మంచి నిద్రకు... తలార స్నానం!

24 Jul, 2019 10:58 IST|Sakshi

రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టడం లేదా? అటు ఇటు పొర్లిపొర్లి అలసిపోతున్నారా? ఈ చికాకులేవీ లేకుండా హాయిగా నిద్రపోవాలనుకుంటున్నారా? పడుకునేందుకు సుమారు 90 నిమిషాల ముందు అంటే గంటన్నర ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే.. మీ సమస్య తీరినట్లే అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు. ఇదేదో ఆషామాషీగా చెప్పేసిన విషయం ఏమీ కాదండోయ్‌! ఇప్పటికే జరిగిన దాదాపు 5322 అధ్యయనాలను పునఃపరిశీలించి, సమాచారాన్ని విశ్లేషించి మరీ నిగ్గుతేల్చిన విషయం. అంతేకాదు. స్నానం చేసేందుకు వాడే నీటి ఉష్ణోగ్రత 40 నుంచి 43 డిగ్రీ సెల్సియస్‌ మధ్య ఉన్నప్పుడు నడుం వాల్చిన కొద్ది సమయంలోనే నిద్రలోకి జారుకుంటారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. పడుకునేందుకు గంట, రెండు గంటల ముందు శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా తగ్గుతుందని ఆ సమయంలో నులివెచ్చటి నీటితో స్నానం చేస్తే రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి సుఖ నిద్రకు సాయపడుతుందని వీరు అంటున్నారు. శరీర ఉష్ణోగ్రతల్లో  మార్పులకు అనుగుణంగా ఉష్ణోగ్రతను మార్చుకునే పరుపులను తయారు చేయడం ద్వారా రాత్రంతా దీర్ఘనిద్రలో ఉండేలా చేసేందుకు ప్రస్తుతం తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. స్లీప్‌ మెడిసిన్‌ రివ్యూ జర్నల్‌ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు