ఒత్తిడితో ఒళ్లునొప్పులు...

15 Sep, 2016 23:14 IST|Sakshi
ఒత్తిడితో ఒళ్లునొప్పులు...

అదేపనిగా పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారు తీవ్రమైన అలసట మొదలుకొని ఇంకా అనేక సమస్యలు వస్తాయి. ఇక కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలు సైతం రావచ్చు. వాటిని నివారించేందుకు ఈ సూచనలు పాటించడం మేలు...

పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగలో కార్బన్‌మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది.

చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు.

మీ వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా సమస్యలు, మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన  (టార్గెట్స్ రీచ్ కావాల్సిన) వృత్తిలో ఉంటే తీవ్రమైన అలసటకు లోను కావడం చాలా సాధారణం.

కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి.

కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు.

రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి.

భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే  రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు.

ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ-హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు.

ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా ఒళ్లునొప్పులు, అలసటతోనూ, నడుంనొప్పి వంటి వాటితో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి.

మరిన్ని వార్తలు