శక్తికి శక్తి... అందానికి అందం...  ఆరోగ్యానికి ఆరోగ్యం 

24 Oct, 2018 00:16 IST|Sakshi

గుడ్‌ ఫుడ్‌ – వేరుశనగ

వేరుశనగను త్రీ ఇన్‌ వన్‌ అని చెప్పవచ్చు. ఇదొక తక్షణ శక్తివనరు. ఇందులోని ప్రోటీన్లు, కొవ్వుల కారణంగా తిన్నవెంటనే ఇది శక్తి సమకూరుస్తుంది. అలాగే విటమిన్‌–బి3, విటమిన్‌–ఇ కారణంగా ఒంటికి మంచి మెరుపు వస్తుంది. ఇక ఇందులోని పోషకాలన్నీ ఒంటికి మంచి ఆరోగ్యాన్నిస్తాయి. అంటే తినగానే శక్తి, అందం, ఆరోగ్యం సమకూరుతాయన్నమాట. వేరుశనక్కాయలతో దొరికే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే... 

వేరుశనగల్లోని పి–కౌమేరిక్‌ యాసిడ్‌ అనే పోషకం జీర్ణవ్యవస్థలో వచ్చే క్యాన్సర్లను నివారిస్తుంది. వేరుశనక్కాయల్లోని బీటా–సైటోస్టెరాల్‌ అనే ఒక ఫైటోస్టెరాల్‌ చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుందని ఇంకో అధ్యయనంలో తేలింది.  వేరుశనగ ఒంట్లో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దాంతో గుండెజబ్బులను నివారిస్తుంది. వేరుశనక్కాయలను ‘బ్రెయిన్‌ ఫుడ్‌’ అని కూడా పిలుస్తారు.వేరుశనగలోని విటమిన్‌–బి3... మెదడు చురుకుదనాన్ని పెంచడమే కాకుండా... జ్ఞాపకశక్తి మెరుగయ్యేలా చేస్తుంది. అంతేకాదు వీటిల్లోని రిస్వెరటాల్‌ అనే ఫ్లేవనాయిడ్స్‌ కూడా మెదడుకు జరిగే రక్తప్రసరణకు తోడ్పడి మెదడు పనితీరునూ, చురుకుదనాన్ని 30 శాతం వరకు పెంచుతాయని ఒక అధ్యయనంలో తేలింది.  మన మెదడులో స్రవించే సెరటోనిన్‌ అనే రసాయనం వల్ల మన మూడ్స్‌ బాగుంటాయి.ఇందులోని ట్రిప్టోఫాన్‌ అనే అమైనోయాసిడ్‌ మెదడులోని సెరటోనిన్‌ వెలువడటానికి తోడ్పడుతుంది. దాంతో మూడ్స్‌ బాగుపడటంతో పాటు డిప్రెషన్‌ కూడా తగ్గుతుంది. అందుకే నిరాశతో నిస్పృహలో ఉన్నవారు –వేరుశనక్కాయలు తింటే మూడ్స్‌ బాగుపడి డిప్రెషన్‌ తగ్గుతుంది.    బాల్యం వీడుతూ కొత్తగా టీన్స్‌లో అడుగుపెడుతున్న పిల్లలు వేరుశనక్కాయలు తినడం చాలా మంచిది.ఎందుకంటే ఇవి ఎదుగుదలను వేగవంతం చేస్తాయి. 

బరువు తగ్గాలనుకునేవారు వేరుశనక్కాయలు తినడం మంచిది.   ఇది డయాబెటిస్‌ను నివారిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం వేరుశనక్కాయలు తినేవారిలో డయాబెటిస్‌ వచ్చే ముప్పు 21 శాతం తగ్గుతుందని తెలిసింది. వీటిలో ఉండే మాంగనీస్‌ దీనికి కారణమని ఆ అధ్యయన ఫలితాలు తెలుపుతున్నాయి.  గాల్‌బ్లాడర్‌లో వచ్చే రాళ్లను కూడా వేరుశనక్కాయలు తగ్గిస్తాయని మరో అధ్యయనంలో తెలిసింది. వేరుశనక్కాయల్లో – విటమిన్‌ బి–కాంప్లెక్స్‌లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్‌ చాలా ఎక్కువ. అవి గర్భవతులకు మేలుచేస్తాయి. ఇక విటమిన్‌–బి3గా పిలిచే  నియాసిన్‌ పుష్కలంగా ఉన్నందున ఇది గుండెజబ్బుల ముప్పును నివారిస్తుంది.  మాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా ఎక్కువ. వాటి కారణంగా మంచి రోగనిరోధక శక్తి లభిస్తుంది. ఈ ఇమ్యూనిటీ కారణంగా మరెన్నో జబ్బులూ నివారితమవుతాయి.

మరిన్ని వార్తలు