నాకు తరచూ గుండెదడ...  ప్రమాదమా? 

9 Feb, 2018 03:04 IST|Sakshi
గుండెపోటు

ఫ్యామిలీ డాక్టర్‌

కార్డియో కౌన్సెలింగ్‌

నా వయసు 46 ఏళ్లు. ఈమధ్య నాకు గుండె దడగా ఉంటోంది. అడపాదడపా ఈ గుండెదడ వస్తోంది. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందా? వాటి సాధారణ కారణాలు తెలపండి. సలహాలు ఇవ్వండి.  – రఘురామయ్య, కర్నూలు 
సాధారణ పరిస్థితుల్లో అయితే గుండె తాలూకు స్పందనలను మనం గ్రహించలేము. ఒకవేళ అలా గ్రహించేలా గుండె స్పందిస్తూ ఉంటే దాన్ని గుండె దడ అని చెప్పవచ్చు.  గుండె దడ అనేది ఒక వ్యాధి కాదు. ఒక లక్షణం. భయాందోళనలకు గురైనప్పుడు, ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు గుండె అదనపు వేగంతోనూ, శక్తితోనూ పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఎవరి గుండె స్పందన వాళ్లకు తెలుస్తుంది. ఇది తాత్కాలికంగా కనిపించినా... తర్వాత దానంతట అదే సద్దుమణుగుతుంది.  అయితే ఒకవేళ ఇదే పరిస్థితి నిరంతర లక్షణంగా మారితే దానికి ప్రాధాన్యం ఇవ్వాలి లేకపోతే చాలా మందిలో గుండెకు సంబంధించిన ప్రతి అంశం ఆందోళన పుట్టిస్తుంది. సాధారణమైన జలుబులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, టీ, కాఫీ, మద్యం తాగడం వంటి అంశాలు కూడా గుండెదడను కలిగించగలవనే విషయం తెలియక చాలామంది విపరీతమైన ఆందోళనకు, అలజడికి గురవుతారు. 

సాధారణంగా ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు గుండెదడ వస్తుంది లేదా గుండెకు సంబంధించిన వ్యాధులలో కూడా ఈ స్థితి కినిస్తుంది. గుండెదడను వైద్యశాస్త్రపరంగా విశ్లేషించేటపుపడు సాధారణ రక్తపరీక్ష మొదలు ఈసీజీ వరకు అనేక రకాల పరీక్షలు అవసరమవుతాయి. టెస్ట్‌లలోని ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది.  

గుండెదడ తగ్గించుకోడానికి సూచనలు : 
గుండెదడగా ఉన్నప్పుడు మరీ వేడిగా ఉండే పదార్థాలను తినకూడదు. కషాయం, చేదు, కారం రుచులను తగ్గించుకోవాలి. ఎక్కువగా తినడం లేదా తిన్నది జీర్ణం కాకముందే తినడం మంచిది కాదు. 
∙మలమూత్ర విసర్జనలను ఆపుకోకూడదు. 
∙కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌ లాంటి ఉత్ప్రేరక పదార్థాలు వాడటం తగ్గించాలి. టీ కంటే కాఫీతో గుండెదడ పెరిగే అవకాశాలు ఎక్కువ. 
∙పొగతాగే అలవాటు మానేయండి. పక్కనుండే స్నేహితులు పొగతాగుతున్నా వారించండి. 
∙మానసికంగా స్థిరంగా ఉండండి. 
∙బిగ్గరగా మాట్లాడకూడదు, మాట్లాడితే గుండెదడ పెరుగుతుంది. 
∙నూనెలు, కొవ్వు పదార్థాలు వాడకాన్ని తగ్గించాలి. 
మరీ గుండెదడ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధమచికిత్సగా ఐస్‌ను నల్లగ్గొట్టి ఒక బ్యాగ్‌లో వేసి, ఛాతీపై పెట్టుకుంటే గుండెదడ కొంతవరకు తగ్గుతుంది. 

గుండెజబ్బుల నివారణకు సూచనలేమిటి? 
నా వయసు 35 ఏళ్లు. చాలా కొద్ది వ్యవధిలోనే మాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు సన్నిహితులు గుండెజబ్బుతో చనిపోయారు. దాంతో మాకు చాలా ఆందోళనగా ఉంది. గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – ఎమ్‌. సత్యనారాయణ, వైజాగ్‌ 
గుండెజబ్బులు ఉన్న కుటుంబ చరిత్ర గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రధాన సూచనలివి... 
మీలా చిన్న వయసు వారైనప్పటికీ ఇప్పట్నుంచే తరచూ కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉండటం మేలు. డాక్టర్‌ సలహాల మేరకు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకుంటూ ఉండాలి.  గుండెపోటు రావడానికి డయాబెటిస్‌ ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్నవారు రక్తంలోని చక్కెరను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ,  డాక్టర్‌ సూచన మేరకు వారు సూచించిన వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తంలోని చక్కెరలను పరీక్షించుకుంటూ ఉండాలి.  కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి.   పొగ తాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పాదనలు, వస్తువులను పూర్తిగా మానేయాలి. గుండెజబ్బుల నివారణలో ఇది చాలా ప్రధానం. డాక్టర్‌ సూచనల మేరకు శరీరానికి మరీ శ్రమ కలిగించకుండా చేసే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి. 

మన ఒంటి బరువును పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.   రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి.  మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఒంటికి అందేలా సమతులాహారం తీసుకోవాలి.  ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి.  ఈ కొన్ని జాగ్రత్తలతోనే చాలావరకు గుండెజబ్బులను నియంత్రించవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్లు సూచించిన మందులను తప్పక వాడుతుండాలి. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా ఉన్నట్లు అనిపించినా డాక్టర్‌ను  తప్పక సంప్రదించాలి. ఈ కొద్దిపాటి సూచనలు పాటిస్తే గుండెపోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడం చాలావరకు నివారించవచ్చు. 

ఒంటరిగా   ఉన్నప్పుడు  గుండెపోటు  లక్షణాలు  కనిపిస్తే?
నా వయసు 58 ఏళ్లు. ఇంట్లో నేనొక్కడినే ఉంటాను. ఈమధ్య ఛాతీలో ఎడమవైపు కాస్త అసౌకర్యంగా అనిపించింది. అప్పుడేమీ అనిపించలేదుగానీ... తలచుకుంటే ఇప్పుడు  ఆందోళనగా ఉంది. ఒకవేళ అది నిజంగానే గుండెపోటు అయితే నాలాంటివారి పరిస్థితి ఏమిటి? నాలాంటి ఒంటరి వాళ్లు అలాంటి సమయంలో ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి. 
– నందగోపాల్,  విజయవాడ 

గుండెపోటు లక్షణాలైన ఎడమవైపున భుజం నొప్పిగా ఉండటం, ఎడమవైపు ఛాతీలో అసౌకర్యం, ఎడమ దవడ నొప్పిగా అనిపించడం, ఛాతీలో నొప్పి ఎడమవైపునకు పాకుతున్నట్లుగా ఉండటం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. అలాంటి సమయాల్లో చాలా బలంగా దగ్గాలి. ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని అలా దగ్గుతూనే ఉండండి. ఎంత బలంగా దగ్గాలంటే ‘వయొలెంట్‌ కాఫ్‌’ అని పిలిచేంత తీవ్రంగా ఆ దగ్గు ఉండాలి.  ఇలా బలంగా దగ్గడం వల్ల గుండెకు రక్త సరఫరా ఎక్కువ అవుతుంది. దాంతో గుండెకు అసలే రక్తసరఫరా నిలిచిపోయే పరిస్థితి నివారితమవుతుంది. ఇలా మీరు దాదాపు 5 నిమిషాల సమయం పాటు మీ సమస్యను వాయిదా వేయగలిగినా చాలు... అవి ప్రాణాన్ని రక్షించే బంగారు క్షణాలవుతాయి. మీరు ఎవరికైనా ఫోన్‌ చేయడానికైనా... లేదా మీ మందుల డబ్బా వరకు చేరేంత వరకైనా తగినంత సమయం మీకు దొరుకుతుంది. మీలాంటి వారు మీ మందుల డబ్బాలో యాస్పిరిన్‌ ఉంచుకోవాలి. మీరిలా దగ్గుతూ మందుల డబ్బాను చేరి యాస్పిరిన్‌ టాబ్లెట్‌ వేసుకుంటే... మీరు ఆసుపత్రికి చేరే టైమ్‌ దొరికే అవకాశం ఉంటుంది. అది మీ ప్రాణాలను రక్షిస్తుంది. 
 డాక్టర్‌ హేమంత్‌ కౌకుంట్ల 
సీనియర్‌ కార్డియోథొరాసిక్‌ సర్జన్, 
సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌.  

మరిన్ని వార్తలు