స్కూల్లో  కళ్లు తిరిగి  పడిపోతున్నాడు...  ఎందుకిలా? 

30 Jan, 2018 00:30 IST|Sakshi

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్స్‌

మా అబ్బాయికి తొమ్మిదేళ్లు. ఇటీవల రెండుసార్లు వాడు స్కూల్లో కళ్లు తిరిగిపడిపోయాడు. డాక్టర్‌కు చూపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మా అబ్బాయి సమస్య ఏమిటో చెప్పండి. 
– కె. రాంబాబు, నకిరేకల్‌ 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను సింకోప్‌ అనుకోవచ్చు. అంటే ఉన్నట్టుండి అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం అన్నమాట. ఇది  ఏ వయసువారిలోనైనా రావచ్చు. పిల్లలు ఇలా పడిపోవడం అన్నది తల్లిదండ్రులకు ఎంతో ఆందోళన కలిగించే విషయమే అయినా ఇది చాలా సాధారణం. అయినప్పటికీ  ఇలా జరిగినప్పుడు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు అవసరం. సాధారణంగా కళ్లుతిరిగి పడిపోవడం (వేసోవ్యాగల్‌), గుండె సమస్యలు (లయ తప్పడం, అయోర్టిక్‌ స్టెనోసిస్‌), ఫిట్స్‌లో కొన్ని రకాలు, తీవ్రమైన నొప్పి వంటి అనేక కారణాలతో ఇలా జరగవచ్చు. అయితే మీ అబ్బాయి విషయంలో మామూలుగా కళ్లు తిరగడం (వేసోవ్యాగల్‌), ఒక్కసారిగా లేవగానే కళ్లు తిరగడం (ఆర్థోస్టాటిక్‌ హైపోటెన్షన్‌) వంటి కారణాలతో ఇది జరిగిందేమోనని భావించవచ్చు. అయినప్పటికీ మీరు ఒకసారి మీ పీడియాట్రిక్‌ నిపుణుడి ఆధ్వర్యంలో ఇలా కళ్లు తిరిగిపడిపోవడానికి గల కారణాలను కనుక్కోడానికి తగిన పరీక్షలు (ఈసీజీ, ఈఈజీ మొదలైనవి) చేయించాలి. ఇలాంటి పిల్లలకు నీళ్లు ఎక్కువగా తాగించడం, బిగుతుగా ఉండే దుస్తులు (ముఖ్యంగా మెడ వద్ద టైట్‌గా ఉన్నవి) తొడగకుండా ఉండటం మంచిది. పిల్లలను పడుకోబెట్టినప్పుడు తలవైపు కాస్త ఎత్తుగా ఉండేలా చేయడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను చాలావరకు నిరోధించవచ్చు. 

ఇంత చిన్న పాపకూ  అవాంఛిత రోమాలా...?
మా పాప వయసు ఆరేళ్లు. పాపకు ఒళ్లంతా దాదాపు అంగుళం పొడవున్న వెంట్రుకలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇవి మరింత పెరుగుతాయేమోనని భయంగా ఉంది. మా పాప సమస్యకు సరైన చికిత్స వివరించండి.  – సుభద్ర, టెక్కలి 
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు హైపర్‌ ట్రైకోసిస్‌ అన్న కండిషన్‌ ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... అవాంఛిత రోమాలు చాలా ఎక్కువగా, శరీరంలో చాలాచోట్ల ఉండటం అన్నమాట. పిల్లల్లో ఈ కండిషన్‌ చాలా అరుదు. మీరు చెప్పిన కొద్దిపాటి సమాచారంతో మీ పాపకు ఇవే లక్షణాలు కనిపించే హిర్సుటిజమ్‌ అనే కండిషన్‌ ఉండేందుకు అవకాశం తక్కువ.పిల్లల్లో అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉంటే... అది దేహంలో కొన్ని ప్రాంతాలకే  పరిమితం కావడం లేదా ఒళ్లంతా ఉండటం, మరికొందరిలో కొంతకాలం పాటే ఉండటం లేదా కొందరిలో శాశ్వతంగా ఉండటం చూస్తుంటాం. కొందరిలో ఇలా వెంట్రుకలు ఎక్కువగా ఉండటం అన్నది పుట్టుకతోనే (కంజెనిటల్‌) వచ్చే సమస్య కాగా మరికొందరిలో మధ్యలో (అక్వైర్‌డ్‌) రావచ్చు.  కుటుంబంలో వెంట్రుకలు ఎక్కువగా ఉంటే ఆ లక్షణం పిల్లలకూ రావడం (ఫెమీలియల్‌), జెనెటిక్, కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు, దీర్ఘకాలికంగా కొన్ని మందులు వాడటం, ఎండోక్రైన్‌ సమస్యల వంటివి అవాంఛిత రోమాలకు కారణం. పుట్టుకతోనే వెంట్రుకలు ఎక్కువగా ఉండేవారికి – అవి తొలగించేందుకు శాశ్వత చికిత్స చేయడం అన్నది కొద్దిగా క్లిష్టమైన సమస్యే. ఇలా అవాంఛిత రోమాలు రావడం అన్నది మధ్యలోనే వచ్చే సమస్య  (ఉదాహరణకు దీర్ఘకాలికమైన మందులు, ఎండోక్రైన్‌ సమస్య, ఆహారలోపాల వల్ల) అయితే, సమస్యకు మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేయగలిగితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 

అవాంఛిత రోమాలు కేవలం ఒక విధానం విధానం ద్వారానే పూర్తి తొలగించడం సాధ్యం కాదు. ప్లకింగ్, ఎపిలేషన్, ఎలక్ట్రాలిస్, లేజర్‌థెరపీ వంటి ప్రక్రియలతో వాటిని తీసివేయవచ్చు. అయితే ఎలక్ట్రాలిసిస్, లేజర్‌ రిమూవల్‌ వంటి ప్రక్రియలను చిన్న వయసులోనే అనుసరించడం సరికాదు. మీరు ఒకసారి డెర్మటాలజిస్ట్‌ లేదా కాస్మటాలజిస్ట్‌ను కలిసి మీ పాప అవాంఛిత రోమాలకు ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయేమో అని నిర్ధారణ చేసుకుని, దాని ప్రకారం తగిన చికిత్స తీసుకోవాలి. 

గుండె రంధ్రాలు  అవే పూడుకుపోతాయా...? 
మా బాబు పుట్టిన నెల తర్వాత బాగా జలుబుగా ఉన్నట్లు అనిపిస్తే డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాం. గుండె లోపల రెండు రంధ్రాలు ఉన్నట్లు డాక్టర్‌ చెప్పారు. ‘చిన్న వయసు కదా... వాటంతట అవే పూడుకుంటాయి’ అన్నారు. మాకు ఆందోళనగా ఉంది. మా బాబు సమస్య నయమవుతుందా? వివరంగా తెలియజేగలరు.  – సంధ్యారాణి, రాజంపేట 
మీరు బాబుకు గుండెలో రంధ్రాలున్నాయంటూ చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ బాబుకు ఏట్రియల్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ (ఏఎస్‌డీ... అంటే గుండె పై గదుల్లోని గోడలో రంధ్రాలు)గాని, వెంట్రిక్యులార్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ (వీఎస్‌డీ... అంటే గుండె కింది గదుల్లోని గోడలో రంధ్రాలు) గాని ఉండవచ్చు. ఇలా గుండె గదుల్లోని గోడలపై రంధ్రాలు ఉన్న సమస్యతో పిల్లలు నీలంగా మారిపోతూ (సైనోసిస్‌) ఉంటే అలాంటప్పుడు పిల్లలకు తక్షణం శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో గుండె గదుల గోడలకు రంధ్రాలు ఉండీ, పిల్లలు నీలంగా మారనప్పుడు, శ్వాసకోశానికి సంబంధించిన ఇతరత్రా సమస్యలు ఏవీ లేకుండా తక్షణం శస్త్రచికిత్స అవసరం ఉండకపోవచ్చు. అయితే అలాంటి పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి చికిత్స అవసరమన్నది ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానం మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయా లేదా అన్నది కూడా ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానాలను బట్టి ఉంటుంది. ఆ రంధ్రాలు ఉండటం వల్ల వచ్చే ఇతరత్ర సమస్యల  (అసోసియేటెడ్‌ కార్డియాక్‌ డిఫెక్ట్స్‌)పైన కూడా ఆధారపడి ఉంటుంది. 

గుండె పై గదుల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 60 శాతం నుంచి 70 శాతం మందిలో ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయి. గుండె కింది గదుల్లోని గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 30 శాతం నుంచి 40 మందిల్లోనూ ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోవచ్చు. అలాగని గుండె గోడలకు ఉన్న రంధ్రాలన్నీ వాటంతట అవే మూసుకుపోతాయని చెప్పలేం. 
ఇలా గుండె గదుల మధ్య గోడకు రంధ్రాలు ఉన్న పిల్లలకు తరచూ నెమ్ము రావడం చూస్తుంటాం. అలాంటప్పుడు పిల్లలకు తక్షణ చికిత్స అవసరం. మీరు మీ అబ్బాయిని కనీసం ప్రతి ఆర్నెలకు ఒకసారి పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌కు చూపించాలి. ఒకవేళ గుండె గదుల మధ్యనున్న రంధ్రాలు వాటంతట అవే మూసుకోకపోయినా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్స సహాయంతో – శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స లేకుండానే మందులతో దాదాపు 90 శాతం నుంచి 95 శాతం సక్సెస్‌రేట్‌తో సమర్థంగా చికిత్స చేయడానికి అవకాశం ఉంది. మీరు మీ పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌తో ఫాలోఅప్‌లో ఉండండి.  
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్, 
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు