అపార్ట్‌మెంట్‌పై ఆరోగ్య పంటలు!

5 Jun, 2018 01:04 IST|Sakshi

ఇంటి పంట

వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసుకొని, ఆ కంపోస్టుతో మేడపైన ఎంచక్కా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడం బాధ్యత గల పౌరుల లక్షణం. అటువంటి ఆదర్శప్రాయులు ఇప్పుడు అన్ని నగరాల్లోనూ ఉన్నారు. అయితే, ఈ పని చేస్తున్న అపార్ట్‌మెంట్‌వాసులు ఎక్కడైనా ఉన్నారా? అవును, ముంబైలో ఉన్నారు! వారే మాతాశ్రీ పెర్ల్‌ అపార్ట్‌మెంట్‌వాసులు. మాహిమ్‌ ప్రాంతంలోని ఈ 22 అంతస్తుల మాతాశ్రీ పెర్ల్‌ అపార్ట్‌మెంట్‌లో 65 ఫ్లాట్లున్నాయి. ఇందులో నివాసం ఉంటున్న వారంతా గత ఏడాది అక్టోబర్‌ 2న స్వచ్ఛతా దివస్‌ సందర్భంగా భలే నిర్ణయం తీసుకున్నారు. ‘మా ఇళ్లలో నుంచి తడి చెత్తను బయట పారెయ్యం. చెత్తను కంపోస్టుగా మార్చి సేంద్రియ పంటలు పండించుకుంటాం’ అని ప్రతిన బూనారు. 65 కుటుంబాల నుంచి చెత్తను సేకరించి, ఆ క్యాంపస్‌లోనే కంపోస్టు తయారు చేసి.. ఆ కంపోస్టుతోనే అపార్ట్‌మెంట్‌ భవనం పైన ఎంచక్కా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేస్తున్నారు. కుళ్లి మట్టిలో కలిసిపోయే తడి చెత్తను మున్సిపల్‌ కార్పొరేషన్‌ వాళ్లకు ఇవ్వకుండా.. ఏరోబిక్‌ బయో కంపోస్టర్ల ద్వారా కంపోస్టు తయారు చేస్తున్నారు. నెలకు 700–800 కిలోల వంటింటి తడి చెత్త, 300 కిలోల పొడి చెత్తను రీసైకిల్‌ చేయడం ద్వారా.. నెలకు 60–70 కిలోల చక్కని సేంద్రియ ఎరువు అందుబాటులోకి వస్తోంది. 

3 నెలల్లో ఇంటిపంటల సాగు ప్రారంభానికి అవసరమైనంత కంపోస్టు సమకూరింది. ఇప్పుడు మాతృశ్రీ పెర్ల్‌ అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌ పచ్చని సేంద్రియ ఇంటిపంటలతో కళకళలాడుతోంది. ఆర్‌.యు.ఆర్‌. గ్రీన్‌ లైఫ్‌ అనే సంస్థ తోడ్పాటుతో మాతృశ్రీ పెర్ల్‌ ఈ ఘన విజయాన్ని సాధించింది.  పిల్లలు, గృహిణులు, సీనియర్‌ సిటిజన్లతో ఏర్పాటైన ‘గ్రీన్‌ చాంపియన్ల’ బృందం ఈ సామూహిక ఇంటిపంటల సాగును పర్యవేక్షిస్తున్నారు. మార్చి ఆఖరు నాటికే రెండు విడతలుగా ఆకుకూరలు కోసి.. అపార్ట్‌మెంట్‌ వాసులందరూ తాము పండించుకున్న ఇంటి కూరలను రుచి చూశారు. ఇంటిపంటల రుచే వేరబ్బా.. అని లొట్టలు వేస్తున్నారు. నెలకు వెయ్యి నుంచి 1,200 కిలోల చెత్తను మున్సిపల్‌ కార్పొరేషన్‌ నెత్తిన పడెయ్యకుండా కంపోస్టుకు ఉపయోగించారు. మన అపార్ట్‌మెంట్ల టెర్రస్‌లూ పచ్చబడితే ఎంత బాగుంటుందో..! 

మరిన్ని వార్తలు