మారింది కాలం.. మార్చేద్దాం మెనూ

16 Nov, 2017 14:07 IST|Sakshi

చలికాలంలో జాగ్రత్తలు తప్పనిసరి 

పోషకాహారం, వ్యాయామం ప్రధానం  

‘చలి కాలంలో వ్యాధుల బారినపడకుండా మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దగ్గు, జలుబు ఆస్తమా, సైనస్, చర్మ సంబంధిత వ్యాధులు పొంచి ఉండే కాలమిది. చలి నుంచి కాపాడుకునేందుకు, తక్షణ శక్తినిచ్చేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి వేడినిచ్చే ఉన్ని దుస్తులు ధరించాలి. శక్తినిచ్చే ప్రత్యేక ఆహారం తీసుకోవాల’ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం, అధిక బరువు సమస్యలతో బాధపడే వాళ్లు మినహా.. ఆరోగ్యవంతులు శక్తినిచ్చే ఆహారం కాస్త ఎక్కువ మోతాదులోనే  తీసుకోవడం మంచిదంటున్నారు. బేకరీఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. 

వ్యాయామం ముఖ్యం..  
శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను తీసుకోవడం ఎంత అవసరమో, విసర్జకాలను వెలువరించడం కూడా అంతే ముఖ్యం. దీనికి వ్యాయామం ఒక్కటే మార్గం. ఉదయాన్నే నడక, ఏరోబిక్‌ ఎక్సర్‌సైజులు, యోగాసనాలు వంటి వ్యాయామాలను విధిగా చేయాలి.   

జొన్నరొట్టెలు.. 
అన్నం, రొట్టెలతోపాటు వారానికోసారైనా జొన్న గటక తీసుకోవాలి. జొన్నలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. శీతాకాలంలో బాధించే ఒళ్లు నొప్పులను  జొన్న ఆహారం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. జొన్నతో చేసిన పదార్థాలను అల్లం చట్నీతో కలిపి తీసుకొంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  

చిలగడ దుంపలు.. 
చిలగడ దుంపలు శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి. పిల్లలు, వయోధికులకు ఇవి ఎంతో అవసరం. వీటిలో ఉండే పీచు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఎ,సి, ఖనిజ లవణాలు, మాంగనీస్, రాగి శరీరానికి  శక్తినిస్తాయి.  

పాలకూర.. 
ఆకు కూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఇనుము, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ప్రతి రోజు పాలకూరను ఉడికించి లేదా సూపు, రసం రూపంలో తీసుకొంటే ఎంతో మంచిది. 

నువ్వులు..  
నువ్వుల్లో కాల్షియం, ఖనిజ లవణాలు, మాంగనీస్, ఇనుము, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. భోజనం తర్వాత నువ్వులతో చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. చర్మ సమస్యలకు ఇవి దివ్యౌషధం. 

వేరుశనగలు
వేరుశనగల్లో విటమిన్‌ ఇ, బి 3 పుష్కలం. గుండెకు మేలు చేసే మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మంచిది. వేరుసెనగ గింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో తేమను పెంచి పొడిబారకుండా కాపాడుతుంది. 

దానిమ్మ 
సకల పోషకాల నిధి దానిమ్మ. రక్త కణాల వృద్ధికి దోహదం చేస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్‌లు, ఖనిజ లవణాలు, ఫాస్పరస్‌ ఎక్కువగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంచి శరీరం అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి. హృద్రోగం నుంచి కాపాడుతుంది.

డ్రైఫ్రూట్స్‌
డ్రైఫ్రూట్స్‌ను చలికాలంలో తీసుకోవడం మరిచిపోవద్దు. అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌ ఈ కాలంలో తీసుకోవచ్చు. ఖనిజ లవణాలు, విటమిన్లు, ఎంజైమ్‌లు స్రవించేందుకు కావాల్సిన వనరులు వీటిలో పుష్కలంగా ఉంటాయి. జీర్ణశక్తిని అధికం చేస్తాయి. రక్తాన్ని బాగా శుద్ధి చేస్తాయి.    
 

మరిన్ని వార్తలు