లంఘనం పరమౌషధం

10 Nov, 2018 00:08 IST|Sakshi

ఆయుర్‌ ఫ్యాక్ట్స్‌

ధార్మిక సిద్ధాంతాల ప్రకారం మానవ జన్మకు సార్థకత కైవల్యప్రాప్తి. ఈ ఉన్నత సోపానం అధిరోహించటానికి ధర్మార్థకామయుత జీవనయానం అనివార్యం. ఇటువంటి ప్రయాణానికి మూలస్తంభం ఆరోగ్యం అని ఆయుర్వేద వైద్యపితామహుడు చరకుడు చెప్పాడు. (ధర్మార్థ కామ మోక్షాణాం ఆరోగ్యం మూలముత్తమమ్‌). ఇదే ఆయుర్వేదపు ఉత్పత్తికి, ప్రయోజనానికి మూలకారణం. దీని ప్రధాన భాగాలు రెండు. స్వస్థునికి ఆరోగ్య పరిరక్షణ, రోగులకు వ్యాధి నిర్మూలన. మానసిక శారీరక ఆరోగ్యాలు పరస్పరం అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. దేహచిత్తాలు పటిష్ఠంగా ఉండటానికి మూలాధారం మహాకోష్ఠం. అంటే నోటి నుండి మలమార్గం వరకు విస్తరించి ఉన్న జీర్ణకోశ సంస్థానం. ఇది సక్రమంగా పనిచేయడానికి ఆయువుపట్టు లంఘనం. దీనినే వాడుకభాషలో లంఖణం అంటుంటారు.

లంఘనం – ఉపవాసం: లంఘనమంటే తేలికగా ఉండటం అని అర్థం. దీనికి వ్యతిరేకం బరువుగా ఉండటం (గురువు). జీర్ణక్రియ, శోషణ క్రియ, ధాతు పరిణామం, మల విసర్జనం. .. ఈ నాలుగు తేలికగా జరిగినప్పుడే దేహానికి శక్తి, మనసుకి శాంతి. ఆరోగ్యాన్ని పొందుపరచే శోధన చికిత్స (పంచకర్మలు: వమన, విరేచన, నస్య, వస్తి, రక్తమోక్షణం), శమన చికిత్సలు లంఘనంలోకే వస్తాయి.
శమన ప్రక్రియలు: దప్పికను అరికట్టడం (పిపాస), గాలిని సేవించటం (మారుత) ఎండను సేవించటం (ఆతప), ఆహార పచన (పాచన) ద్రవ్యాలు సేవించటం, ఉపవాసం, వ్యాయామం.
చరక సంహిత సూత్రస్థానం: 
చతుష్ప్రకారా సంశుద్ధిః‘ పిపాసా మారుత ఆతపౌపాచనాని ఉపవాశశ్చ వ్యాయామశ్చేతి లంఘనః‘‘ ఈ శమన ప్రక్రియల్ని సులభంగా ఆచరించవచ్చు. దీనివల్ల శరీర లాఘవం సిద్ధించి తద్వారా మానసికంగా సత్వగుణ సిద్ధి లభిస్తుంది. చాలా రోగాలకి లంఘనమే నివారణ, చికిత్స ప్రక్రియ కూడా.

ఉపవాసం: ఈ పదానికి సమీపంగా ఉండటం అని అర్థం. అంటే భగవంతుని సాన్నిధ్యం. మనసు, దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించినప్పుడు, ఆ తాదాత్మ్యతలో ఆకలిదప్పులు తెలియవు. ఏకాగ్రతతో కూడిన ధ్యానం వలన మానసిక దృఢత్వం అధికం అవుతుంది. తాత్కాలిక నిరాహారం వల్ల శరీర కణాలలోని జీవక్రియలు ఉత్తేజితమై, సర్వాంగాలలోనూ చైతన్య ప్రేరణ కలుగుతుంది. ఇదే దీర్ఘాయువునకు పెద్ద పీట. మానసిక ఆరోగ్యాన్ని పదిలపరచుకోవడం కోసం చెప్పిన దైవవ్యపాశ్రయ చికిత్సలో చరకమహర్షి ఉపవాసాన్ని కూడా చేర్చాడు.(మంత్ర, ఔషధి, మణి, మంగల, బలి, ఉపహార హోమ నియమ ప్రాయశ్చిత్త ఉపవాస స్వస్తి అయన ప్రణిపాత తీర్థగమనాది...)

నేటి ఉపవాస సాధన: ఆహారం లభించకపోతే స్టార్వేషన్‌. ఇది గతి లేని దుర్భర స్థితి. దీని వల్ల దేహచిత్తాలు నిస్సహాయ స్థితికి చేరి, పోషకపదార్థాలు అందక, చిక్కి శల్యమై మరణానికి దారి తీయవచ్చు.
ఉద్దేశపూర్వకంగా ఒక ఫలితాన్ని ఆశించి ఆహారాన్ని సేవించకపోవటం ‘ఫాస్టింగ్‌’. దీనికి సంకల్పదీక్ష ఉంటుంది కనుక ఆరోగ్యప్రదం. దీనిని కొన్ని గంటలు మొదలు కొన్ని రోజుల వరకు చేసే వారున్నారు. ఇది చేసేవారి ఉద్దేశ్యాన్ని బట్టి ఉంటుంది. ఒకరోజు సూర్యోదయం నుండి మరుసటిరోజు సూర్యోదయం వరకు చేసేది ఒకరోజు ఉపవాసంగా పరిగణిస్తారు. కొంతమంది నీరు కూడా తాగకుండా కఠోర ఉపవాసం చేస్తారు. కొందరు ద్రవపదార్థాలు మాత్రమే సేవిస్తారు. కొందరు పండ్లు సేవిస్తారు. మొత్తం మీద వండిన పదార్థాలను తాకకుండా ప్రకృతి దత్తమైన తేలికపాటి ఆహారాన్ని అంగీకరిస్తారు. ఉపవాస విరమణ సందర్భంలో కూడా కొందరు ఈ సూత్రాన్ని పాటిస్తారు.

పానీయాలు: నీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకురసం, బెల్లపు పానకం, కొంచెం ఉప్పు, నిమ్మ రసం కలిపిన శర్కర నీళ్లు, టీ, కాఫీ మొదలైనవి.
ఫలాలు: అరటి, సీతాఫలం, సపోటా, జామి, ద్రాక్ష, కమలా, బత్తాయి, పనస మొదలైనవి.
ఇంట్లో తయారు చేసుకునేవి: వడపప్పు (నానబెట్టిన పెసరపప్పులో శర్కర కలుపుతారు) చిమ్మిలి (నువ్వుల పప్పు, బెల్లం కలిపి దంచి, ఉండలుగా చేస్తారు), చలిమిడి (బియ్యాన్ని నానబెట్టి, పంచదారతో కలిపి దంచి ఉండలు చేస్తారు), పాకం చలిమిడి (నానబెట్టిన బియ్యాన్ని పిండి చేసి, శర్కరను కాని, బెల్లాన్ని కాని పాకం పట్టి, ఏలకులు, కొబ్బరి ముక్కలు, కొంచెం నువ్వులు కూడా చేర్చి ఉండలు చేస్తారు), తియ్య దుంపలు, పెండలం మొదలైనవి ఉడకబెట్టి తింటారు.

ఇతరములు: ఇడ్లీ, ఉప్మా, దోసెల వంటివి
ఉపవాసం ఎప్పుడు చేయాలి:  ∙సాంప్రదాయపరంగా ప్రతినెలా పున్నమి ముందు వచ్చే ఏకాదశి (శుద్ధ/శుక్ల ఏకాదశి) రోజున (ఇందులోనే వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి, పెద్ద ఏకాదశి ఇందులోనే ఉంటాయి) ∙కార్తిక పౌర్ణమి, శివరాత్రి, శ్రీరామనవమి, దుర్గా నవరాత్రులు ∙కార్తిక మాసమంతా పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి భుజిస్తారు. దీనిని ఏక భుక్తం లేదా నక్తాలు (నక్త – రాత్రి) అంటారు ∙కొంతమంది పర్వదినాలలో ఉపవాసం ఉంటారు.

వైద్య/ఆరోగ్యపరంగా: వారానికి ఒకసారి లేదా నెలకు రెండు సార్లు ఉపవాసం చేయడం ఉత్తమం. కనీసం పగలంతా ఘన పదార్థాలు (వండినవి) తినకుండా కేవలం ద్రవాహారంతో చేసినా జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది. రాత్రి స్వల్పంగా తినవచ్చు. ఆయుర్వేదంలో కొన్ని జావలు (సూప్స్‌) చెప్పారు. (బియ్యప్పిండి, పేలాలు, అటుకులు, కూరగాయలు). వీటిలో పాచక పదార్థాలు (మిరియాల పొడి; వాము జీలకర్ర పొడులు, శొంఠి, పిప్పళ్ల పొడులు) కలుపుకోవచ్చు ∙ఉపవాస సమయంలో వాతదోషం ప్రకోపిస్తుంది. పైన చెప్పిన పదార్థాలన్నీ వాతశ్యామకంగా పనిచేస్తాయి. అటువంటి సామ్యావస్థను అర్థం చేసుకుని పోషక విలువల్ని పరిరక్షించుకుంటూ ఎంతకాలం ఉపవాసం చేసినా ఆరోగ్యకరమే ∙శివువులు, వృద్ధులు కఠోర ఉపవాసాలు చేయకూడదు ∙గర్భిణులు పోషక విలువలున్న ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. రుచి కోసం అధికమాత్రలో ఆహారాన్ని సేవించకూడదు. 
గుర్తుంచుకోవలసిన సారాంశం:అసలు కారణమెట్టిదిౖయెనగానిఉండవలయును ఉపవాసమొక్కపూటమూడుసార్లైన నెలనెలలోన ముచ్చటగనుకలుగు నారోగ్య దీర్ఘాయు ఫలములచట.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, 
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు 

మరిన్ని వార్తలు