మచ్చపడనివ్వని మంచి మనిషి

1 Jun, 2014 22:25 IST|Sakshi

వాళ్లంతా విధి వంచితులు. చేయని తప్పుకు బలైనవారు. ఛిద్రమైన కలలను, యాసిడ్ దాడిలో కాలి కరిగిపోయిన ముఖాలను చూసుకుని కలత చెందుతున్నవాళ్లు. ఓరోజు వాళ్లను వెతుక్కుంటూ ఓ వెలుగు వచ్చింది. చీకటైపోయాయి అనుకున్న వారి జీవితాలను ఒక్కసారిగా కాంతిమంతం చేసింది. ఆ వెలుగు పేరు... రియాశర్మ!
 
అక్టోబర్ 2, 2013. కర్ణాటకలోని హవేరీ జిల్లా. రేఖ అనే ఓ మహిళ ఆర్తనాదాలతో ప్రభుత్వాసుపత్రి మార్మోగుతోంది. భర్త చేసిన యాసిడ్ దాడిలో ఆమె తనువంతా మాంసపు ముద్ద అయ్యింది. ముఖం, మెడ, చేతులు, తొడలు... అన్ని భాగాలూ కాలిపోయాయి. చికిత్స చేయడానికి కూడా వీలు లేనట్టుగా ఉందామె శరీరం.
 
అంతలో పరుగు పరుగున వచ్చింది ఓ ఇరవయ్యేళ్ల అమ్మాయి. రేఖ పరిస్థితి గురించి వాకబు చేసింది. ప్రథమ చికిత్స చేశాం కానీ పూర్తి చికిత్స చేయడానికి తగిన సదుపాయాలు తమ దగ్గర లేవని వైద్యులు చెప్పడంతో వెంటనే అప్రమత్తం అయ్యింది. కొందరు అధికారులతో మాట్లాడి ప్రభుత్వ సహాయాన్ని ఏర్పాటు చేసింది. తనకు తెలిసినవారికి ఫోన్ చేసి విరాళాలు కోరింది. వారి సాయంతో రేఖను మంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. రేఖ ప్రాణాలు కాపాడింది.

రేఖ మాత్రమే కాదు... మరెందరో యాసిడ్ దాడి బాధితుల పాలిట ఆమె అదృష్ట దేవత. పేరు... రియాశర్మ. ఆమె సాయంతో ఎందరో బాధితుల శరీరంతో పాటు మనసుకు అయిన గాయాలు కూడా మానాయి. వారి జీవితాలు కొత్త బాట పట్టాయి.
 
అనుకోకుండా వచ్చి అందరికీ బంధువై...

కొంతమంది అందంగా ఉంటారు. వారి రూపం వల్ల కాదు. వారు కనిపించే విధానం వల్ల కూడా కాదు. వారి వ్యక్తిత్వం వల్ల. ఓ మహానుభావుడు చెప్పిన మాటలివి. వీటికి అర్థం రియాశర్మకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు.
 
పుట్టి పెరిగిన భారతదేశాన్ని వదిలి, పై చదువుల కోసం బ్రిటన్‌కు వెళ్లింది రియా. లీడ్‌‌స కాలేజ్ ఆఫ్ ఆర్‌‌ట అండ్ డిజైన్‌లో చేరింది. మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు అనుకోకుండా ‘సేవ్ ఫేస్’ అనే డాక్యుమెంటరీని చూసింది. పాకిస్థాన్‌లో జరిగిన యాసిడ్ దాడుల్లో గాయపడిన అమ్మాయిల గురించి తీసిన డాక్యుమెంటరీ అది. ఎందుకో చాలా రోజులపాటు దాన్ని మర్చిపోలేకపోయింది రియా. ఎప్పుడూ దాని గురించే ఆలోచించేది. అలాంటివాళ్ల కోసం ఎవరైనా ఏదైనా చేస్తే బాగుండేది అనుకునేది. కానీ అది తానే చేస్తానని ఎప్పుడూ అనుకోలేదామె.
 
ఫైనలియర్ గ్రాడ్యుయేషన్‌లో భాగంగా ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది రియాకి. దానిని భారతదేశంలోనే చేయాలని అనుకుంది. కాలేజీ నుంచి అనుమతి పొంది తిరిగొచ్చింది. ఓ రోజు బెంగళూరులో సంచరిస్తుండగా ఇద్దరు అమ్మాయిలు తారసపడ్డారు రియాకి. వాళ్లని చూడగానే ఆమె మనసు చలించింది. ఆ ఇద్దరి ముఖాలూ కాలిపోయాయి. చర్మం ముడతలు పడిపోయింది.

ముక్కు, కళ్లు, నోరు... ఏ భాగమూ స్పష్టంగా కనిపించడం లేదు. కానీ ఇద్దరి ముఖాల్లోనూ చిరునవ్వు తెలుస్తూనే ఉంది రియాకి. తాను చూసిన డాక్యుమెంటరీ గుర్తొచ్చిందామెకి. వెంటనే వాళ్ల దగ్గరకు వెళ్లి పలకరించింది. వాళ్ల కథలు విని కదిలిపోయింది. ప్రేమించలేదన్న కారణంతో మృగాళ్లు చేసిన ఘాతుకమే వారినలా మార్చిందని తెలుసుకుంది. అయినా కూడా వారు నిరుత్సాహపడకపోవడం, ఆ పని చేసిన వారిని నిందించకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. పైగా వారిలో ఒకమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తన పని తాను చేసుకుంటోంది.
 
ఈ విషయాలన్నీ రియాను వదలకుండా వెంటాడాయి. ఆలోచింపజేశాయి. ప్రతి మనిషీ అందంగా ఉండాలని కోరుకుంటాడు. ఆడపిల్లకయితే అందం ముఖ్యమంటారు. తను కూడా అలాగే అనుకునేది. కానీ ముఖం కాలిపోయి, వికృతంగా తయారైనా... అందరూ తమను చూసి ముఖం తిప్పుకుంటున్నా కూడా బాధపడకుండా, అవమానంగా భావించకుండా అందరి లోనూ ధైర్యంగా తిరుగుతున్నారు వాళ్లు. అంటే అందం శరీరంలో కాదు, వ్యక్తిత్వంలో ఉంది. పైగా జరిగిన దారుణం వారి తనువులను కాల్చేసినా మనోబలాన్ని మాత్రం సడలనివ్వ లేదు. ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందడుగు వేస్తున్నారు. కానీ అందరూ ఈ ఇద్దరిలానే ఉన్నారా? అలా ఉండటం అందరికీ సాధ్యపడుతుందా?
 
ఈ ఆలోచన రియా గమనాన్ని పూర్తిగా మార్చేసింది. యాసిడ్ దాడి బాధితుల గురించి ఆరా తీయడం మొదలు పెట్టింది. వారి గాథలు విని ఆమె కళ్లు చెమర్చాయి. వికృతంగా ఉన్న తమ రూపాల కారణంగా ఎలా అవమానాలు పడుతున్నామో వారు చెబితే ఆమె మనసు ఆర్ద్రమయ్యింది. వెంటనే వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. వారి బాధను పంచుకోవడానికి ఓ వేదిక అవసరం అని భావించింది. తన ఫ్రెండ్‌‌స కొందరితో కలిసి ‘మేక్ లవ్... నాట్ స్కార్‌‌స’ అనే వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. యాసిడ్ బాధితులు ఆడ, మగ ఎవరైనా కూడా తమ బాధను ఇందులో వెల్లడించేందుకు అవకాశం కల్పించింది.
 
అయితే అది వారి గుండె బరువు మాత్రమే తీరుస్తుంది. వారికి మనోధైర్యాన్ని ఇవ్వదు. వారి భవిష్యత్తుకు కొత్త బాట పరవదు. అందుకే ఆ బాధ్యతను తాను తీసుకుంది. యాసిడ్ దాడి బాధితులందరినీ కలుసుకుని వాళ్లకి ధైర్యం చెప్పింది. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించింది. ‘రూపం ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. అది ఉన్నప్పుడు మనిషికి అందంతో పని లేదు’ అని వివరించింది. వాళ్లలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి మేకోవర్ ప్రాజెక్టును మొదలు పెట్టి... అందరికీ అందంగా మేకప్‌లు వేయించింది. ర్యాంప్‌షో నిర్వహించింది. ఆమె పరిచయమైన తరువాత అందరం ఎంతో సంతోషంగా ఉన్నాం అని బాధితులంతా అంటున్నారు. కొందరు ఇప్పటికే తమ భవిష్యత్తును సరికొత్తగా నిర్మించుకునే పనిలో పడ్డారు. అంటే... రియా వారిలో ఎంత మార్పు తెచ్చిందో ఊహించవచ్చు.
 
అయితే తన పని అక్కడితో అయిపోలేదు అంటోంది రియా. త్వరలోనే తన వెబ్‌సైట్ పేరుతోనే ఎన్జీవోని స్థాపించబోతోంది. ఇప్పటికే కొందరు ఆమెతో చేతులు కలిపారు. వారంతా కలిసి ఎక్కడ ఎవరిపై యాసిడ్ దాడి జరిగినట్లు తెలిసినా వెంటనే అక్కడికి వెళ్లిపోతారు. ఆసుపత్రికి తరలిస్తారు. ప్రభుత్వంతో మాట్లాడి సహాయం అందేలా చేస్తారు. తమ వంతుగా విరాళాలు సేకరించి బాధితులందరినీ ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. త్వరలో ఈ సేవలను విస్తరించాలని అనుకుంటోంది రియా. అందుకోసమే ఎన్జీవోను ఏర్పాటు చేయాలని అను కుంటోంది. ఆమె అనుకున్నదంటే సాధిస్తుంది. ఎందు కంటే... సాధించకుండా వదిలే తత్వం కాదామెది!
 
- సమీర నేలపూడి
 
ముఖం మీద చిన్న మచ్చ వస్తేనే కంగారు పడిపోతాం. అది మాసిపోయే వరకూ అవీ ఇవీ పూసేస్తుంటాం. కానీ ఎవరో ఏదో కోపంతో యాసిడ్ పోస్తే... ముఖం కాలిపోయి, తమను తామే అద్దంలో చూసుకోవడానికి బాధపడే పరిస్థితుల్లో ఉన్నవాళ్ల బాధ ఎలా ఉంటుంది! వాళ్లను చూసినప్పుడు నా మనసు కదిలిపోయింది. అందుకే అందం గురించి ఆలోచించకూడదని, అసలు జీవితంలో ఎప్పుడూ మేకప్ అన్నదే వేసుకోకూడదని నిర్ణయించుకున్నాను.
- రియాశర్మ
 

మరిన్ని వార్తలు