స్త్రీ, పురుషులు ఇద్దరికీ..!

30 Mar, 2018 00:25 IST|Sakshi

దానిమ్మపండును కోసి చూస్తే లోపల ఎంత అందంగా ఉంటుందో, మన కడుపులోపలికి వెళ్లాక అంతటి ఆరోగ్యాన్నీ ఇస్తుంది. దానిమ్మలోని పోషకాల వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటీ, రెండూ కావు.  ఆ పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని.

  దానిమ్మ పండులో అత్యద్భుతమైన రెండు పోషకాలు ఉన్నాయి. అవి... ప్యూనికాలాజిన్స్, ప్యూనిసిక్‌ యాసిడ్‌.  ప్యూనికలాజిన్‌ అత్యంత శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. ఇది ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్, మహిళల్లో రొమ్ముక్యాన్సర్లను నివారిస్తుంది. ఇక మరో ప్రధాన పోషకమైన ప్యూనిసిక్‌ యాసిడ్‌ మనిషికి మంచి ఆరోగ్యాన్నిచ్చే ప్రధాన ఫ్యాటీ యాసిడ్స్‌లో ఒకటి.
 బరువు పెరగకుండా నియంత్రించుకో వాలనుకున్న వారికి దానిమ్మ చాలా మేలు చేస్తుంది. దానిలోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థను కాపాడతాయి. పేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తాయి.
 దానిమ్మ కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది. రక్తనాళాల్లోని పూడికను తొలగిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, గుండెజబ్బులను, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
  ఏవైనా గాయాలు అయినప్పుడు వాటి వాపును, మంట, నొప్పి (ఇన్‌ఫ్లమేషన్‌)ని తగ్గిస్తుంది.
  చర్మాన్ని మెరిసేలా చేసి, మేని నిగారింపునకు దోహదపడుతుంది. వయసు పెరిగాక వచ్చే ముడుతలు, గీతలను నివారిస్తుంది. వయసు పెరుగుదలను తగ్గిస్తుంది. చాలాకాలంపాటు యౌవనంగా ఉండేలా చేస్తుంది.  
 ఎముకలను పటిష్టంగా ఉంచడంతో పాటు కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్‌ వంటి సమస్యలనూ నివారిస్తుంది.

మరిన్ని వార్తలు