మైగ్రేన్‌కు పరిష్కారం ఉందా?

5 Apr, 2018 00:33 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌ హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 35 ఏళ్లు. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపు విపరీతమైన తలనొప్పి వస్తోంది. ఆఫీసులో ఏపనీ చేయలేకపోతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్‌ అన్నారు. నా సమస్యకు హోమియోలో çపరిష్కారం ఉంటే చెప్పండి. 
– రవికిరణ్, నిజామాబాద్‌ 

పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్‌ తలనొప్పిలో తలలో ఒక వైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటి వరకు వ్యాపిస్తుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో ఇది ఎక్కువ. 

కారణాలు :  తలలోని కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన సువాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్‌ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. 

లక్షణాలు : పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. 
1. పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు : ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్ల ముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు. 
2. పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు : అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు. 
3. పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు : చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉం్డటం, వికారం, వాంతులు విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
చికిత్స / నివారణ : కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్‌టిట్యూషన్‌ పద్ధతిలో ఇచ్చే ఉన్నత  ప్రమాణాలతో కూడిన హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

ఏడీహెచ్‌డీకి చికిత్స ఉందా? 
మా బాబు వయసు ఏడేళ్లు. ఒక చోట కుదురుగా ఉండడు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాడు.  ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్‌ నుంచి ఎవరో ఒక టీచర్‌ మావాడి ప్రవర్తన గురించి ఏదో ఒక కంప్లయింట్‌ చేస్తుంటారు. డాక్టర్‌కు చూసిస్తే ఒకరు ఏడీహెచ్‌డీ అన్నారు. హోమియోలో మా వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా? 
– కనకారావు, భీమవరం 

ఏడీహెచ్‌డీ అనేది అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివ్‌ డిజార్డర్‌ అనే వ్యాధి పేరుకు సంక్షిప్త రూపం. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కూడా మీ బాబుకు అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌ ( ఏడీహెచ్‌డీ) అనే సమస్యే ఉందనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్‌డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధారణంగా ఏమీ గుర్తుండదు.
సమస్యకు కారణాలు : ∙జన్యుపరమైన కారణాలు ∙తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం ∙తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు. 
లక్షణాలు : ∙మతిమరపు, తలనొప్పి ∙ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు ∙మానసిక స్థితి చక్కగా లేకపోవడం ∙ఒక చోట స్థితిమితంగా ఉండలేకపోవడం ∙ఇతరులను ఇబ్బంది పెట్టడం. 
నిర్ధారణ : రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారై 
చికిత్స : హోమియోలో ఏడీహెచ్‌డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్‌ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, 
ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఏమిటి? 
నా వయసు 30 ఏళ్లు. వివాహమై నాలుగేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఏమిటి?  హోమియోలో ఈ సమస్యకు పరిష్కారం ఉందా?  – ఎస్‌. మాధవి, ఇల్లందు 
సంతానలేమి సమస్య ఇటీవల చాలా మందిలో కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో లేదా ఇద్దరిలోనూ ఉండవచ్చు. 
స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు : ∙జన్యుసంబంధిత లోపాలు ∙థైరాయిడ్‌ సమస్యలు ∙అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ∙గర్భాశయంలో సమస్యలు ∙ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ∙డయాబెటిస్‌ ∙గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. 
పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు : ∙హార్మోన్‌ సంబంధిత సమస్యలు ∙థైరాయిడ్‌ ∙పొగతాగడం ∙శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం 
సంతానలేమిలో రకాలు : ∙ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ ∙సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ 
ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ : అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్‌ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. 
సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ : మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్‌ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్‌ రావడం వల్ల సంభవిస్తుంది. 
గుర్తించడం ఎలా : తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్‌ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్‌ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. 
చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్‌స్టిట్యూషనల్‌ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. కారణాలు కనుగొని ఇన్‌ఫెర్టిలిటీకి కారణమైన లోపాలను చక్కదిద్దాలి, ఇలా సంతానం కలిగించేందుకు దోహదం  చేసే మందులు  ఉన్నాయి. వాటితో ఈ సమస్య చాలావరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు