ఆరోగ్య భాగ్య విధాత

15 Aug, 2017 00:29 IST|Sakshi
ఆరోగ్య భాగ్య విధాత

స్వస్థ భారతం

స్వాతంత్య్రం వచ్చిన 1947 నాటితో పోలిస్తే ఇప్పటికి ఆరోగ్య రంగంలో గణనీయమైన వృద్ధి చోటు చేసుకుంది. మనదేశ ఆరోగ్యరంగం పురోగతి చోటు చేసుకుందని చెప్పేందుకు చాలా తార్కాణాలే ఉన్నాయి. ఉదాహరణకు ఒకనాడు విదేశాల్లోనే సాధ్యమనుకున్న సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఇరవై ఏళ్ల కిందట కూడా ధనవంతులు గుండె ఆపరేషన్ల కోసం విదేశాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఒక మోస్తరు ఆసుపత్రుల్లో కూడా గుండెశస్త్రచికిత్సలు ప్రతిరోజూ పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. ఇక గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తుల వంటి కీలకమైన అవయవాల మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య ఎంతగానో పెరిగింది. దాంతో అప్పట్లో మనం విదేశాలకు వెళ్లడం మానేయడం అనే పరిణామం ఎలా ఉన్నా... విదేశీయులే ఇక్కడికి రావడం అనే ఒక ట్రెండ్‌ మొదలైంది. దాంతో హెల్త్‌ టూరిజం ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రజల ఆయుఃప్రమాణం దాదాపు రెట్టింపు కంటే ఎక్కువే అయ్యింది.

మందులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి మనమే అనేక దేశాలకు మందులను, వ్యాక్సిన్లను ఎగుమతి చేసే స్థితిలో ఉన్నాం. మశూచీ లాంటి మహమ్మారులను పూర్తిగా నిర్మూలించాం. ఇక వైద్య పరీక్షలను చేసే ఉపకరణాల తయారీ విషయానికి వస్తే... దాదాపు 90 శాతం చిన్న చిన్న వైద్యపరీక్షా సాధనాలను మనమే తయారు చేసుకుంటున్నాం. వైద్య విద్య కూడా గణనీయంగానే అభివృద్ధి చెందింది. స్వాతంత్రం వచ్చే నాటితో పోలిస్తే వైద్య కళాశాలల సంఖ్య ఈ 70 ఏళ్లలో ఇరవై రెట్లు పెరిగింది. అలాగే ఒకనాడు చిన్న చిన్న వైద్య అవసరాల కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితి నుంచి విదేశీయులే వారికి ఇక్కడ చవగ్గా లభ్యమవుతున్న వైద్య సదుపాయాల కోసం ఇక్కడికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఈ పురోభివృద్ధి సామాన్యుడికి ఏమేరకు అందిందనే అంశం మాత్రం ఇంకా ప్రశ్నార్థకమే. శీర్షికలవారీగా ఆయా అంశాలను పరిశీలిస్తే...

ఆయుః ప్రమాణాలు పెరిగినప్పటికీ...
ఆరోగ్యరంగంలో వచ్చిన మార్పులతో మన దేశవాసుల ఆయుఃప్రమాణం బాగానే పెరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో భారతీయుల ఆయుఃప్రమాణం 32 ఏళ్లు  మాత్రమే. కానీ తాజాగా ఇప్పుడు 2016 నాటి లెక్కల ప్రకారం మన దేశవాసుల ఆయుఃప్రమాణం 68.3 ఏళ్లు. దీన్ని బట్టి మన ప్రజలకు మంచి ఆరోగ్యం అందుతోందనే భావన వస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం వేరు.  బొగ్గు, పెట్రోలియం, విద్యుత్‌ వంటి శక్తి వనరుల వినియోగాలతో క్రమంగా అన్ని రకాల కాలుష్యాలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్‌ వినియోగం విపరీతమైంది. శారీరక శ్రమ చేయడం నామోషీ అయ్యింది. మొక్కలు నాటకపోవడం, చెట్లు నరకడంతో అనర్థాలు పెరుగుతున్నాయి. వీటి  కారణంగా ఊబకాయం, అధిక రక్తపోటు, రక్తనాళాల్లో అధిక  కొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం, దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుల వంటి నాన్‌కమ్యూనికబుల్‌ డిసీజ్‌లు బాగా పెరిగిపోయాయి. నేటి సమాజంలో పైన పేర్కొన్న జబ్బుల్లో ఏదో ఒకదానితో బాధపడేవారు ప్రతి ఇంట్లోనూ ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి జబ్బులు తగ్గాయా లేక పెరిగాయా అనేది ఆలోచించాల్సిన అంశం.

మందుల లభ్యత మంచికా... చెడ్డకా?
కొన్ని కొత్త మందులు కనిపెట్టాక అవి రోగనిరోధక శక్తికి బాసటగా నిలవడంతో కొన్ని జబ్బులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఉదాహరణకు... మశూచీ వ్యాక్సిన్‌ కనిపెట్టాక ఆ రోగం పూర్తిగా మటుమాయం అయ్యింది. అలాగే అనేక రకాల వ్యాక్సిన్లు, మందుల కారణంగా ఇప్పుడు పోలియో పూర్తిగా అదుపులో ఉంది. ధనుర్వాత మరణాలు, క్షయ రోగుల సంఖ్య దాదాపుగా అదుపులోకి వచ్చింది. ప్లేగు లాంటి జబ్బులు కనబడటం లేదు. కలరా, టైఫాయిడ్‌ వంటి జబ్బులకు సమర్థమైన మందులు అందుబాటులో ఉన్నాయి. 70 ఏళ్ల కిందట మన దేశం అనేక ఔషధాలను దిగుమతి చేసుకునే స్థితిలోనే ఉంది. ఇప్పుడు చాలా మందులను ఎగుమతి చేసేంతగా దేశం అభివృద్ధి చెందింది. అయితే 2000 సంవత్సరంలో డబ్ల్యూటీఓ (వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌)లో చేరి మన ప్రాసెస్‌ పేటెంటు చట్టాన్ని ప్రాడక్ట్‌ పేటెంట్‌గా మార్చుకున్నందున చాలా నష్టపోయాం.

అయినప్పటికీ మనదేశం  ఇంకా మందులను ఎగుమతి చేసే పరిస్థితుల్లోనే ఉండటం విశేషం. అయితే మందుల లభ్యత ఇంత విశేషంగా ఉన్నా ఇక్కడ మన దేశ విధాన రూపకర్తలు ఆలోచించాల్సిన కీలకమైన అనేక జటిల అంశాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ప్రజలకు అవసరమైన మందులను గురించి వివరిస్తూ... 116 ఔషధాలు ఉంటే ప్రజారోగ్యానికి అవి చాలని 1975లో హాథీ కమిటీ పేర్కొంది. అయితే ఆ సంఖ్య 150గా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ చెప్పింది. అన్ని జబ్బుల వైద్య చికిత్స కోసం మొత్తం 256 మందులు అవసరమని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. కానీ ప్రస్తుతం మన దేశ మార్కెట్‌లో 85,000 ఫార్ములేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాలావరకు అవసరమైన, అర్థరహితమైన కాంబినేషన్లు, ప్రమాదకరమైన మందులే ఉన్నాయి. ఈ దృష్టి కోణంలో ఆలోచించినప్పుడు మందుల లభ్యత అన్నది అభివృద్ధేనా లేక ప్రతికూల అంశమా అన్నది కీలక చర్చనీయాంశం.

వైద్యపరీక్ష ఉపకరణాల విషయంలో...
ఇక వైద్య ఉపకరణాల విషయానికి వస్తే... దాదాపు 90 శాతం చిన్న చిన్న వైద్యపరీక్ష సాధనాలను మనమే తయారు చేసుకునే స్థాయికి వచ్చాం. కానీ సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్‌ స్కాన్‌ వంటి అనేక పైస్థాయి వైద్య పరీక్ష సాధనాలను మాత్రం ఇంకా విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. నగర ప్రజల అవసరాలను మినహాయిస్తే... పట్టణాలు, మారుమూల గ్రామాలకు వాటి లభ్యత ఇంకా చేరువ కాలేదు. ఆ మాటకొస్తే కొన్ని జిల్లా కేంద్రాల్లోనూ అత్యున్నత స్థాయి వైద్య నిర్ధారణ పరీక్ష ఉపకరణాలు అందుబాటులో లేవు.

వైద్య విద్య – మెడికల్‌ కాలేజీలు...
ఈ 70 ఏళ్లలో మన దేశంలో ప్రైవేటు వైద్యకళాశాలల సంఖ్య పెరిగింది, స్వాతంత్య్రం వచ్చిన నాటికి మన దేశంలో మొత్తం 23 మెడికల్‌ కాలేజీలు ఉండేవి. కానీ ఇప్పుడు (2016) నాటికి వాటి సంఖ్య 439కి పెరిగింది.  స్వాతంత్య్రం వచ్చిన నాటితో పోలిస్తే మెడికల్‌ కాలేజీల సంఖ్య దాదాపు 20 రెట్ల అభివృద్ధి కనిపిస్తున్నా ఇది సరిపోదు. ప్రస్తుతం ప్రతి 2000 మంది రోగులకు ఒక పడక మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపు ప్రతి ఏడాది 50,000 మంది డాక్టర్లు అందుబాటులోకి వస్తున్నారు. అయినా ఈ సంఖ్య సరిపోదు. 2034 నాటికి 35 లక్షల పడకలు అవసరమవుతాయనేది ఒక ఉజ్జాయింపు లెక్క. ప్రజల ఆరోగ్యానికి బాధ్యత వహించేలా చేసే ‘సోషల్‌ అండ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌’ అనే అంశం మీద వైద్యవిద్యార్థులకు ప్రేమా, గౌరవం రెండూ ఉండటం లేదు. కుప్పలు తెప్పలుగా డబ్బులు సంపాదించి పెట్టే స్పెషలైజేషన్‌ మీదే ఇప్పుడు వైద్య విద్యార్థుల దృష్టి ఉంటోంది.

ఇక 70 ఏళ్ల వైద్య భారతాన్ని గొప్పగా ఆవిష్కరించుకుంటూ... ఇంతగా అభివృద్ధి చెందిందని మనం గొప్పలు చెప్పుకుంటున్న వేళ ఆక్సిజన్‌ అందక యూపీలో సుమారు 70 మంది చిన్నారులు మృతిచెందడం ఒక మాయనిమచ్చ.

హెల్త్‌ టూరిజం
పెరుగుతూనే ఉన్నప్పటికీ...

ప్రస్తుతం దేశంలోని ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ రంగ ప్రభావం విస్తృతమవుతోంది. ఆరోగ్య పర్యాటకం అనే అంశంలో ఒకనాడు దాదాపు ఏమీ లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మనదేశం రూ. 19, 226 కోట్లు (మూడు బిలియన్ల అమెరికన్‌ డాలర్లు) ఆర్జించే స్థితిలోకి వచ్చింది. 2020 నాటి అంచనా లెక్కల ప్రకారం ఇది రూ. 51,270 కోట్లు (8 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు)కు చేరనుంది. అయితే కార్పొరేట్‌ రంగంలో  హార్ట్, లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్స్, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మెదడులోని అత్యంత సున్నితమైన సర్జరీలు వీలుకాని చోట్లలోనూ రేడియేషన్‌ ఇవ్వగల స్టీరియోటాక్టిక్‌ రేడియేషన్‌ చికిత్సలను అందించగల అత్యాధునిక స్థాయి వైద్యకేంద్రాలు ఇక్కడ కొత్తవి ఎన్నో వస్తున్నాయి. దాంతో పాశ్చాత్యదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకునే చాలా మంది విదేశీయులు సైతం భారత్‌కే తరలి వస్తున్నారు. కానీ మనదేశస్తులకే వాటిని అందిపుచ్చుకునేంత ఆర్థిక స్తోమత లేదు. అంటే విదేశీయుల కరెన్సీలతో పోల్చుకున్నప్పుడు వాళ్లకు చాలా చవకగా లభ్యమయ్యే చాలా ఆధునాతన వైద్య సదుపాయాలు స్వదేశీయులకు మాత్రం అందడం లేదు.

అందరికీ ఆరోగ్యం కోసం జరగాల్సిందేమిటి?
చిన్న చిన్న అంశాలపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించడం ద్వారానే చాలా ఆరోగ్యరంగంలో పెద్ద పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. దాంతో సమాజమూ ఆరోగ్యంగా మారే అవకాశమూ ఉంది. ఉదాహరణకు...అందరికీ పుష్టికరమైన పోషకాహారం లభ్యత ద్వారా ఆరోగ్యం బాగుటుంది. అయితే సమాజంలోని 30 శాతం మందికి ఆహార లభ్యత లేని కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి జబ్బులు వస్తున్నాయి. మరో 30 శాతం మందికి ఆహారం ఎక్కువైన కారణంగా డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధులు వస్తున్నాయి. అందుకే అందరికీ సమతులాహారం అందేలా విధానాల రూపకల్పన జరగాలి.
     
చాలా గ్రామాల్లో ఇప్పటికీ రక్షిత మంచినీళ్లు దొరకడం లేదు. దాంతో చిన్న చిన్న గ్రామాల్లోనూ ‘సీసాలలో మంచినీళ్లు’ కొనుక్కోవాల్సిన పరిస్థితి. కాబట్టి ‘కొనుక్కోగలిగితేనే నీళ్లు’ అనే ప్రస్తుత పరిస్థితి నుంచి ‘ఆరోగ్యం కోసం అందరికీ నీళ్లు’ అనే విధంగా ప్రభుత్వాలు సురక్షితమైన మంచినీరు అందించాలి.మంచినీళ్లు లభ్యం కావడం లేదు కానీ... అలాంటి చోట్ల కూడా జబ్బులను ప్రేరేపించే మద్యం, సారాయి వంటివి మాత్రం విరివిగా దొరుకుతున్నాయి.  ప్రభుత్వాలే మద్యాన్ని ఒక లాభదాయకమైన ఆదాయ వనరుగా చూస్తూ, మద్యం మీద భారీగా వ్యాపారం చేస్తున్నాయి. ఇది సరికాదు. అలాగే పొగతాగడం హానికరం అనే సూచనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది.

పనిచేసే అలవాటును మరింతగా ప్రోత్సహించాలి. పనిచేయడం వల్ల ఆదాయం వస్తుంది. ఆదాయం బాగుంటే ఆరోగ్యానికి అవసరమైన అన్ని సౌకర్యాలూ, అంశాలను కొనుక్కోవచ్చు. కానీ మనం మన పిల్లలను స్కూలు దశ నుంచే క్రమంగా శారీరక శ్రమకు దూరం చేస్తున్నాం. దాంతో పని అలవాటుతో పాటు వ్యాయామాలు సైతం కొరవడి జబ్బులు వస్తున్నాయి.ఆహారం, నీళ్లు, పని, దురలవాట్లు దూరం చేయడం అనే ఈ ప్రాథమిక అంశాలతోనే చాలావరకు సమాజాన్ని ఆరోగ్యవంతం చేయడంతో పాటు... అనేక రుగ్మతలను మొదట్లోనే తుంచేయవచ్చు. అనేక జబ్బులను సమర్థంగా నివారించవచ్చు.
– డాక్టర్‌ వి. బ్రహ్మారెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులు

మరిన్ని వార్తలు