పొట్టలో అల్సర్‌... తగ్గుతుందా?

5 Jul, 2018 00:31 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 37 ఏళ్లు. ఇటీవల కడుపులో మంట, వికారంతో డాక్టర్‌ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్‌ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? 
– డి. రవిచంద్ర, నేలమర్రి 

ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్‌) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్‌ అల్సర్స్‌ అంటారు. హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణశయంలో అల్సర్లు పెరుగుతాయి. 

కారణాలు: ∙80 శాతం మందిలో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ వల్ల అల్సర్లు వస్తాయి ∙చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది ∙మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మద్యపానం, పొగతాగడం ∙వేళకు ఆహారం తీసుకోకపోవడం ∙కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. 

లక్షణాలు: ∙కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ∙ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ∙తలనొప్పి, బరువు తగ్గడం, రక్త వాంతులు, రక్త విరేచనాలు ∙కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ∙నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. 

నివారణ జాగ్రత్తలు: ∙పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ∙మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ∙కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ∙కంటి నిండా నిద్రపోవాలి ∙మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ∙ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. 
చికిత్స: గ్యాస్ట్రిక్‌ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్‌ ఆల్బ్, యాసిడ్‌ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్‌ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. 
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, 
ఎండీ (హోమియో), స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు