‘సూక్ష్మ’ పంటలో ఆరోగ్య మోక్షం!

2 Jun, 2020 11:55 IST|Sakshi
ట్రేలో పెరిగిన 7 రోజుల ముల్లంగి సూక్ష్మ మొక్కలు

సూక్ష్మ మొక్కల (మైక్రోగ్రీన్స్‌)ను సులువుగా ఇంటి దగ్గరే పెంచుకోవచ్చు. వీటిని దైనందిన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా తరిగిపోతున్న వనరులు, పెరుగుతున్న భూతాపం, పౌష్టికాహార లోపం వంటి సమస్యలను నివారించవచ్చునంటున్నారు ‘మేనేజ్‌’ శాస్త్రవేత్తలు

సూక్ష్మ మొక్కలు.. 7 నుంచి 10 రోజుల మొక్కలు. కూరగాయలు, ఆకుకూరలు, చిక్కుళ్లు తదితర రకాల మొక్కలు. వీటిని 2 అంగుళాలు లేదా అంతకంటే పొడవైన తరువాత కత్తిరించి వివిధ వంటకాలలో లేదా పచ్చివైనా తినవచ్చు. చాలా సార్లు మొలకెత్తిన గింజలు, సూక్ష్మ మొక్కలకు మధ్య తేడాని గుర్తించడంలో చాలా మంది పొరపడుతుంటారు. మొలకెత్తిన గింజలను కేవలం నీరు చల్లి ఒక వస్త్రంలో మొలక కట్టి తయారు చేయవచ్చు. కానీ సూక్ష్మ మొక్కలను నీరు, టిష్యూస్‌ మట్టి లేదా కంపోస్టు వంటి మాధ్యమంలో పెంచడం జరుగుతుంది. మామూలుగా వంటింట్లో దొరికే వివిధ విత్తనాలను ఉపయోగించి అతి తక్కువ స్థలంలో సూక్ష్మమొక్కలను పెంచుకోవచ్చు.

వీటిని తేలికగా పెంచుకోవచ్చు. సూక్ష్మ మొక్కలను రెండు ఆకుల దశలో కత్తిరించాలి. కత్తిరించిన వాటిని నీటితో శుభ్రపరిచి వంటలలో లేదా పచ్చివి అయినా తినవచ్చు.

40 రెట్లు ఎక్కువ పోషకాలు
సూక్ష్మమొక్కలు చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి. అన్నిరకాల మొక్కలు దాదాపుగా పొటాషియం, ఇనుము, జింక్, మెగ్నీషియం, కాపర్‌లను అధిక శాతం కలిగి ఉంటాయి. అంతేగాక అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
ఎదిగిన ఆకుకూరల కంటే ఈ సూక్ష్మ మొక్కలు 4 నుంచి 40 రెట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. వివిధ జంతు పరిశోనలలో శరీర బరువును, చెడు కొలస్ట్రాల్‌ను, కొవ్వును, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తాయని నిరూపితమైనది.
సూక్ష్మమొక్కలను తినటం ద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ మొక్కలు పెద్దగా ఎదిగిన కూరగాయల మొక్కల కంటే సమానంగా, ఎక్కువగా పోషకాలను కలిగి ఉంటాయి. కావున వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ ఎక్కువగా పోషకాలను పొందవచ్చు.

పెంపకానికి కావలసినవి
విత్తనాలు: అన్ని రకాల కూరగాయల విత్తనాలను ఉపయోగించుకొని సూక్ష్మ మొక్కలుగా పెంచుకోవచ్చు. ఉదాహరణకు బీట్‌రూట్, ముల్లంగి, ఆవాలు, తోటకూర, అవిసెలు, పెసర్లు మొదలగునవి.

మిశ్రమాన్ని బట్టి రుచి
సాధారణ మట్టిని ఉపయోగించి పెంచడమే కాకుండా, బలమైన మట్టి మిశ్రమం, కొబ్బరిపొట్టు, నీరు, టిష్యూస్‌ ఉపయోగించి కూడా పెంచుకోవచ్చు. మనం ఉపయోగించే మిశ్రమాన్ని బట్టి సూక్ష్మ మొక్కల రుచి, పోషకాలు ఆధారపడి ఉంటాయి.

ట్రే / ప్లేట్లు
ఈ సూక్ష్మ మొక్కలు పెంచడానికి చిన్న ట్రేలు లేదా ప్లేట్లు కావాలి. ఇవి వారం నుంచి పది రోజుల్లో కత్తిరించి వాడుకోవచ్చు. కాబట్టి ఇంట్లో ఉన్న పాత్రలను కూడా వాడుకోవచ్చు.
నీరు: స్ప్రే బాటిల్‌ను ఉపయోగించి నీటిని చల్లాలి.

సూక్ష్మ మొక్కలను పెంచే విధానం
హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్‌), జాతీయ పోషకాహార సంస్థతో కలిసి ఈ సూక్ష్మ మొక్కలపై అధ్యయనం చేస్తున్నారు. సూక్ష్మమొక్కలు 7–14 రోజుల వ్యవధిలో కత్తిరించడానికి సిద్ధమవుతాయి. వాటిలోని పోషక విలువలు అవి పెరిగే మాధ్యమంపై ఆధారపడి ఉంటాయి.
బలమైన మట్టిమిశ్రమం: దీనిలో మట్టి, వర్మీ కంపోస్టును 1:1 శాతంగా లేదా సమపాళ్లలో కలుపుకొని ఒక ట్రేలో తీసుకొని దానిపైన విత్తనాలను చల్లుకోవాలి. పైన మళ్లీ కొంత మిశ్రమాన్ని చల్లాలి. తరువాత నీటిని స్ప్రేయర్‌తో మెల్లగా చల్లుకోవాలి. 2 నుంచి 3 రోజుల్లో మొలకెత్తుతాయి.

కొబ్బరి పొట్టు: ఒక ట్రేలో కొబ్బరి పొట్టును రెండు నుంచి మూడు అంగుళాల ఎత్తులో పరుచుకొని ఆ పైన విత్తనాలు చల్లుకోవాలి. విత్తనాలు కనపడకుండా మరోమారు కొబ్బరిపొట్టును ఒక పొరలాగా వేసుకొని నీరు చల్లుకోవాలి. ఈ ట్రేను రెండు రోజుల వరకు మూతతో కప్పి ఉంచి తరువాత రెండు రోజులు ఎండ తగిలేలా ఆరుబయట ఉంచాలి.

టిష్యూస్‌: ముఖానికి ఉపయోగించే టిష్యూ పేపర్‌లను ఉపయోగించి కూడా సూక్ష్మ మొక్కలను పెంచుకోవచ్చు. ఒక ట్రేను తీసుకొని టిష్యూలను పరిచి దానిపైన నీటిని చల్లాలి. విత్తనాలను చల్లుకొని తరువాత మరలా కొద్దిగా నీటిని చల్లాలి. ఈ టిష్యూస్‌ తడి ఆరిపోకుండా ఎప్పుడూ కొంత నీరు చల్లుతూ ఉండాలి. విత్తనాలు వేసిన ట్రేలో తేమ ఆవిరైపోకుండా ఉండటానికి మరొక ట్రేతో కప్పి ఉంచాలి.

హైడ్రోపోనిక్స్‌: ఒక ట్రేని తీసుకొని నీటితో నింపుకొని దానిపైన వేరొక జాలీ ట్రేని అమర్చి విత్తనాలు చల్లుకోవాలి. కింద ట్రేలో ఉన్న నీరు పైన పెట్టిన జాలీ ట్రేకి తాకే విధంగా చూసుకోవాలి.
సూక్ష్మ మొక్కలను పెంచుకొనే విధానంలో దశలు
1. ముందుగా విత్తనాలను శుద్ధి పరుచుకొని పెద్ద సైజు కలిగిన వాటిని తొందరగా మొలకెత్తడం కోసం గోరువెచ్చని నీటిలో కొన్ని గంటలు లేదా ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి.
2. మొలకలు వేయడానికి కావలసిన పాత్రలు లేదా ట్రేలు, మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. మట్టి మిశ్రమాన్ని 2 నుంచి 3 సెం.మీ.లు లేదా ట్రేకి 3/4వ భాగం వరకు నింపుకోవాలి.
3. విత్తనాలను మెల్లిగా సమాంతరంగా చల్లుకోవాలి. తరువాత స్ప్రే బాటిల్‌తో నీటిని చల్లుకొని మళ్లీ ఒక పొర పలుచగా మట్టిని కప్పుకోవాలి. మట్టిమిశ్రమం ఎండిపోకుండా రోజూ చూసుకుంటూ ఉండాలి. ఎక్కువగా నీరు పోయటం వలన విత్తనాలు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది.
4. విత్తనాల నుంచి మెలకలు 2.5 నుంచి 10 సెంటీమీటర్లు ఎత్తు ఎదిగిన తరువాత వాటిని నెమ్మదిగా కాండం నుంచి పైకి కత్తిరించి రోజు ఆహారంలో వాడుకోవాలి. (ఇంకా ఉంది)– డా. వినీత కుమారి (83672 87287),డెప్యూటీ డైరెక్టర్‌ (జెండర్‌ స్టడీస్‌),మేనేజ్, హైదరాబాద్‌.

మరిన్ని వార్తలు