ఆరోగ్య వివరాలు ఇచ్చే సూపర్‌ స్టిక్కర్‌!

19 Aug, 2019 07:21 IST|Sakshi

ఆరోగ్యంగా ఉన్న వారికి పెద్దగా సమస్యల్లేవుగానీ... రోజూ బీపీ, గ్లూకోజ్, హార్ట్‌రేట్‌ వంటివి పరీక్షించుకోవాలనే వారికి మాత్రం బోలెడన్ని ఇబ్బందులు. సూదితో పొడుచుకుని రక్తంలో చక్కెర ఎంత ఉందో తెలుసుకోవాలి. బీపీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ సమస్యలేవీ లేకుండా చేసేందుకు స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఫొటోలో కనిపిస్తున్న స్టిక్కర్‌ను చర్మానికి అతికించుకుంటే చాలు.. మన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. గుండె కొట్టుకునే తీరుకు, ఉఛ్ఛ్వాస, నిశ్వాసలకు అనుగుణంగా మన చర్మంపైభాగం సంకోచ వ్యాకోచాలకు గురవుతుందన్నది మనకు తెలుసు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ స్టిక్కర్‌ పనిచేస్తుంది. కీళ్ల వద్ద అతికించుకుంటే కాలి కదలికలను గుర్తించి సమస్యలను ఏకరవు పెడుతుంది. బాడీ నెట్‌ అని పిలుస్తున్న ఈ సరికొత్త పరికరాన్ని ఉష్ణోగ్రత, ఒత్తిడి వంటి వివరాలను సేకరించేందుకు వాడుకోవచ్చునని గుండె పరిస్థితిని, నిద్రలోపాలను గుర్తించేందుకూ వాడుకోవచ్చునని అంటున్నారు జెనాన్‌ బావ్‌ అనే శాస్త్రవేత్త. ఈ స్టిక్కర్లను స్మార్ట్‌ వస్త్రాలతో కలిపి వాడుకునేలా చేయాలన్నది తన లక్ష్యమని.. తద్వారా స్మార్ట్‌ఫోన్లు, ఫిట్‌నెస్‌ గాడ్జెట్ల కంటే కచ్చితమైన సమాచారం సేకరించగలమని వివరించారు. పరిశోధన వివరాలు నేచర్‌ ఎలక్ట్రానిక్స్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. 

మరిన్ని వార్తలు