పోర్టబుల్‌ టూల్‌ మైగ్రేన్‌కు చెక్‌!

27 Mar, 2017 00:00 IST|Sakshi
పోర్టబుల్‌ టూల్‌ మైగ్రేన్‌కు చెక్‌!

పరిశోధన

మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడుతున్న రోగులకు ఓ శుభవార్త. సైంటిస్టులు ఇప్పుడు కొత్త ఎలక్ట్రానిక్‌ ఉపకరణాన్ని తయారుచేశారు. ఈ పోర్టబుల్‌ ఉపకరణం అసలు నొప్పి మెుదలు కాకమందే పనిచేసి రాబోయే నొప్పిని నివారిస్తుందంటున్నారు దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు. మైగ్రేన్‌ వచ్చినప్పుడు తలనొప్పి తీవ్రత ఎంతో ఎక్కువగా ఉండటమే కాదు... కళ్ల మందు మెరుపులు, చుక్కలు కనిపించినట్లు అనిపించడం, దృష్టి మందగించిన అనుభూతి, బలహీనంగా ఉండటం, అయోమయంగా అనిపించడం... ఈ లక్షణాలన్నీ  సాధారణంగా మైగ్రేన్‌ ఉన్నవాళ్లలో కనిపిస్తాయి.

ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పితో పాటు కొందరిలో వికారం, వాంతులు కూడా ఉంటాయి.ఇలాంటి వాళ్ల కోసం ఒహియో యూనివర్సిటీ పరిశోధకులు ఓ ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని రూపొందించారు. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లేలా రూపొందించిన ఈ ఉపకరణంతో తలనొప్పి నుంచి రోగులకు విముక్తి కలుగుతుందని ఈ పరిశోధనల వల్ల తేలిందని నేతృత్వం వహించిన శాస్త్రజ్ఞుడు యూసఫ్‌ మహ్మద్‌ తెలిపారు.

ప్రస్తుతం మైగ్రేన్‌ తలనొప్పులతో బాధపడుతూ సంప్రదాయ చికిత్స తీసుకుంటున్నవారిలో కనీసం 50%–60% మందికి ఈ చికిత్స సాంత్వన కలిగిస్తుందని యూసఫ్‌ మహ్మద్‌ పేర్కొన్నారు. మైగ్రేన్‌ తలనొప్పి రాబోయేముందు మెదడులో జరిగే అలజడులను పసిగట్టే ఈ ‘ట్రాన్స్‌ క్రేనియల్‌ మ్యగ్నెటిక్‌ స్టిమ్యులేటర్‌’ అనే పరికరం... ఆ అలజడి తలనొప్పిగా రూపొందకముందే తగ్గిస్తుంది. ‘గతంలోనే ఈ ఉపకరణాన్ని తయారుచేశాం. అయితే అప్పుడు అది సైజ్‌లో వురింత పెద్దగా ఉంది. ఒకచోటి నుంచి మరో చోటికి తరలించేందుకు అనువుగా లేదు. అయితే ఇప్పుడు దాన్ని చేత్తో పట్టుకొని తీసుకెళ్లేంత సౌకర్యంగా తీర్చిదిద్దాం’ అంటున్నారు యూసఫ్‌ మహ్మద్‌. ఇంట్లో ఉంచుకునేందుకు వీలైన ఈ పరికరం త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని ఆశించవచ్చు.

మరిన్ని వార్తలు