పాపకు ఘనాహారం ఎలా  పెట్టాలి? 

10 Apr, 2018 00:37 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

మా పాపకు ఐదు నెలలు. మరో నెల రోజుల్లో ఘనాహారం మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. ఇలా ఘనాహారం మొదలుపెట్టేవారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలియజేయండి. 
– ఆర్‌. ధరణి, హైదరాబాద్‌
 
పాలు తాగే పిల్లలను ఘనాహారానికి అలవాటు చేయడాన్ని వీనింగ్‌ అంటారు. ఈ వీనింగ్‌ ప్రక్రియలో చిన్నపిల్లలకు ఆర్నెల్లు దాటాక తల్లిపాలతో పాటు అన్నం, గోధుమల వంటి గింజధాన్యాలు (సిరియెల్స్‌), ఆపిల్, సపోటా వంటి పళ్లు, పప్పుధాన్యాలు (దాల్స్‌),  కూరలలో క్యారట్, బాగా ఉడికించిన దుంపలు వంటివి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లలకు ఆర్నెల్ల వయసు వచ్చాక మంచినీళ్లు తాగించడం అవసరం. ఈ వయసు పిల్లలకు పళ్లను జ్యూస్‌ రూపంలో ఇవ్వడం సరికాదు. పిల్లల ఆహారం తయారీకి కుదరని, అత్యవసర సమయాల్లో మాత్రమే – మార్కెట్‌లో దొరికే పిల్లల ఆహార పదార్థాలు (రెడీమేడ్‌ సిరియెల్‌ బేస్‌డ్‌ ఫుడ్స్‌)ను ఇవ్వవచ్చు.

బాబు గోడకు ఉన్న సున్నం తింటున్నాడు... 
మా బాబు వయసు ఐదేళ్లు. చాలా సన్నగా ఉంటుంది. అన్నం అసలు తినదు. చిరుతిండి ఎక్కువగా తింటుంది. ఈమధ్య ఎక్కువగా గోడకు ఉన్న సున్నం తింటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఒంట్లో రక్తం తక్కువగా ఉందని అని కొన్ని మందులు ఇచ్చారు. వాడినా ప్రయోజనం లేదు. ఈ సమస్య తగ్గడం ఎలా? మా బాబు కొంచెం లావెక్కడానికి తగిన సలహా ఇవ్వగలరు.  – మీనాక్షి, చిత్తూరు 
మనం ఆహారంగా పరిగణించని పదార్థాలను పదే పదే తినడాన్ని వైద్య పరిభాషలో ‘పైకా’ అంటారు. ఈ కండిషన్‌ ఉన్నవారు మీరు చెప్పినట్లుగా సున్నంతో పాటు ప్లాస్టర్, బొగ్గు, పెయింట్, మట్టి, బలపాలు, చాక్‌పీసుల వంటి పదార్థాలను తింటుంటారు. మన  సంస్కృతిలో మనం తినని పదార్థాలను తినడాన్ని కూడా ఒక రుగ్మతగానే అనుకోవాలి. అయితే ఇది చాలా సాధారణ సమస్య. ఐదేళ్ల లోపు పిల్లల్లో ఇది చాలా తరచూ కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణాలను నిర్దిష్టంగా చెప్పలేం. బుద్ధిమాంద్యం, పిల్లలపై పడే మానసిక ఒత్తిడి, తల్లిదండ్రుల ఆదరణ సరిగా లేకపోవడం వంటి కొన్ని అంశాలను దీనికి కారణాలుగా చెబుతుంటారు.  కొన్ని సందర్భాల్లో తగిన పోషకాలు తీసుకోకపోవడం, ఐరన్‌ వంటి ఖనిజాల లోపం కూడా పైకా సమస్యతో పాటు కనిపిస్తూ ఉంటుంది. ఈ రుగ్మత ఉన్న పిల్లల్లో జింక్, లెడ్‌ స్థాయుల్లో మార్పులు, ఇతర ఇన్ఫెక్షన్స్‌ కూడా ఉన్నాయేమో నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. 

అనర్థాలు : ∙పేగుల్లో ఆహారానికి అడ్డంకి కలగడం ∙ఐరన్‌ పోషకంలో లోపం ఎక్కువగా కనిపించడం ∙మన శరీరంలో అనేక రోగకారక క్రిములు పెరగడం...వంటి అనర్థాలు పైకా వల్ల కనిపిస్తాయి. ఇక మీ పాప విషయంలో ఇదీ కారణం అని నిర్దిష్టం చెప్పలేకపోయినప్పటికీ పైన పేర్కొన్న కారణాల్లో ఏదైనా ఉందేమోనని చూడాలి. మరికొన్ని ఇతర పరీక్షలు కూడా చేసి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో అని విశ్లేషించాలి. మీ పాపకు డీ–వార్మింగ్‌ మందులతో పాటు ఇతర పారసైటిక్‌ ఇన్ఫెక్షన్స్‌ తగ్గించే మందులు మరోసారి వాడటం అవసరం. దానితో పాటు ఐరన్, క్యాల్షియమ్, జింక్‌ వంటి పోషకాలు ఇవ్వడం మంచిది. అలాగే కొద్ది మందిలో కొద్దిపాటి మానసిక చికిత్స (అంటే... డిస్క్రిమినేషన్‌ ట్రైనింగ్, డిఫరెన్షియల్‌ పాజిటివ్‌ రీ ఇన్‌ఫోర్స్‌మెంట్‌ వంటి ప్రక్రియలతో) కూడా అవసరం. ఈ చిన్నపాటి పద్ధతులతో చిన్నపిల్లల్లో ఆహారం కాని పదార్థాలను తినే అలవాటును చాలావరకు మాన్పించవచ్చు. ఇక లావు, సన్నం అనేది పిల్లల విషయంలో చాలా సాధారణంగా వినే ఫిర్యాదే. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్‌ అనేది పిల్లలను చూశాకే నిర్ధారణ చేయాలి. మీ పాప తన వయసుకు తగినంత బరువు ఉన్నట్లయితే పరవాలేదు. ఒకవేళ అలా  లేకపోతే ఇంట్లో ఇచ్చే సాధారణ పోషకాలతో పాటు, కొన్ని మెడికల్లీ అప్రూవ్‌డ్‌ పోషకాలను ఇవ్వాల్సి రావచ్చు. మీరు మరోసారి మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదించి, ఈ విషయాలను చర్చించండి. 
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్, 
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు