పెద్దలకూ పరీక్షలు

12 Sep, 2019 01:39 IST|Sakshi

మనం ముఖం చూసుకోడానికి అద్దం వాడతాం. ఏమైనా తేడా వస్తే వెంటనే గుర్తిస్తాం. ముఖం మీద ఏదో గాయమో, అలర్జీయో లాంటిది కనిపిస్తే వెంటనే తగిన చికిత్స తీసుకునేందుకు హాస్పిటల్‌కు పరుగెడతాం. ఇక మిగతా ఒళ్లు భాగం కూడా అంతే.  కాకపోతే ముంజేతి కంకణానికి అక్కర్లేనట్టే మిగతా శరీరభాగాలకూ అద్దం అవసరం లేదు. ఇలా బయట కనిపించే తేడాలను గుర్తించడం సరే... కానీ మరి ఒంట్లోని మిగతా శరీర భాగాలు, అంతర్గత అవయవాలు, వాటి పనితీరులో తేడాలు ఇవన్నీ గుర్తించడం ఎలా? అందుకు వైద్య పరీక్షలు తోడ్పడతాయి.

మరీ ముఖ్యంగా నలభై, యాభై ఏళ్లు దాటాక ప్రతి వ్యక్తిలోనూ అంతర్గత అవయవాల పనితీరులో మార్పులు రావడం మొదలవుతుంది. అయితే ఒంటి మీద వచ్చినట్టుగా అవి బయటకు కనిపించవు కదా. అందుకే ఒక వయసు దాటాక తరచూ వైద్య పరీక్షలు చేయిస్తూ ఉండాలనీ, అందులో కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు లేదా వైద్య సమస్యలు రాబోతున్న విషయం ముందగానే తెలుసుకుంటే మంచిదని డాక్టర్లు చెబుతుంటారు.  యాభై ఏళ్లు దాటినవారిలో మరీముఖ్యంగా పురుషుల్లో ఎలాంటి వైద్య పరీక్షలు అవసరమో, అవి ఎందుకు చేయించాలో తెలిపేందుకు ఉపయోగపడేదే ఈ ప్రత్యేక కథనం.

సాధారణంగా యాభై, అరవైలలో వచ్చే ఆరోగ్య సమస్యలు చాలావరకు వెన్వెంటనే బయటకు తమ లక్షణాలను కనిపించనివ్వవు. బయటకు అంతా బాగున్నట్లు అనిపించినా, లోపల ఆరోగ్యం అంతే బాగుండకపోవచ్చేమో! ఉదాహరణకు హైబీపీ. అది ఉన్నట్లే తెలియదు. కానీ లోపలంతా డొల్ల చేసేస్తుంది. ఆరోగ్యాన్ని గుల్లబారుస్తుంది. అలాగే డయాబెటిస్‌. ఇలాంటిదే కొలెస్ట్రాల్‌. అందుకే యాభై, అరవైలలో ఆ వయసు పురుషుల ఆరోగ్యానికి కొన్ని పరీక్షలు అవసరం. ఇక మధ్య వయసు వచ్చే వరకూ వాళ్లకు పొగతాగే అలవాటు ఉంటే పైన పేర్కొన్న జబ్బులతో పాటు గుండెపోటూ, క్యాన్సర్‌ వంటి వాటికీ అవకాశం ఎక్కువ. ఇక క్యాన్సర్‌ వంటి కొన్ని జబ్బులను ముందుగానే కనుగొంటే మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణకు చాలా రకాల క్యాన్సర్‌లను మొదటి దశలోనే కనుగొన్నామనుకోండి. 85కి పైగా రకాలను దాదాపుగా నూరుపాళ్లు పూర్తిగా నయం చేయవచ్చు.

యాభై ఏళ్ల పురుషులకు చేయించాల్సిన పరీక్షలు 
చక్కెర వ్యాధి కోసం: సాధారణంగా ఉదయాన్నే పరగడుపున ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ చేయించాలన్న విషయం ఈ రోజుల్లో చాలామందికి తెలిసిందే. అనంతరం భోజనం చేసిన రెండు గంటల తర్వాత పోస్ట్‌ ప్రాండియల్‌ బ్లడ్‌ షుగర్‌ కూడా చేయించాలి. ఈ రెండు పరీక్షలతో రక్తంలోని చక్కెర పాళ్ల ఆధారంగా డయాబెటిస్‌ తీవ్రతను నిర్ధారణ చేస్తారు. ఇక  వీటితో పాటు సీరమ్‌ క్రియాటినిన్, సీయూఈ అనే పరీక్షలు కూడా అవసరమవుతాయి. డయాబెటిస్‌ కారణంగా మూత్రపిండాలూ ప్రభావితం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి క్రియాటినిన్‌ పరీక్షలో మూత్రపిండాలు ఏమైనా ప్రభావితం అయ్యాయా అన్న విషయం తెలుస్తుంది. అలాగే సీయూఈ పరీక్ష అన్నది మూత్రపరీక్ష. దీని ద్వారా జాండిస్‌ ఏమైనా వచ్చాయా అన్నది తెలుసుకుంటారు. అంతేగాక చక్కెర పాళ్లు నియంత్రణలో ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోడానికి హెచ్‌బీఏ1సీ, జీటీటీ (గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌) అనే పరీక్షలు అవసరమవుతాయి.

గుండె జబ్బుల నిర్ధారణ కోసం:

గుండెజబ్బుల నిర్ధారణ కోసం కొన్ని సాధారణ వైద్య పరీక్షలు

ఈసీజీ,

లిపిడ్‌ ప్రొఫైల్‌ వంటివి చేయిస్తారు. ఇక గుండెజబ్బల కోసమే చేయించాల్సిన ప్రత్యేక పరీక్షలు...

2డి ఎకో

టీఎమ్‌టీ

సీటీస్కాన్‌తో పాటు అవసరాన్ని బట్టి

కరోనరీ యాంజియో వంటివి డాక్టర్ల సలహా మేరకు చేయించాల్సి ఉంటుంది.

క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు:

క్యాన్సర్‌ నిర్ధారణ కోసం ఈ కింది సాధారణ పరీక్షలు చేస్తారు.

పురుషుల్లో ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌ (పీఎస్‌ఏ) అనే పరీక్షను ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ నిర్ధారణ కోసం చేస్తారు. చాలా చిన్న రక్త పరీక్ష అయిన దీని ద్వారా త్వరగా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను దాదాపుగా నయం చేయవచ్చు. 

ఛాతీ ఎక్స్‌–రే (ఇది అనేక వ్యాధులతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లనూ నిర్ధారణ చేస్తుంది),
అల్ట్రాస్కాన్‌ అబ్డామిన్‌ ప్రత్యేక పరీక్షలు కూడా చేస్తారు. 

బోన్‌స్కాన్‌ పరీక్ష,

 పెట్‌ స్కాన్‌ పరీక్ష వంటివి ఎముకల పరిస్థితిని ఎలా ఉందో తెలుసుకోవడం కోసం, పెట్‌ స్కాన్‌ ద్వారా ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్‌ కణం ఉందేమో తెలుసుకునేందుకు చేస్తారు. (ఇవి క్యాన్సర్‌ నిర్ధారణలో ముందుగా చేసే ప్రాథమిక పరీక్షలు, వీటిలో ఏదైనా తేడా ఉన్నట్లు తెలిస్తే మరి కాస్త అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు అవసరమవుతాయి. వీటిలో ఏమీ లేదని తెలిస్తే ఇప్పటికి క్యాన్సర్‌ ముప్పేమీ లేదని నిశ్చింతగా ఉండవచ్చు. అయితే యాభై ఏళ్ల వయసు దాటాక ఈ క్యాన్సర్‌ను కనుగొనే స్క్రీనింగ్‌ పరీక్షలను డాక్టర్‌ చెప్పిన వ్యవధుల్లో (ఇంటర్వెల్స్‌లో) చేయించాలి.)  

పళ్లకు సంబంధించిన పరీక్షలు: మన నోటి ఆరోగ్యం (ఓరల్‌ హెల్త్‌) మీదే అనేక ఒంటి సమస్యలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మన నోటిలో ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉంటే అది గుండె సమస్యలకూ దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి నోటిని శుభ్రంగా ఉంచుకుంటే దేహంలోని అంతర్గత అవయవాల్లో చాలా వాటిని ఆరోగ్యంగా ఉంచవచ్చు. అందుకే దంతాలను పరీక్షింపజేసుకోవడం కోసం ప్రతి ఆర్నెల్లకు ఒకమారు డెంటిస్ట్‌ను సంప్రదించాలి. వాటి సలహా మేరకు అవసరాన్ని బట్టి పళ్లు క్లీన్‌ చేయించుకోవాలి. ఇక  చిగుళ్ల వ్యాధులు ఏవీ లేవని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండాలి. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు చిగుళ్ల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

కంటి పరీక్షలు: మీ కళ్లను ప్రతి రెండేళ్లకు ఒకసారి కంటి నిపుణులకు చూపించుకోవాలి. ఎందుకంటే ఓ వయసు దాటాక కళ్లలో ఇంట్రాఆక్యులార్‌ ప్రెషర్‌ అనే ఒక రకం ప్రెషర్‌ను చెక్‌ చేయించుకుంటూ ఉండాలి. ఇది ఎక్కువైతే గ్లకోమాకు దారితీయవచ్చు. అందుకే ఇంట్రాఆక్యులార్‌ ప్రెషర్‌ను పరీక్ష చేయించుకుని గ్లకోమా అవకాశాలు ఏవీ లేవని తెలుసుకుని నిర్భయంగా ఉండవచ్చు.
మీకు మద్యం, సిగరెట్‌ అలవాట్లు ఉంటే...

పురుషుల్లో చాలామందికి పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు ఉంటాయి. మీరు పొగతాగేవారైతే... గుండె పరీక్షలతో పాటు... ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునే  పీఎఫ్‌టీ పరీక్ష కూడా చేయించుకోవాలి.

ఇక ఆల్కహాల్‌ అలవాటు ఉన్నవారైతే... కాలేయ సామర్థ్యాన్ని తెలుసుకుని లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ (ఎల్‌ఎఫ్‌టీ పరీక్ష), గుండె పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్‌ అబ్డామిన్‌ పరీక్షలు చేయించుకోవాలి.

స్థూలకాయం ఉంటే... మీరు ఏ మేరకు స్థూలకాయులో తెలుసుకునేందుకు బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎమ్‌ఐ)తో పాటు, థైరాయిడ్‌ సమస్యలను తెలుసుకునేందుకు అవసరాన్ని బట్టి టీ3, టీ4, టీఎస్‌హెచ్‌ పరీక్షలనూ చేయించుకోవాలి.  ఇక స్థూలకాయులు ఎఫ్‌బీఎస్, లిపిడ్‌ ప్రొఫైల్స్‌ చేయించడం కూడా అవసరం.

ఇక్కడ ప్రస్తావించిన సమస్యలేగాక ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే... వాటిని బట్టి మీ ఫిజీషియన్‌ సలహా మేరకు అవసరమైన మరికొన్ని పరీక్షలు చేయించుకోవాలి.
అరవైలలో ఆరోగ్య పరీక్షలివే...
పురుషుల్లో వయసు అరవైకి చేరాక ఆ వయసుకు తగినట్లుగా కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. అవి...

అబ్డామినల్‌ అయోర్టిక్‌ అన్యురిజమ్‌ స్క్రీనింగ్‌: పురుషుల వయసు 65–75 మధ్య ఉన్నవాళ్లు... గతంలో వాళ్లకు పొగతాగిన అలవాటు ఉంటే... అయోర్టిక్‌ అన్యురిజమ్‌ అనే కండిషన్‌ కోసం ఒకసారి అల్ట్రాసౌండ్‌ అబ్డామిన్‌ పరీక్ష చేయించుకోవడం మంచిది.

బీపీ స్క్రీనింగ్‌:
ఒక వయసు దాటాక ఇక తరచూ బీపీ చెక్‌ చెయించుకోవడం అవసరం. ఇకవేళ డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఏవైనా జబ్బులు ఉంటే దానికి సంబంధించి డాక్టర్‌ పేర్కొన్న పరీక్షలను క్రమం తప్పకుండా చేయంచాలి.

 కొలెస్ట్రాల్‌ స్క్రీనింగ్‌:
యాభై దాటాక ఒకసారి కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించి, అది నార్మల్‌ గనక వస్తే ఇక అప్పట్నుంచి ప్రతి ఐదేళ్లకోమారు కొలెస్ట్రాల్‌ స్థాయులు తెలుసుకుంటూ ఉండటం మంచిది.

ఒకవేళ వారికి డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్‌ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష చేయిస్తూ ఉండాల్సిందే.

డయాబెటిస్‌ కోసం తరచూ పరీక్షలు చేయిస్తూనే ఉండాలి. ఒకవేళ అది ఉన్నట్లు తేలితే డాక్టర్‌ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా చక్కెర నిర్ధారణ పరీక్షలు చేయించాలి.

గుండె పరీక్షలు:
ఈసీజీ, 2 డి ఎకో, టీఎమ్‌టీ  వంటి పరీక్షలు డాక్టర్‌ సలహా మేరకు చేయించాలి.

పెద్ద వయసులో ఈ పరీక్షలతో ఇక నిశ్చింత
ఏడాదిలో ఒకసారి మల పరీక్ష

ప్రతి ఐదేళ్లకోసారి ఫ్లెక్సిబుల్‌ సిగ్మాయిడోస్కోపీ. దీనితో పాటు స్టూల్‌ అక్కల్ట్‌ బ్లడ్‌ టెస్ట్‌ కొలనోస్కోపీ అనే పరీక్ష యాభై దాటిన నాటి నుంచి ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది.

కొలనోస్కోపీ అనే పరీక్షను ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది.

ఇక వ్యక్తిగతంగా ఉన్న లక్షణాలను, కుటుంబ చరిత్రను, రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ను బట్టి డాక్టర్‌ సూచించిన ఇతర పరీక్షలు చేయించుకోవాలి.

వయసు పైబడ్డాక తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు :
పురుషులు 65 ఏళ్లు దాటాక అంతకు ముందు ఎప్పుడూ తీసుకుని ఉండకపోతే ‘న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌’ తీసుకోవాలి. ఒకవేళ గతంలో తీసుకుని ఉండి, ఐదేళ్లు దాటినా ఈ వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిది.
 ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాధి నుంచి రక్షణకోసం ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిది.
 ప్రతి పదేళ్లకోమారు టెటనస్‌–డిఫ్తీరియా బూస్టర్‌ డోస్‌ తీసుకుంటూ ఉండాలి.
గతంలో ఎప్పుడూ తీసుకోకపోతే 65 ఏళ్లు దాటక టీ–డాప్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. (ఇది డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్‌ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది).
అరవై దాటక షింగిల్స్‌ లేదా హెర్పిస్‌ జోస్టర్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. గతంలో తీసుకుని ఉండకపోతే ఇది వెంటనే తీసుకోవడం మేలు.

చివరగా...
ఇవేగాక సాధారణంగా చూసుకునే పరీక్షలైన బరువు చెక్‌ చేయించుకోవడం, కింద జారిపడకుండా చూసుకోవడం, చెవులు చక్కగా వినిపిస్తున్నాయేమో చూసుకోవడం, ఆహ్లాదంగా లేకపోతే డిప్రెషన్‌కు గురికాకుండా జాగ్రత్త పడటం వంటి ఎవరికి వారు చేసుకునే పరీక్షలతోపాటు పొగతాగడం, ఆల్కహాల్‌ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వాకింగ్‌ వంటి వ్యాయామాలు చేయడం, మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటే వయసు పైబడ్డా సరే... ఆ సమయంలోనూ దీర్ఘకాలం ఆరోగ్యంగా, ఎలాంటి సమస్యలూ లేకుండా చాలాకాలం ఆరోగ్యంగా ఉంటారు.

మహిళల కోసంఉద్దేశించిన ప్రత్యేక పరీక్షలివి...
ఇక మహిళల విషయానికి వస్తే... పైన పేర్కొన్న పరీక్షలతో పాటు (పురుషుల కోసం ఉద్దేశించిన పీఎస్‌ఏ వంటివి కాకుండా... వారికే ప్రత్యేకమైన మామోగ్రామ్‌ పరీక్షలు, పాప్‌స్మియర్‌ పరీక్షల వంటివి చేయించుకుంటూ ఉండాలి. మహిళల్లో మెనోపాజ్‌ దాటాక వారిలో కొన్ని సమస్యలు కనిపించడం చాలా సాధారణం. వారి వచ్చే ఆ సమస్యలను బట్టి అవసరమైతే హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ వంటివి అవసరం కావచ్చు. అందుకోసం డాక్టర్లు సూచించిన మరికొన్ని ప్రత్యేక పరీక్షలు అవసరమవుతాయి. ఇక మెనోపాజ్‌ దశకు చేరకముందు... మహిళల్లో వారిలోని ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ కారణంగా వారి గుండెకు ఒక స్వాభావికమైన రక్షణ ఉంటుంది. మెనోపాజ్‌ తర్వాత ఆ స్వాభావిక రక్షణ తొలగిపోతుంది కాబట్టి గుండెకు సంబంధించిన పరీక్షలనూ దాంతోపాటు క్రమం తప్పకుండా హైబీపీ, షుగర్‌ పరీక్షలను చేయించుకుంటూ ఉండాల్సిందే.

డాక్టర్‌ జి. హరిచరణ్‌
సీనియర్‌ కన్సల్టెంట్, ఇంటర్నల్‌ మెడిసిన్,
కేర్‌ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు