శీతాకాలంలో పెరగనున్న హృద్రోగ ముప్పు..

25 Oct, 2018 11:56 IST|Sakshi

లండన్‌ : శీతాకాలంలో గుండె జబ్బుల ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. చలికాలంలో శీతల గాలులు, తక్కువ సూర్యరశ్మి కారణంగా రక్తనాళాలు కుచించుకుపోయే ప్రమాదం ఉందని, ఇది గుండె పోటుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. గుండెకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గి పెనుముప్పు ఎదురయ్యే అవకాశం పది శాతం అధికమని అథ్యయన రచయిత, లండ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డేవిడ్‌ ఎర్లింగె వెల్లడించారు. శీతాకాలంలో జలుబు, ఫ్లూ జ్వరాలు సాధారణం కాగా, గుండె జబ్బుల రిస్క్‌ కూడా అధికమని చెప్పారు. జీరో సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఈ ముప్పు అధికమని వెల్లడించారు.

స్వీడిష్‌ నేషనల్‌ రికార్డులను 1998 నుంచి 2013 వరకూ పరిశోధకులు విశ్లేషించి ఈ అంచనాకు వచ్చారు. 50 నుంచి 89 ఏళ్ల మధ్య 2,74,000 మంది సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. తక్కువ ఉష్ణోగ్రతలతో పాటు చలిగాలులు, సూర్యరశ్మి తక్కువగా ఉండే రోజుల్లో గుండె పోటు ముప్పు అధికమని ప్రొఫెసర్‌ ఎర్లింగె తెలిపారు. ఉష్ణోగ్రతలు సున్నా సెంటీగ్రేడ్‌ (32 డిగ్రీల ఎఫ్‌) కంటే తక్కువగా ఉన్న రోజుల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందని తమ పరిశోధనలో వెల్లడైందని చెప్పారు.

ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పెరిగిన సందర్భాల్లో గుండె పోటు రిస్క్‌ తక్కువగా ఉన్నట్టు గుర్తించామన్నారు. రక్త సరఫరా నిలిచిపోయి గుండె కణాలు నిర్జీవమవడంతో వచ్చే గుండెపోటు అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించాలన్నారు. శీతాకాలంలో కొవ్వు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా గుండె ఆరోగ్యానికి హానికరమని, అలాగే సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో విటమిన్‌ డీ సరిగ్గా అందకపోవడం కూడా గుండె జబ్బుల రిస్క్‌ పెంచుతుంది. కాగా అథ్యయన వివరాలు జామా కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు