు. మీకు తోచినంత ఇవ్వండి అని హోటళ్లకు పే యాజ్ యూ ఫీల్ అని నామకరణం చేశాడు. వ్యంగ్యాలు, వెటకారాలు, ఎత్తిపొడుపులు, విపరీతార్థాల్లాంటి విఘ్నాలన్నిటినీ దాటి, మూడేళ్లలో ఇప్పుడు ఈ ఉద్యమం 120 దేశాలకు పాకింది. వందలాది కార్యకర్తలు ఆడమ్ స్మిత్ భుజం తట్టి, నడుం కట్టి ముందుకొచ్చారు. ఇప్పుడు ఏడాదికి దాదాపు 200 టన్నుల ఆహారాన్ని పేదలకు చేరుస్తున్నాడు స్మిత్. అన్నానికి, ఆకలి కడుపుకి మధ్య వారధిగా నిలవడం భగవంతునికీ భక్తునికీ అనుసంధానం చేసినంత పుణ్యకార్యం. అలాంటి ఆడమ్ స్మిత్‌ను అభినందిద్దామా మరి! అంతకు ముందు మీరు చేయాల్సింది ఫేస్‌బుక్‌లో ది రియల్ జంక్ ఫుడ్ ప్రాజెక్ట్ పేజీ (http://www.therealjunkfoodproject.org/)ని లైక్ చేయడం.
 
మోస్ట్ బ్యూటిఫుల్ నర్స్

ఆమె చైనాలోని మోస్ట్ బ్యూటిఫుల్ నర్స్! కొద్దిరోజుల క్రితం ఆమె చైనాలోని ఒక బీచ్‌లో కాబోయే భర్తతో వెడ్డింగ్ ఫోటో దిగుతోంది. ఖరీదైన వెడ్డింగ్ గౌన్, కాస్ట్‌లీ మేకప్‌తో ఆమె పోజు ఇస్తోంది. అంతలో సముద్రంలో ఒక వ్యక్తి మునిగిపోతూ కేకలు వేస్తున్నాడు. అతనికి నీళ్లలోనే గుండె పోటు వచ్చింది. అంతే! ఆమె పరుగులు తీసింది. అతడిని కాపాడేందుకు శతథా ప్రయత్నించింది. ఆఖరికి అతనికి తన నోటి ద్వారా కృతిమ శ్వాస కల్పించేందుకు కూడా ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో ఆమె ఖరీదైన గౌను పాడైపోయింది. విలువైన మేకప్ చెదిరిపోయింది. గోళ్లు విరిగిపోయాయి. అయినా ఆమె లెక్క చేయలేదు. తన జీవితంలోని అత్యంత ఆనందమయమైన క్షణాలను కూడా వదులుకుని కర్తవ్యనిష్ఠతో పనిచేసిన గువో యువాన్ యువాన్ అనే ఆ నర్సు మనసు ఎంతో అందమైనదని చైనా మీడియా ప్రశంసిస్తోంది. ఆమె సేవా తత్పరతే అసలైన అందమని ఆమె భర్త కూడా అంటున్నాడు. ప్రజలు ఆమెని చైనాలోని మోస్ట్ బ్యూటిఫుల్ నర్స్ అంటున్నారు. మన నర్సమ్మలు కూడా ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ నుంచి కాసింత నేర్చుకుంటే బాగుంటుందేమో కదూ!
 http://www.dailymail.co.uk/news/ peoplesdaily/article&3244492/ Nurse&hailed&prettiest&bride& China&trying&save&drowned& man&wearing&wedding&dress.html
 
 
నీ నగుమోము నా కనులార కడదాకా.....

‘‘వయసున్న నాడే అనురాగము... వయసైన కొలదీ అనుబంధము’’ అని భానుమతి ఎప్పుడో చెప్పింది. ఆ మాట 93 ఏళ్ల లారా, 92 ఏళ్ల హోవార్డ్‌లను చూస్తే అక్షరాలా నిజం అనిపిస్తుంది. యౌవనంలో పెనవేసుకున్న అనురాగం, వార్థక్యంలో విడదీయరాని అనుబంధంగా మారింది. లారా మృత్యుశయ్య మీదుంది. తుది పిలుపుకోసం ఎదురుచూస్తోంది. హోవార్డ్ ఆమె భావోద్వేగంతో తడుముతూ, యౌవనంలో కలిసి పాడుకున్న పాటను ఆమె కోపం కన్నీళ్లు ఆపుకుంటూ పాడుతుంటే మరణశయ్య మీదున్న లారా పదే పదే ‘ఐ లవ్ యూ’ అంటుంది. రెండో ప్రపంచయుద్ధంలో పోరాడేందుకు హోవార్డ్ వెళ్లినప్పుడు లారా పదేపదే ఇదే పాట పాడుకునేది. ఆ తరువాత కూడా వారిద్దరూ ఈ పాట ఎన్నోసార్లు కలిసి పాడారు. ఆఖరి క్షణాల్లో అదే పాటను హోవార్డ్ ఆమె కోసం పాడుతుంటే ఎవరికైనా కంటి కొసల్లో కాసింతైనా తడి రాకుండా ఉండదు. ఒకటా రెండా ... 73 ఏళ్లుగా వారిద్దరిదీ సాహచర్యం, సహయాత్ర! చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్లే నేటి తరం ఈ పండుటాకుల భావోద్వేగం, సహజీవన మాధుర్యాన్ని చూసి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ‘‘మన జంట జంటలకే కన్నుకుట్టిపోవాలి. ఇంక ఒంటరిగా ఉన్నవాళ్లు జంటలైపోవాలి’’ అనిపించే ఈ జంట విడియో ఈ వారానికే కాదు, ఏ వారానికైనా బెస్ట్ విడియోనే!
https://www.youtube.com/watch?v=wWPOGhxkTE

కూర్పు: కె. రాకా సుధాకరరావు www.sakshipost.com

మరిన్ని వార్తలు